మా సమస్యలను పరిష్కరించండి ఎస్టీవోల ద్వారా సీఎస్‌కు పెన్షనర్ల వినతి

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
సమస్యలు పరిష్కరించాలంటూ ఉప ఖజానాధికారి (ఎస్టీవో)ని తెలంగాణ ఆల్‌ పెన్షనర్స్‌ అండ్‌ రిటైర్డ్‌ పర్సన్ల అసోసియేషన్‌ (టీఏపీఆర్‌పీఏ) రాష్ట్ర కమిటీ డిమాండ్‌ చేసింది. రాష్ట్రంలోని అన్ని ఎస్టీవో కార్యాలయాధిపతుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌)కు వినతి పత్రాన్ని పంపించారు. మంగళవారం హైదరాబాద్‌ లోని మోతీగల్లీలో టీఏపీఆర్‌పీఏ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనను నిర్వహించారు. ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలకుర్తి క్రిష్ణమూర్తి మాట్లాడుతూ ప్రతినెల మొదటి తేదీనే పెన్షన్లు చెల్లించాలనీ, ఈ-కుబేర్‌లో పెండింగ్‌లో ఉన్న బిల్లులను బ్యాంకు ఖాతాలకు జమచేయాలని డిమాండ్‌ చేశారు. వేతన సవరణ కమిషన్‌ (పీఆర్సీ)ని నియమించాలనీ, ఐఆర్‌ ప్రకటించాలని కోరారు. ఈహెచ్‌ఎస్‌ కార్డులు అన్ని కార్పొరేట్‌, ప్రయివేటు, ప్రభుత్వ ఆస్పత్రుల్లో చెల్లుబాటయ్యే లా నగదు రహిత వైద్యం అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టీఏపీఆర్‌పీఏ నాయకులు ఎం నరహరి, నీలం రమేశ్‌, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 18 చోట్ల మంగళవారం నిరసన ప్రదర్శనలను నిర్వహించి ఎస్టీవో, ఎంఆర్‌వోల ద్వారా ప్రభుత్వానికి వినతిపత్రాలను సమర్పించారు.

Spread the love