న్యూజిలాండ్‌లో పోటెత్తిన వరదలు

– ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం
వెల్లింగ్టన్‌ : న్యూజిలాండ్‌లో ఉష్ణమండల తుఫాను వల్ల రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఈ తుఫానుతో వరదలు పోటెత్తడంతో న్యూజిలాండ్‌ ప్రభుత్వం దేశవ్యాప్తంగా మంగళవారం అత్యవసర పరిస్థితిని విధించింది. ‘న్యూజిలాండ్‌లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడుతున్నది. ఈ కారణంగా పదివేల ఇళ్లలో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. దీంతో దేశవ్యాప్తంగా ఎమర్జెనీ విధించాము’ అని అత్యవసర నిర్వహణా మంత్రి కీరన్‌ మెక్‌ అనుల్టీ తెలిపారు. అయితే ఈ అనుకోని తుఫాను వల్ల ఉత్తర ద్వీపంపై బాగా ప్రభావం చూపుతుందని, ఇది న్యూజిలాండ్‌వాసులకు అతిపెద్ద విపత్తు అని మంత్రి కీరన్‌ మెక్‌ అనుల్టీ పేర్కొన్నారు. తుఫాను ఎమర్జెనీ సేవలకు కూడా ఆటంకంగా నిలుస్తుందని ఆయన అన్నారు. న్యూజిలాండ్‌ అతిపెద్ద నగరమైన ఆక్లాండ్‌కు సమీపంలో ఉన్న కొన్ని ప్రాంతాలలో ఇళ్లలోకి భారీగా వరద నీరు చేరింది. కొండచరియలు విరిగిపడ్డాయి. అలాగే న్యూజిలాండ్‌లో ఓ ఇల్లు కూలిపోయిన ప్రాంతానికి వెళ్లిన ఎమర్జెన్సీ సర్వీసెస్‌, అగ్నిమాపక సిబ్బందిలో ఒకరు తప్పిపోయారని, మరొకరి పరిస్థితి విషమంగా ఉందని మంత్రి కీరన్‌ మెక్‌ తెలిపారు. ‘ఈ తుఫాను వల్ల ఉత్తర ద్వీపకల్పంలో అత్యవసర సేవలందించడానికి కూడా ఇబ్బంది ఉంది. అక్కడ అత్యవసర సేవలను కూడా అందించలేక పోతున్నామని’ ఫైర్‌ సర్వీసెస్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ కెర్రీ గ్రెగోరీ అన్నారు. వాతావరణ పరిస్థితుల వల్ల సోమ వారం ఎయిర్‌సర్వీసెస్‌ విమానాలను నిలిపివేసింది. మంగళవారం వాతావ రణం అనుకూలంగా ఉంటే.. కొన్ని విమాన సర్వీసులు తిరిగి ప్రారం భమయ్యే అవకాశమున్నట్లు ఎయిర్‌ న్యూజిలాండ్‌ వెల్లడించింది. కాగా, న్యూజిలాండ్‌లో అత్యవసర పరిస్థితిని విధించడం ఇది మూడోసారి. 2019లో క్రిస్ట్‌చర్చిపై ఉగ్రవాద దాడులు జరిగినప్పుడు, 2020లో కోవిడ్‌ కారణంగా న్యూజిలాండ్‌ ప్రభుత్వం ఎమర్జెన్సీ విధించింది. తాజాగా తుఫాను వల్ల ఇప్పుడు అత్యవసర పరిస్థితిని విధించింది.

Spread the love