కండ్లకలకపై ప్రజలకు అవగాహన కల్పించాలి

– అధికారులకు మంత్రి హరీశ్‌ రావు ఆదేశం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రవ్యాప్తంగా కండ్లకలక కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలకు ఆ వ్యాధి రాకండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వ్యాప్తి నివారణా చర్యలు, చికిత్స తదితర అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులను వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. మంగళవారం సచివాలయంలో జిల్లా వైద్యాధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కండ్లకలక, ఇతర సీజనల్‌ వ్యాధుల పట్ల తమ వైద్యారోగ్యశాఖ అప్రమత్తంగా ఉందని తెలిపారు. కండ్లకలక విషయంలో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఈ తరహా ఇన్ఫెక్షన్‌ కారణంగా ప్రమాదకర పరిస్థితులేమి ఏర్పడవని స్పష్టం చేశారు. సరోజినీ దేవి కంటి ఆస్పత్రి వేళలు పెంచాలని ఆ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ రాజలింగంను మంత్రి ఆదేశించారు.
తెలుగులోనూ…. ఏఎన్‌ఎం పరీక్ష
ఎంపీహెచ్‌ఏ ఫిమేల్‌ (ఏఎన్‌ఎం) పరీక్ష నిర్వహణ విషయంలో ఏఎన్‌ఎంల నుంచి వచ్చిన విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు. వారి కోరిక మేరకు పరీక్షను ఇంగ్లీష్‌తో పాటు, తెలుగులోనూ నిర్వహించాలని సూచించారు. ప్రస్తుతం విధులు నిర్వర్తిస్తున్న వారికి ఉచితంగా శిక్షణ ఇప్పించాలనీ, అవసరమైన స్టడీ మెటీరియల్‌ అందజేయాలని ఆదేశించారు. దీర్ఘకాలికంగా పనిచేస్తున్న వారికి తగిన వెయిటేజ్‌ వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని వైద్యారోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీని ఆదేశించారు.

Spread the love