ఎక్కడికక్కడే ప్రాథమిక వైద్యం..!

 Basic medicine anywhere..!– పెద్దాస్పత్రులపై తగ్గిన భారం
– గ్రేటర్‌ బస్తీ దవాఖానాలు, పీహెచ్‌సీలతో మార్పు
– 85 శాతం వరకు ఇక్కడే చికిత్సలు
నవతెలంగాణ-సిటీబ్యూరో
జ్వరం, దగ్గు, జలుబు లాంటి లక్షణాలు కనిపిస్తే చాలు గతంలో గాంధీ, ఉస్మానియా, ఫీవర్‌తోపాటు నగరంలోని పెద్దాస్పత్రులకు రోగులు పరుగులు పెట్టేవారు. గంటల తరబడి క్యూలో నిలబడాల్సి వచ్చేది. కొన్ని సందర్భాల్లో ఓపీ సమయం సైతం అయిపోయి మరుసటి రోజు వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. తీరా వైద్యుడిని కలిశాక టెస్టుల కోసం మరో రెండ్రోజులు ఆగాల్సి వచ్చేది. ఇదంతా గతం. ప్రస్తుతం అలాంటి పరిస్థితుల్లేవంటున్నారు వైద్యాధికారులు. గ్రేటర్‌ హైదరాబాద్‌ వ్యాప్తంగా ఎక్కడికక్కడ ప్రాథమిక వైద్య సేవలు అందుబాటులోకి రావడంతో ఒత్తిడి తగ్గిందని అంటున్నారు.
బస్తీ దవాఖానాల రాకతో ఉస్మానియా, గాంధీ, ఫీవర్‌ ఆస్పత్రితోపాటు ఇతర పెద్దాస్పత్రులకు రోగుల సంఖ్య రోజురోజుకూ తగ్గుతోంది. ప్రస్తుతం ఉస్మానియాలో 1500, ఫీవర్‌ హాస్పిటల్‌లో 500 వరకు ఓపీ కొనసాగుతోంది. వర్షాకాలంలో ఈ రెండు ఆస్పత్రులు రోగులతో కిటకిటలాడేవి. ప్రస్తుతం బస్తీ దవాఖానాల రాకతో పరిస్థితి మారింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, బస్తీ దవాఖానాలకు రోగుల సంఖ్య పెరుగుతోంది. వాస్తవానికి పెద్దాస్పత్రుల్లో సర్జరీలు, ఇతర క్లిష్టమైన చికిత్సలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. కానీ రోగులు జ్వరానికి కూడా పెద్డాస్పత్రులకు వెళ్తుండటంతో వాటిపై భారం పడుతోంది. ఫలితంగా సర్జరీలు, ఇతర సేవల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. దీన్ని గుర్తించిన వైద్య, ఆరోగ్యశాఖ గ్రేటర్‌ హైదరాబాద్‌తోపాటు కంటోన్మెంట్‌తో కలిసి 283 బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేసింది. దీంతో 80-85 శాతం వరకు ప్రాథమిక ఆరోగ్య సమస్యలకు ఇక్కడే చికిత్సలు లభిస్తున్నాయి.
వీటికితోడు హైదరాబాద్‌ జిల్లాలో 90 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాలో 3 కమ్యూనిటీ సెంటర్లు, 47 పల్లె దవాఖానాలు, 12 పీహెచ్‌సీలు, 24 ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. రంగారెడ్డి జిల్లాలో 19 పట్టణ, 13 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. హైపటైటీస్‌, మధుమేహం, బీపీ, థైరాయిడ్‌, జ్వరం, ఇతర సమస్యలకు ఈ హాస్పిటల్స్‌లోనే సేవలు అందుతున్నాయి. కార్డియాలజీ స్పెషలిస్టులు సైతం అందుబాటులో ఉన్నారు. టెలీ మెడిసిన్‌ ద్వారా ఉస్మానియా, గాంధీలోని వైద్య నిపుణులను ఇక్కడి నుంచే సంప్రదిస్తున్నారు. శస్త్ర చికిత్సలు, ఇతర అత్యవసర సమస్యలు ఉంటే పెద్దాస్పత్రులకు రెఫర్‌ చేస్తున్నారు.
పరీక్షలు.. శాంపిళ్లు..
టెస్టుల కోసం తెలంగాణ డయాగ్నోస్టిక్‌ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఉస్మానియా, గాంధీ లాంటి పెద్దాస్పత్రులకు వెళ్లే అవసరం లేకుండా 136 రకాల టెస్టులను ఈ కేంద్రాల్లోనే శాంపిళ్లు సేకరించి 24 గంటల్లో రిపోర్టు ఇస్తున్నారు. ఇలా నిత్యం దాదాపు 300కు పైగా కేంద్రాల నుంచి దాదాపు 9వేల శాంపిళ్ల వరకు నారాయణగూడ ఐపీఎంకు వస్తున్నాయి. కొన్ని కేంద్రాల్లో రేడియాలజీ సేవలు కూడా ప్రవేశపెట్టారు. ఎక్స్‌, ఈసీజీ, అల్ట్రాసౌండ్‌ తోపాటు ఎంఆర్‌ఐ, సీటీ స్కాన్‌ తదితర పరీక్షలను చేస్తున్నారు.
బస్తీ దవాఖానా సేవలను సద్వినియోగం చేసుకోవాలి
బస్తీ దవాఖానాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రాథమిక వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయి. నగరవాసులు సద్వినియోగం చేసుకోవాలి. చిన్న చిన్న సమస్యలకు పెద్దాస్పత్రులకు వెళ్లకపోవడం మంచిది. తెలంగాణ డయాగ్నోస్టిక్స్‌లో 24 గంటల్లోనే టెస్టుల ఫలితాలు వస్తాయి. రోగులకు ఇబ్బందుల్లేకుండా అన్ని రకాల సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి.
డాక్టర్‌ జె.వెంకటి, జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి, హైదరాబాద్‌
ఎంబీబీఎస్‌ డాక్టర్లు అందుబాటులో ఉన్నారు
బస్తీ దవాఖానాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఎంబీబీఎస్‌ డాక్టర్లు అందుబాటులో ఉన్నారు. అన్ని రకాల ప్రాథమిక వైద్య సేవలు అందిస్తారు. ప్రస్తుతం సీజనల్‌ వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉంది. ఏ చిన్న లక్షణం ఉన్నా వెంటనే దగ్గర్లోని బస్తీ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించి చికిత్స తీసుకోండి. నిర్లక్ష్యం చేయొద్దు.
డాక్టర్‌ రుక్మారెడ్డి, బస్తీ దవాఖానాల ఇన్‌చార్జి, హైదరాబాద్‌ జిల్లా

Spread the love