పాలకుర్తి గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరవేయాలి: ఝాన్సీ రెడ్డి

 – బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి చేరికలు
నవతెలంగాణ పెద్దవంగర: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పాలకుర్తి గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరవేయాలని పార్టీ శ్రేణులకు నియోజకవర్గ కాంగ్రెస్ నాయకురాలు హనుమండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం మండలంలోని కొరిపల్లి, గంట్లకుంట గ్రామాలకు చెందిన పలువురు బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వారికి ఝాన్సీ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పాలకుర్తిలో ఇక బీఆర్ఎస్ ఆటలు సాగవని అన్నారు. స్థానికేతరులను నియోజకవర్గంలో నుండి సాగనంపాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. పుట్టిన గడ్డ రుణం తీర్చుకోవడానికే అమెరికా వదిలి వచ్చినట్లు చెప్పారు. ప్రజలు ఆశీర్వదిస్తే వచ్చే ఎన్నికల్లో పాలకుర్తి నుండి పోటీ చేసి భారీ మెజారిటీతో విజయం సాధిస్తానని అన్నారు. ఒక్క అవకాశం ఇస్తే పాలకుర్తి రూపురేఖలు మారుస్తానని స్పష్టం చేశారు. రాజకీయాల్లోకి రాకముందే ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టానని, భవిష్యత్తులోనూ ప్రజల సహకారంతో మరిన్ని సేవలందిస్తానని పేర్కొన్నారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. రాబోయే కాలం ఎంతో కీలకమని పార్టీ విజయం కోసం కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని దిశా నిర్దేశం చేశారు. కార్యక్రమంలో టీపీసీసీ మాజీ సభ్యులు కేతిరెడ్డి నిరంజన్ రెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ముద్దసాని సురేష్, ఉపాధ్యక్షులు రంగు మురళి గౌడ్, సోషల్ మీడియా కోఆర్డినేటర్ సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.
Spread the love