నవతెలంగాణ- పెద్దవంగర: అర్హులైన పేదలందరికీ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను కేటాయించాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు లేగ రామ్మోహన్ రెడ్డి, మహబూబాబాద్ జిల్లా జాయింట్ కన్వీనర్ సుంకరనేని కోటేశ్వరరావు డిమాండ్ చేశారు. గురువారం బీజేపీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కేటాయించాలని కోరుతూ మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయంలో డీటీ రాజు కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రామ్మోహన్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు రంగు రాములు గౌడ్ తో కలిసి మాట్లాడారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు పూర్తయిన చోట ఏండ్లు గడుస్తున్న అర్హులకు అందించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. మరికొన్నిచోట్ల ఇప్పటివరకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం అసంపూర్తిగా ఉన్నదని వాటిని పూర్తి చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందన్నారు. 9 ఏళ్ల కేసీఆర్ పాలనలో రాష్ట్రంలోని పేద ప్రజలకు ప్రభుత్వం గూడు కట్టించకపోవడం బాధాకరం అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద పేదలకు ఇళ్ల నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వానికి తన వాటాగా కోట్లాది రూపాయలు విడుదల చేసినా నేటికీ ఎందుకు కేటాయించడం లేదని ప్రశ్నించారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని అన్నారు. కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు బొమ్మరబోయిన సుధాకర్, జిల్లా నాయకులు తలారి సోమన్న, సాయిని ఝాన్సీ రవి, జలగం ఆనంద్, దేవరుప్పుల ప్రధాన కార్యదర్శి కాసాని సత్తన్న యాదవ్ తదితరులు పాల్గొన్నారు.