నవతెలంగాణ – రాయపర్తి
ఆయిల్ ఫామ్ సాగుతో రైతులకు దీర్ఘకాలిక ఆదాయం వస్తుందని జిల్లా ఆర్టికల్చర్ అధికారి శ్రీనివాస్ అన్నారు. గురువారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో 57 వేల ఎకరాల్లో ఆయిల్ ఫామ్ సాగు చేయడానికి ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్నట్లు తెలిపారు. అందుకోసం రాంచరణ్ పామాయిల్ కంపెనీ సిద్ధంగా ఉంది అని తెలిపారు. ఇప్పటివరకు రైతులకు రెండు వేల ఆరు వందల మొక్కలు ఇవ్వడం జరిగింది అన్నారు. ఆరు లక్షల మొక్కలు పంపిణీ చేయడానికి నర్సరీలో సిద్ధంగా ఉన్నాయి అని చెప్పారు. ప్రస్తుతం వరకు 17 వందల ఎకరాలకు అనుమతి ఇచ్చాము అన్నారు. ఆయిల్ ఫామ్ సాగు చేసే రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుంది అని భరోసా ఇచ్చారు. రాయపర్తికి ఆయిల్ ఫామ్ కంపెనీ రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అన్నారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకే కంపెనీలు రైతుల వద్ద నుండి ఆయిల్ ఫామ్ గెలలను కొనుగోలు చేయడం జరుగుతుందన్నారు. ఆయిల్ ఫామ్ పంటకు మన వాతావరణానికి అనుకూలంగా ఉంటుందని వివరించారు. ప్రతి15 రోజులకు ఒక్కసారి గెలను కోసుకోవచ్చు అన్నారు. ఈ పంటకు కోతుల బెడద ఉండదని, వడగండ్ల వాన వస్తే పంట నష్టపోదు అన్నారు. రైతులకు స్థిరమైన పంట అని, భరోసా ఉన్న పంట అని తెలిపారు. రెండు సంవత్సరాల వరకు అంతర్ పంటలు వేసుకోవచ్చు అని గెలలు చేతికి వచ్చిన తర్వాత ఏడు సంవత్సరాల తరువాత మళ్ళీ అంతర్ పంటలు వేసుకోవచ్చు అన్నారు. రైతులు ఆయిల్ ఫామ్ సాగుపై శ్రద్ధ చూపాలని కోరారు. ఈ సమావేశంలో మండల వ్యవసాయ అధికారి గుమ్మడి వీరభద్రం, రైతుబంధు మండల కోఆర్డినేటర్ ఆకుల సురేందర్ రావు, రాయపర్తి సర్పంచ్ గారె నర్సయ్య తదితరులు ఉన్నారు