ఆర్టీసీపై ఎంప్లాయిస్‌ యూనియన్‌ సమగ్ర నివేదిక

– రవాణశాఖ మంత్రికి అందజేసిన నేతలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
ఆర్టీసీని విలీనం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాత లాభనష్టాలపై ఏపీలో అధ్యయనం చేసిన ఎంప్లాయిస్‌ యూనియన్‌ నేతలు సమగ్రమైన నివేదిక తయారు చేశారు. ఈ నివేదికను రవాణ శాఖ మంత్రి పువ్వాడ అజరుకుమార్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఆర్టీసీ విలీన కమిటీ చైర్మెన్‌, రోడ్డు, భవనాల శాఖ ముఖ్యకార్యదర్శులకు గురువారం సచివాలయంలో అందజేశారు. దీంతోపాటు ఆర్టీసీ మేనేజింగ్‌ డైరెక్టర్‌, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ (అడ్మినిస్ట్రేషన్‌)లకు బస్‌భవన్‌లో అందజేశారు. విలీనం తర్వాత అక్కడ ఉన్న సాదకభాదకాలు, లోపాలు కార్మికుల ఇబ్బందులను గమనించిన విషయాలపై రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో చర్చించి మెమోరాండం ఇచ్చినట్టు యూనియన్‌ ప్రధాన కార్యదర్శి రాజిరెడ్డి తెలిపారు. 2021వేతన సవరణలు చేయకుండా, పాత బకాయిలు చెల్లించకుండా చైర్మెన్‌ పదేపదే చెబుతున్నట్టు వేతనాలు ఇవ్వడం సరికాదన్నారు.

Spread the love