ఉద్యోగానికే విరామం..ఉద్యమానికి కాదు

– సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని
నవతెలంగాణ- ఖమ్మం
గుత్తా సాంబశివరావు ఉద్యోగానికే విరామం ఇచ్చారని, ఉద్యమానికి కాదని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. గుత్తా సాంబశివరావు బీఎస్‌ఎన్‌ఎల్‌లో పదవీ విరమణ చేసిన సందర్భంగా ఆదివారం ఖమ్మంలోని స్వర్ణ భారతి కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళానికి తమ్మినేని హాజరై మాట్లాడారు. సాంబశివరావు కుటుంబం మొదటి నుంచి వామపక్ష భావజాలంతో ఉందన్నారు. ఉద్యోగంలో చేరినప్పటి నుంచి యూనియన్‌ కార్యక్రమాల్లో పాల్గొంటూ దాన్ని ముందుకు తీసుకెళ్లడంలో చురుకైన పాత్ర పోషించారని తెలిపారు. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ వామపక్ష భావంతోనే ముందుకు సాగారన్నారు. సాంబశివరావు ఉద్యోగ విరమణ చేశారే తప్ప ఉద్యమానికి కాదని, నమ్ముకున్న సిద్ధాంతం కోసం పనిచేయాలని, అదే విధంగా పెన్షనర్స్‌ తరపున కూడా పోరాటాలకు ముందుండాలని ఆకాంక్షించారు. సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్‌రావు మాట్లాడుతూ.. సాంబశివరావు ఉద్యోగ విరమణ చేసిన తర్వాత ఉద్యమాల్లో పాల్గొనేందుకు వెసులుబాటు కలిగిందని అన్నారు. అష్టగుర్తి గ్రామంలో వారి కుటుంబం మొత్తం వామపక్ష భావజాలాలతోనే ఉందని తెలిపారు. సాంబశివరావు విద్యార్థి దశ నుండి ఎన్నో పోరాటాలు నిర్వహించారని అన్నారు. జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు మాట్లాడుతూ.. సాంబశివరావు ఉద్యోగ సంఘం నాయకుడిగా నూటికి నూరు శాతం మార్కులు సంపాదించి, ఉద్యోగుల అభిమానం పొందిన వ్యక్తి సాంబశివరావు అన్నారు. ఉద్యోగుల సమస్యలపై రాజీలేని పోరాటాలు చేశారని, ఎన్నో సమస్యలు పరిష్కారం అయ్యాయని తెలిపారు. సాంబశివరావు సతీమణి అలివేలు కూడా ఖమ్మం ఖానాపురం హవేలీ పరిధిలో మహిళా ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించారని అన్నారు. ఇద్దరు కూడా భవిష్యత్తులో ప్రజల తరఫున, ఉద్యోగులు, కార్మికులు పక్షాన నిలబడతారని ఆశిస్తున్నామన్నారు. నవతెలంగాణ అసిస్టెంట్‌ ఎడిటర్‌ వేణుమాధవ్‌ మాట్లాడుతూ.. సాంబశివరావు ఉద్యోగ విరమణ తప్ప ఏ సమస్యల పరిష్కారం కోసం అయితే పోరాడుతున్నారో దానికి విరమణ కాదని అన్నారు. భవిష్యత్‌లోనూ మరిన్ని పోరాటాలు చేస్తూ సాంబశివరావు, భార్య అలివేలు అందరికీ ఆదర్శప్రాయంగా ఉండాలని తన ఆకాంక్ష అని అన్నారు. కార్యక్రమంలో బీఎస్‌ఎన్‌ఎల్‌ ఈయూ జె.సంపత్‌ రావు, ఈయూ ఆల్‌ ఇండియా నాయకులు పి..అశోక్‌బాబు, ఏఐబీడీపీఏ రాష్ట్ర అధ్యక్షులు బీఆర్‌ వీరస్వామి, కార్యదర్శి రామచంద్రుడు, ఏపీ కార్యదర్శి బోస్‌, సీసీడబ్ల్యూఎఫ్‌ తెలంగాణ కార్యదర్శి బి.పరిపూర్ణాచారి, ఆంధ్రప్రదేశ్‌ కార్యదర్శి ప్రభాకర్‌, సీసీడబ్ల్యూఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు పి.తిరుమలచారి, సాంబశివరావు సోదరుడు కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Spread the love