ప్రభుత్వ ఉపాధ్యాయుడి దారుణ హత్య

ప్రభుత్వ ఉపాధ్యాయుడి దారుణ హత్య– పాఠశాల పున:ప్రారంభానికి వెళ్తుండగా ఘటన
నవతెలంగాణ-నార్నూర్‌
పాఠశాలల పున: ప్రారంభం రోజునే ప్రభుత్వ ఉపాధ్యాయుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన ఆదిలాబాద్‌ జిల్లా నార్నూర్‌ మండలం నాగల్‌ కొండ గ్రామంలో స్థానికంగా కలకలం రేపింది. కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగల్‌కొండ గ్రామానికి చెందిన జాదవ్‌ గజానంద్‌ (40) జైనథ్‌ మండలం కెనాల్‌ మేడిగూడ ప్రభుత్వ పాఠశాలలో తెలుగు పండితుడిగా విధులు నిర్వర్తిస్తున్నాడు. జిల్లా కేంద్రంలో నివాస ముంటున్నాడు. వేసవి సెలవులు కావడంతో కుటుంబ సభ్యులతో కలిసి సొంతూరు నాగల్‌కొండకు వచ్చాడు. బుధవారం పాఠశాల పున:ప్రారంభం కావడంతో స్వగ్రామం నుండే విధులకు హాజరయ్యేందుకు ద్విచక్ర వాహనంపై వెళ్లాడు. ఈ క్రమంలో అర్జుని-లోకారి రోడ్డు మార్గమధ్యలో హత్యకు గురయ్యాడు. ఉట్నూర్‌ డీఎస్పీ నాగేందర్‌, సీఐ రహీమ్‌ పాషా సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. తలకు బలమైన గాయాలుండటంతో రోడ్డు ప్రమాదమా? లేక బండ రాయితో కొట్టి హత్య చేసి ఉంటారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి భార్య, కొడుకు ఉన్నారు.

Spread the love