Thursday, May 21, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంనీట్ పేపర్ లీకేజీపై 
సమగ్ర న్యాయ విచారణ జరపాలి

నీట్ పేపర్ లీకేజీపై 
సమగ్ర న్యాయ విచారణ జరపాలి

- Advertisement -

ఎన్టీఏను రద్దు చేయాలి :వామపక్ష విద్యార్థి సంఘాల రౌండ్ టేబుల్ సమావేశంలో వ‌క్త‌లు
నైతిక బాధ్యత వహించి కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్

న‌వ‌తెలంగాణ బ్యూరో – హైద‌రాబాద్
దేశవ్యాప్తంగా మరోసారి వెలుగులోకి వచ్చిన నీట్ పేపర్ లీకేజీ ఘటన కేంద్ర ప్రభుత్వ విద్యా విధానాల దారుణ వైఫల్యానికి నిదర్శనమని ప‌లు పార్టీల‌కు చెందిన నేత‌లు, వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు తీవ్రంగా విమర్శించారు. “ఒకే దేశం – ఒకే పరీక్ష” పేరుతో విద్యను కేంద్రీ కరించడం వల్లే వరుసగా పరీక్షా అక్రమాలు, పేపర్ లీకులు, కోచింగ్ మాఫియా దందాలు పెరుగుతున్నా యని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. నీట్ పరీక్షను పూర్తిగా రద్దు చేయాలని, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ)ను రద్దు చేసి స్వతంత్ర, పారదర్శక వ్యవస్థను ఏర్పాటు చేయాలని కోరారు. ప్రవేశ పరీక్షల నిర్వహణ హక్కు, అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకే ఇవ్వాలని డిమాండ్ చేశారు.

హైద‌రాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం లో బుధ‌వారం వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వ ర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావే శానికి ఎస్ఎఫ్ఐ, ఎఐఎస్ఎఫ్, పీడీఎస్‌యూ, పీడీఎస్‌యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు టి. నాగరాజు, పుట్టా లక్ష్మణ్, ఎస్. అనిల్, పొడపంగి నాగరాజు అధ్యక్షత వహించారు. సమావేశంలో విద్యార్థి సంఘాలు, ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీల నాయకులు, విద్యావేత్తలు, సామాజిక కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ మాట్లాడుతూ దేశంలో విద్యను పూర్తిగా కార్పొరేటీకరణ దిశగా నెట్టివేస్తున్న కేంద్ర ప్రభు త్వం, ప్రవేశ పరీక్షలను కేంద్రీకరించడం ద్వారా రాష్ట్రాల హక్కులను హరిస్తోందని విమర్శించారు. విద్యార్థుల ప్రతిభను కాకుండా కోచింగ్ కేంద్రాలకు వెళ్లే ఆర్థిక స్థోమతను మాత్రమే కొలిచే విధంగా నీట్ వ్యవస్థ మారిపోయిందన్నారు. వరుసగా జరుగు తున్న పేపర్ లీకేజీలు, అవినీతి ఘటనలు ఎన్టీఏ వైఫల్యాన్ని పూర్తిగా బయటపెట్టాయని పేర్కొన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబ శివరావు మాట్లాడుతూ లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరి స్తోందన్నారు. పరీక్ష రాసిన విద్యార్థులు తీవ్ర మానసిక ఒత్తిడి, ఆందోళనలో ఉన్నప్పటికీ కేంద్రం కనీస బాధ్యత కూడా తీసుకోవడం లేదని విమర్శిం చారు. నీట్ పరీక్షను మళ్లీ ఎన్టీఏతో నిర్వహించట ‌మంటే బీజేపీ ప్రభుత్వం తన తప్పులను కప్పి పుచ్చుకోవ‌ట‌మేన‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. రీ-నీట్ పరీక్షను పూర్తిగా స్వతంత్ర సంస్థతో నిర్వహించాలని డిమాండ్ చేశారు.

ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ భారత రాజ్యాంగం రాష్ట్రాలకు కల్పించిన విద్యా హక్కులను కేంద్రం క్రమంగా హరించి వేస్తోంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. రాష్ట్రాల సామాజిక, భాషా, విద్యా పరిస్థితులను పరిగణనలోకి తీసుకోకుండా దేశవ్యాప్తంగా ఒకే పరీక్ష విధించడం అన్యాయమని పేర్కొన్నారు. గ్రామీణ, ప్రభుత్వ విద్యార్థులు తీవ్ర నష్టాన్ని ఎదుర్కొంటుండగా, కోచింగ్ మాఫియా మాత్రం వేల కోట్ల వ్యాపారం చేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ విద్యా విధానాలు పూర్తిగా ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణ దిశగా సాగుతున్నాయని అన్నారు. విద్యను ప్రజల హక్కుగా కాకుండా వ్యాపార వస్తువుగా మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు. సీపీఐ(ఎంఎల్) న్యూ డెమోక్రసీ రాష్ట్ర అధికార ప్రతినిధి జె.వి. చలపతిరావు మాట్లా డుతూ ఎన్టీఏ నిర్వహిస్తున్న పరీక్షల్లో వరుసగా అవకతవకలు జరుగుతున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవడం లేదన్నారు. పేపర్ లీకేజీల వెనుక ఉన్న కార్పొరేట్ కోచింగ్ మాఫియా, దళారుల నెట్‌వర్క్‌పై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు.

ఎస్‌యూసీఐ (సీ) రాష్ట్ర కార్యదర్శి మురహ‌రి మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోంన‌వ‌తెలంగాణ బ్యూరో – హైద‌రాబాద్దన్నారు. ప్రతి సంవత్సరం పరీక్షల సమయంలో విద్యార్థులు అనిశ్చితి, ఒత్తిడి, మానసిక ఆందోళనకు గురవుతు న్నారని, దీనికి కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. సీపీఐ (ఎంఎల్‌) న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి భాస్కర్ మాట్లాడుతూ కేంద్ర విద్యాశాఖ మంత్రి నైతిక బాధ్యత వహించి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడినా కేంద్రం స్పందించకపోవడం అత్యంత దుర్మార్గమని అన్నారు. అరుణోదయ తెలుగు రాష్ట్రాల గౌరవ అధ్యక్షురాలు విమలక్క మాట్లాడుతూ పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులు వైద్య విద్యను చేర కుండా చేసేవిధంగా నీట్ వ్యవస్థ పనిచేస్తోందన్నారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు సమాన అవకాశాలు లేకుండా చేసే విధానాలను వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు.

బీఆర్‌ఎస్‌వీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డా. తుంగ బాలు మాట్లాడుతూ నీట్ కారణంగా రాష్ట్ర విద్యా వ్యవస్థలు తీవ్రంగా దెబ్బతింటున్నాయని అన్నారు. రాష్ట్ర బోర్డు సిలబస్ చదివే విద్యార్థులు అన్యాయానికి గురవుతున్నారని పేర్కొ న్నారు. సమావేశంలో నీట్ బ్యాన్, ఎన్టీఏ రద్దు, కోచింగ్ మాఫియా అరి కట్టడం, పేపర్ లీకేజీపై సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ, నిందితులను కఠినం గా శిక్షించడం, రాష్ట్రాలకు పరీక్షల నిర్వహణ హక్కు కల్పించడం, రీ-నీట్‌ను స్వతంత్ర సంస్థతో నిర్వహించ డం వంటి డిమాండ్లతో పలు తీర్మానా ల‌ను ఆమోదించారు. ఎఐడీఎస్ఓ రాష్ట్ర నాయకులు నితీష్, ఎఐఎఫ్డీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడ్డం నాగార్జున, ఎఐపీఎస్ఓ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం. కుమార్, జార్జీరెడ్డి పీడీఎస్‌యూ రాష్ట్ర గర్ల్స్ కన్వీనర్ స్వాతి, పీడీఎస్‌ఓ (విజృంభణ) రాష్ట్ర కార్యదర్శి ఎ. విజయ్, పీడీఎస్‌యూ రాష్ట్ర నాయకులు గణేష్ తీర్మానాల‌ను ప్రవేశపెట్టారు. దేశవ్యాప్తంగా విద్యార్థులు, తల్లిదండ్రులు, ప్రజా సంఘాలు, విద్యావేత్తలు నీట్ విధానానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేపట్టాలని సమావేశం పిలుపునిచ్చింది. విద్యను కేంద్రీకరించే, కార్పొరేటీకరణ చేసే విధానాలను నిలువరించేందుకు ప్రజాస్వామిక శక్తులు ఐక్యంగా పోరాడాలని సమావేశం పేర్కొంది. కార్య‌క్ర‌మంలో ఎఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కె. మణికంఠ రెడ్డి, పి.డి. ఎస్.యు. రాష్ట్ర అధ్యక్షుడు కె.పృధ్వీ, పి.డి. ఎస్.యు. రాష్ట్ర అధ్యక్షుడు పి. మహేష్,ఎ.ఐ.ఎఫ్.డి.ఎస్. రాష్ట్ర అధ్యక్షుడు పల్లె మురళీ, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యాక్షులు దామెర కిరణ్, కె.అశోక్ రెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యులు లెనిన్, నాయకులు నాగేందర్, ఎఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు డా,గ్యార నరేష్,రెహమాన్, క్రాంతి, రాష్ట్ర నాయకులు చైతన్య, పయాజ్,పి.డి.ఎస్.యు. రాష్ట్ర నాయకులు హారీష్, ధరణి, అశ్వనీ, ఎ.ఐ.ఎఫ్. డి.ఎస్ గ్రేటర్ హైదరాబాద్ నాయకులు రిషిక్, ప్రసాద్, జాస్మిన్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -