కాంగ్రెస్‌ నాయకుని ఆత్మహత్యాయత్నం

– టికెట్‌ కేటాయించ లేదని మనస్తాపం
– పురుగుల మందు తాగిన కాసుల బాల్‌రాజ్‌
నవతెలంగాణ-నసురుల్లాబాద్‌
ఏండ్లుగా పార్టీ కోసం పని చేస్తూ నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్న తనను కాదని, బయటి వారికి టికెట్‌ కేటాయించడంతో తీవ్ర మనస్తాపానికి గురైన కాంగ్రెస్‌ పార్టీ బాన్సువాడ నియోజకవర్గ ఇన్‌చార్జి కాసుల బాల్‌రాజ్‌ పురుగుల మందు తాగి ఆత్మ హత్యాయత్నం చేశారు. బుధ వారం బాన్సువాడలో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన ఆయన.. తదనంతరం తీవ్ర మనస్తాపంతో పురుగుల మందు తాగడంతో.. హుటాహుటిన నగరంలోని ఓ ప్రయివేటు ఆస్పత్రికి తరలిం చారు. నిరాహార దీక్షలో ఆయన మాట్లాడుతూ.. 2009లో స్థానికే తరులకు బాన్సువాడ టికెట్‌ ఇవ్వడంతో ఆ అభ్యర్థి ఓడిపోయా రన్నారు.

దాంతో బాన్సువాడ నియోజకవర్గ కాంగ్రెస్‌ కార్యకర్తలు, నాయకులు దిక్కులేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు తాను రథసారథిగా మారి పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేశానని తెలిపారు.
అలాంటి తనకు కాకుండా వివిధ పార్టీలు మారుస్తూ కొత్తగా వచ్చిన వారికి, స్థానికేతరులకు టికెట్‌ ఇవ్వడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశాడు. పార్టీ మారకుండా 20 ఏండ్లుగా పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తున్న తనకు ఎందుకు టికెట్‌ ఇవ్వలేదో చెప్పాలని డిమాండ్‌ చేశారు. బాన్సువాడ నియోజకవర్గం టికెట్‌ కోసం 16 మంది స్థానికులు దరఖాస్తు చేసుకోగా అందులో ఎవ్వరికైనా టికెట్‌ ఇచ్చిన తామంతా కష్టపడి పార్టీ గెలుపు కోసం కృషి చేస్తామని తెలిపారు. కాగా, బాలరాజు ఆత్మహత్యాయత్నం చేసుకున్నారనే సమాచారం అందడంతో కాంగ్రెస్‌ కార్యకర్తలు, నాయకులు, ఆయన అభిమానులు పెద్దఎత్తున నిజామాబాద్‌లోని ప్రయివేటు ఆస్పత్రికి తరలివెళ్లారు.

Spread the love