అగ్రరాజ్యం అమెరికాను వణికిస్తున్న భీకర తుపాను..

నవతెలంగాణ – అమెరికా: అమెరికాను భీకర తుపాను అతలాకుతలం చేసేస్తోంది. భీకర గాలులు, ఉరుములతో కూడిన వర్షం, వడగళ్లతో అగ్రరాజ్యం వణికిపోతోంది. ముఖ్యంగా ఈ తుపాను ధాటికి ఉత్తర అమెరికా అతలాకుతలమైంది. ఈ తుపాను తీవ్రతతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా వేలాది విమానాలు రద్దయ్యాయి. లైట్ ట్రాకింగ్ సర్వీస్ ఫ్లైట్ అవేర్ ప్రకారం.. సోమవారం రాత్రి నాటికి 2,600 కంటే ఎక్కువ యూఎస్ విమానాలు రద్దయ్యాయి. అలాగే 7,900 విమానాలు ఆలస్యంగా నడిచాయి. మరోవైపు మేరీల్యాండ్‌, వర్జీనియా సహా దక్షిణ, మధ్య అట్లాంటిక్‌ రాష్ట్రాల్లో దాదాపు 11 లక్షల ఇళ్లు, వ్యాపార సముదాయాలకు విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. తుపాను కారణంగా ప్రజలు అల్లాడిపోతున్నారు. పలు రాష్ట్రాల్లో పవర్‌ కట్‌ అయ్యింది. దీంతో లక్షల మంది ప్రజలు చీకట్లోనే మగ్గుతున్నారు. తుపాను కారణంగా వాషింగ్టన్‌ డీసీలో అన్ని కార్యాలయాలను ముందుగానే మూసివేశారు. టేనస్సీ నుంచి న్యూయార్క్ లోవరకు దాదాపు 10 రాష్ట్రాలు సుడిగాలుల్లో చిక్కుకున్నాయి. సుమారు 29.5 మిలియన్లకు పైగా ప్రజలు ఈ తుపానుకు ప్రభావితులైనట్లు వెదర్ సర్వీస్ తెలిపింది.

Spread the love