బాల్యంలోనే పోరాటశీలి

      పుచ్చలపల్లి సుందరయ్య అందరూ గౌరవించే గొప్ప నాయకుడు. జీవితమంతా పేద ప్రజల కోసం కష్ట జీవుల కోసం అంకితం చేశాడు. ఆయన నెల్లూరు జిల్లా అలగానిపాడులో ఒక భూస్వామ్య కుటుంబంలో 1913 మే 1 వ తేదీన పుట్టాడు. తల్లి శేషమ్మ, తండ్రి పుచ్చలపల్లి వెంకట్రామిరెడ్డి. ఆయన తల్లిదండ్రులకు ఏడుగురు సంతానం. వారిలో సుందరయ్య ఆరోవాడు. అందరికన్నా పెద్దవాడు. వెంకటరామిరెడ్డి. తర్వాత నలుగురు అక్కలు ఆ తర్వాత సుందరయ్య. తర్వాత పుట్టిన రామచంద్రారెడ్డి కూడా గొప్ప డాక్టరు. ప్రజలకు ఎంతో సేవచేసిన వ్యక్తి.
ఆ కుటుంబానికి చాలా భూమి ఉండేది. వ్యవసాయంలో మంచి పనిమంతుడని సుందరయ్య తండ్రి వెంకట్రామిరెడ్డిని గ్రామంలో బాగా గౌరవించేవారు. సుందరయ్యకు ఆరేళ్ల వయస్సులో తండ్రి చనిపోయాడు. అప్పటినుంచి అమ్మ అన్నలే ఆ ఇంటి బాధ్యతలు చూస్తూ వచ్చారు. సుందరయ్య మొదట పంచాయితీ బడిలో చేరాడు. దాన్ని వీధి బడి అనేవాళ్లు. ఆ బళ్ళోకి వ్యవసాయదార్ల పిల్లలు, చేనేత వాళ్ళ పిల్లలు వెళ్ళేవారు. అయితే దళితులకు ప్రవేశం నిషిద్ధం. సుందరయ్య చాలా తుంటరి పిల్లవాడని పేరు. అందుకే బడికి పంపించాలంటే మొదట్లో అమ్మానాన్నలకు పెద్ద సమస్య అయ్యేది. అయితే ఆ తర్వాత మారిపోయాడు. అక్షరాలు, ఎక్కాలు త్వరగా నేర్చేసేవాడు. క్లాసులో అందరికన్నా ఫస్టున వుండేవాడు. లెక్కల్లో దిట్ట. వేమన, సుమతీ శతకాల పద్యాలు ఇంకా వేరేవి కూడా ఎప్పుడడిగితే అప్పుడు చెప్పేసేవాడు. ఆ రోజుల్లో బాగా చదివే పిల్లలు కింది తరగతులు త్వరగా పూర్తి చేసుకునే వీలుండేది. సుందరయ్య ఆ విధంగానే కింది తరగతులు ఇతరుల కన్నా త్వరగా పూర్తి చేసుకున్నాడు. సుందరయ్య చిన్నప్పటినుంచి అన్యాయాలను ఎదిరించేవాడు. అందరూ బాగుండాలని ఆయన కోర్కె. కొన్ని కులాల వాళ్లను, పేద ప్రజలను చులకనగా చూడటం ఆయనకు నచ్చేది కాదు. అంటరాని తనం, కులాల ఎక్కువ తక్కువల ఆయనకు చాలా బాధ కలిగించాయి. వివక్ష ఇలా చేయవద్దని ఇంట్లో వాళ్లతో పోట్లాడేవాడు. బయట కూడా ఎవరైనా అలా చేస్తే పెద్దలతోనైనా వాదన వేసుకునేవాడు.
ఆయన స్త్రీలను ఎంతగానో గౌరవించేవాడు. స్త్రీలు పురుషులు సమానులని ఆయన నమ్మకం. అప్పట్లొ బాల్య వివాహాలు అంటే చిన్నపిల్లలకే పెళ్లిళ్లు చేసే దురాచారం వుండేది. ఈ సమస్య వాళ్లింట్లో కూడా వచ్చింది. 16 ఏళ్ళు మాత్రమే వున్న ఆయన అక్కయ్య వెంకట రమణమ్మను 42 ఏళ్ల వాడైన వీరాస్వామిరెడ్డి అనే మేజిస్ట్రేటు ఇచ్చి వివాహం చేయాలని నిర్ణయించారు. దీన్ని సుందరయ్య గట్టిగా వ్యతిరేకించాడు. అయితే ఆ కుర్రాడి మాటలు అప్పుడెవరూ పట్టించుకోలేదు. ఆ పెళ్లి జరిగిపోయింది. తర్వాత సుందరయ్య, తమ్ముడు రామ్లు ఆ అక్క దగ్గరే వుండి చదువుకున్నారు.
సుందరయ్య, రామ్ లను చదివించేందుకని అక్కయ్య తనతో తిరువళ్ళూరు తీసుకువెళ్ళింది. అది తమిళనాడు రాష్ట్రంలో వుంటుంది. తిరువళ్ళూరులో మూడు, నాల్గు, అయిదు తరగతుల వరకు చదువుకున్నాడు. చదువంతా తమిళంలో చెప్పేవారు. ఈయనకేమో రాదు. అందుకే తమిళం అసలు ఏమీ అర్ధమయ్యేది కాదు. లెక్కల్లో మాత్రం బాగా మార్కులొచ్చేవి. ఎందుకంటే దానికి భాషతో సంబంధం లేదు. కదా! చివరకు ఇంట్లోనే తమిళ పంతులునొకర్ని నియమించారు.
చరిత్ర పుస్తకాలు చాలా ఆసక్తిగా చదివేవాడు. అక్క బావ బదిలీల కారణంగా ఎక్కడికి వెళ్తే అక్కడ చదువుకున్నాడు. ఆ విధంగా ఏలూరు, రాజమండ్రి పట్టణాలలో చదువు కొనసాగించాడు. రాజమండ్రి స్కూలులో చదువుతున్నప్పుడు సుందరయ్య స్థానిక గ్రంథాలయానికి క్రమం తప్పకుండా వెళ్ళేవాడు. తలుపులు తాళం వేసేంత వరకూ కూచుని చదువుతుండేవాడు. అక్కడే ఆయన కందుకూరి వీరేశలింగం, చిలకమర్తి లక్ష్మీ నరసింహం, పానుగంటి లక్ష్మీ నరసింహం వంటి సంస్కర్తల గురించి తెలుసుకున్నాడు.
1925 జూన్ నెలలో ఒక రోజు సుందరయ్య రాజమండ్రిలో గోదావరి గట్టున కూర్చుని స్నేహితుడితో మాట్లాడుతున్నాడు. అప్పుడు స్వాతంత్ర పోరాట నాయకుడైన చిత్తరంజన్ దాస్ చనిపోయినట్టు వార్త వచ్చింది. అందరూ బాధ పడుతున్నారు . కాని సుందరయ్యకు ఆయన ఎవరో తెలియదు. చిత్తరంజన్దాస్ ఎవరని స్నేహితుడు పార్వతీశంను అడిగాడు. అతనికి బాగా కోపం వచ్చింది. ఁఅన్ని పుస్తకాలు చదువుతుంటావు. నీకు ఎక్కడా చిత్తరంజన్దాస్ పేరు తగల్లేదా అని కోపంగా అడిగాడు తర్వాత చిత్తరంజన్ దాస్ గురించి వివరంగా చెప్పాడు. ఆయన జీవితం, పోరాటాలకు సంబంధించిన కొన్ని పుస్తకాలిచ్చాడు. ఒక పెద్ద దేశనాయకుడు చనిపోతే ఆయన గురించి ఏమీ తెలియలేదని సుందరయ్యకు చాలా సిగ్గేసింది. అప్పటి నుండి తప్పనిసరిగా దినపత్రికలు చదవడం, కాంగ్రెస్ గురించి తెలుసుకోవడం జాతీయ ఉద్యమం గురించి అలవాటు చేసుకున్నాడు. జలియన్ వాలాబాగ్ లో బ్రిటిష్ ప్రభుత్వం సాగించిన హత్యాకాండపై కాంగ్రెస్ విడుదల చేసిన నివేదిక చదివాడు. అది చదివాక బ్రిటిష్ సామ్రాజ్యవాదంపై బాగా కోపం వచ్చింది. తను కూడా స్వాతంత్య్ర పోరాటంలో చేరాలని నిర్ణయించుకున్నాడు. గాంధీ జీవితం గురించి బాగా తెలుసుకోవడం మొదలుపెట్టాడు.

Spread the love