సుందరయ్యగారి ట్రంకుపెట్టె

        సుందరయ్యగారు ప్రయాణాల్లో తనతోపాటు ఒక ట్రంకు పెట్టెను తప్పనిసరిగా తీసుకువెళ్లేవారు. ఆయన నిరాడంబరులనీ, తన పని తానే చేసుకుంటారనీ ఆయన గురించి తెలిసినవారందరికీ తెలుసు. ఒకసారి ఏదో సమావేశంలో పాల్గొనడానికి ఆయన గుంటూరు వచ్చారు. రైల్వే స్టేషన్లో స్వాగతం పలకడానికి కొద్ది మంది సన్నిహితులు వచ్చారు. రైల్లోంచి దిగగానే ఆయన్ను పలుకరించి చేతిలో ఉన్న ట్రంకు పెట్టెను అందుకోబోయారు మిత్రులు. వద్దని వారిస్తూ పెట్టెను ఃనేనే పట్టుకుంటాః అని బలవంతంగా ఆ ట్రంకు పెట్టెను గుంజుకున్నారు కామ్రేడ్ గడ్డిపాటి కోటేశ్వరరావు. చేసేదిలేక సుందరయ్యగారు మిత్రులను అనుసరించారు. గుంటూరు వచ్చినప్పుడు చాలా మంది కమ్యూనిస్టు నాయకులు గడ్డిపాటి కోటేశ్వరరావుగారి ఃనవయుగః హోటల్లోనే బసచేసేవారు. రైల్వే స్టేషన్కు కొద్ది దూరంలో బ్రాడీపేటలో ఉన్న హోటల్కు అందరూ కాలినడకనే బయలుదేరారు. ట్రంకుపెట్టె పట్టుకొని నడుస్తున్న మిత్రుని అవస్థ చెప్పనలవి గాకుండా ఉంది. పెట్టె బరువుకు గూడ జారినంత పనైంది. పెట్టెలో అంత బరువు ఏమున్నదో అర్ధం కాలేదు. ఆ బరువుతో నడవడం చాలా కష్టమైంది. మొత్తం మీద రొప్పుకుంటూ (ఆ సంగతి ఇతరులకు తెలియకుండా జాగ్రత్తపడుతూ) హోటల్ చేరుకున్నారు. తరువాత కొంత సేపటికి సుందరయ్యగారు పెట్టె తెరిచినప్పుడు కుతూహలం ఆపుకోలేక అందులో వస్తువులను పరికించి చూశారు పెట్టెను మోసుకొచ్చిన కామ్రేడ్. ఎంత చలినైనా ఆపగలిగే ముతక రగ్గు ఒకటి మడత పెట్టి ఉంది. ఇంకా ఒక పైజామా, చొక్కా (కాటన్వి, తెల్లటివి ఉన్నాయి. వాటిని ఉతుక్కోవడానికి సబ్బు కూడా ఉంది. ఒక చిన్న సంచిలో దూది, టించర్లాంటి ఫస్ట్ ఎయిడ్ సామగ్రి ఉంది. గడ్డం గీసుకునే కత్తి, చిన్న అడ్డం, చిన్న సబ్బు ఉన్నాయి. ఇంక మిగిలినవన్నీ పుస్తకాలు. చాలా బరువైనవి (బరువు తూకానికే గాక విషయానికి కూడా సంబంధించినవి) ఉన్నాయి. మొత్తం పెట్టె బరువు 20 కిలోలకు పైగా ఉంటుంది. ఇంత బరువైన పెట్టెను సుందరయ్యగారు రైల్వే ప్లాట్ఫారమ్ల మీదనే కాదు, ఇతర చోట్ల కూడా ఇలా సునాయాసంగా చెయ్యి కూడా మార్చుకోకుండా మోస్తూ చకచకా నడిచేవారు. నిరాడంబరమైన చిత్తశుద్ధిగల ప్రవర్తనతో ప్రజాసేవకులందరికీ ఆదర్శప్రాయులు సుందరయ్య.

Spread the love