చివరిగా పార్టీ పార్టీ నిర్మాణంపై సుందరయ్య అనుసరించిన మార్గాన్ని మనం చర్చించుకోవాల్సిన అవసరం వుంది. విప్లవోద్య మాన్ని ముందుకు తీసుకెళ్లటానికి సరైన రాజకీయ మార్గం ఒక్కటే సరిపోదన్న విషయాన్ని కామ్రేడ్ సుందరయ్య మనకు ఎల్లవేళలా గుర్తుచేస్తుండే వారు. పటిష్టమైన నిర్మాణం లేనిదే సరైన రాజ కీయ మార్గమైనా అర్థరహితమవుతుందని, ప్రజల సమస్యలను పార్టీ అర్థం చేసుకోవటం కష్టమ వుతుందనేది మనకు తెలిసిన విషయమే. విప్లవోద్యమాన్ని ముందుకు తీసుకెళ్లటానికి పార్టీ ఇచ్చే నినాదాలను ఉద్యమ నిర్మాణం ద్వారా ప్రజలు తమకు తాముగా వినిపించేట్టు చూసుకోవాల్సిన అవసరం వుంది. దీనిని సాధించాలంటే తరచు ఆయా పరిస్థితులను అధ్యయనం చేయాల్సిన అవసరం వుంది. ఉదాహరణకు భూపోరాటాల కోసం అనుసరించిన మార్గం, విధానాలు, దాని ద్వారా సాధించిన అనుభవాల ద్వారా ధనిక రైతులకు, వ్యవసాయ కార్మికులకు మధ్య హస్తి మశకాంతర వైరుధ్యం వున్నదని సుందరయ్య గుర్తించారు. ధనిక రైతులు తక్కువ ఖర్చుతో పనులు పూర్తి చేసుకోవాలని చూస్తుంటే వ్యవసాయ కార్మికులు అందుకు విరుద్ధంగా తాము చేసిన పనికి సరైన కూలి కోసం పోరాటం కొనసాగిస్తారు. ఇరు వర్గాలనూ ఒకే నిర్మాణ కిందికి తెస్తే ప్రజాఉద్యమ ప్రగతి బలహీనపడుతుంది. ఈ పరిస్థితులను కచ్చితంగా విశ్లేషణ చేసిన సుందరయ్య ప్రత్యేకంగా వ్యవసాయ కార్మిక సంఘాన్ని ఏర్పాటు చేయాలని బలంగా వాదించి కిసాన్ సభ నుండి దానిని ఏర్పాటు చేశారు. అదే విధంగా యువతలో కొంతమంది విద్యాధికులు ఉన్నప్పటికీ అధికశాతం నిరక్షరాస్యులుగానే వున్నారని ఆయన గుర్తించారు. విద్యాధికులంతా విద్యార్థి విభాగం పరిధిలోకి రాగా నిరక్షరాస్యులైన యువతకు అటువంటి అవకాశం లేదు. దీనిని గుర్తించిన సుందరయ్య యువజన విభాగాన్ని ఏర్పాటు చేశారు. ఈ విధంగా పార్టీ వ్యవస్థాగత నిర్మాణాలకు సుందరయ్య బలమైన పునాదులేశారు. ఇక రాజకీయ సిద్ధాంతాలకు సంస్థాగత విధానాలకు మధ్య తార్కిక సంబంధానికి సంబంధించి సమాజంలో కొనసాగుతున్న వర్గీకరణకు సంబంధించి కొనసాగుతున్న ప్రక్రియను అర్ధం చేసుకునేందుకు అనేక అధ్యయనాలు నిర్వహించారు. రష్యన్ విప్లవానికి ముందు రష్యాలో రైతుల వర్గీకరణను అధ్యయనం చేసిన లెనిన్ను స్పూర్తిగా తీసుకుని సుందరయ్య రాజకీయ సిద్ధాంతాలకు, వ్యవస్థాగత విధానాలకు మధ్య చోటు చేసుకుంటున్న వైరుధ్యాలను అవగాహన చేసుకునేందుకు గ్రామాలపై సమగ్ర అధ్యయనాన్ని నిర్వహించారు. దురదృష్ట వశాత్తు ఈ ప్రక్రియ ప్రస్తుతం మన దేశంలో విప్లవోద్యమాన్ని బలోపేతం చేయటానికి అవసరమైనంతగా ముందుకు సాగలేదు. ఈ పరిస్థితిని అత్యవసరంగా చక్కదిద్దాల్సిన అవసరం వుంది. ఇక ముఖ్యంగా నయా సరళీకరణ ఆర్ధిక సంస్కరణలకు సంబంధించి మనం ముందుగా ఒక ఉదాహరణ చెప్పుకోవాలి. కొన్ని దశాబ్దాలకు ముందు ఉపాధ్యాయ సంఘాలు, ఉద్యమం పార్టీ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాయి. మూడు దశాబ్దాల క్రితం వారు అందుకున్న వేతనాలను ప్రస్తుత వేతనాలతో పోలిస్తే అనేక రెట్లు పెరిగాయి. ఆర్థిక సంస్కరణలు కల్పిస్తున్న భ్రమల్లో భాగంగానే వారి వేతనాల పెరుగుదల కూడా కన్పిస్తోంది. తరగతి విభజనీకరణ ప్రక్రియ చోటు చేసుకుంటోంది. నేను వ్యక్తిగతంగా టీచర్లకు వ్యతిరేకం కాదు. ప్రస్తుత మారుతున్న పరిస్థితుల్లో వారు కీలక పాత్ర పోషించాల్సి వుంది. ప్రస్తుతం టీచర్లు కూడా తమ జీవితాలలో అనేక కొత్త రకం సమస్యలను ఎదుర్కొంటున్నారని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సమస్యలపై పోరాటాలు కూడా పెరుగుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో నిర్దిష్ట పరిస్థితులపై నిర్దిష్ట విశ్లేషణ చేస్తే ఉద్యమ పంథాను కూడా మెరుగుపర్చుకోవచ్చు. ఒకప్పుడు న్యూఢిల్లీ నుండి కొల్కతా వెళ్లేందుకు రైలెక్కితే ఆ మార్గానికిరువైపులా ప్రతి ఎమ్మెల్యే, ఎంపి కమ్యూనిస్టుగా వుండేవారు. ప్రస్తుత పరిస్థితి ఏమిటి? కమ్యూనిస్టు పార్టీల్లో చీలికలపై వస్తున్న బాహ్య వివరణలు మార్పులపై సమగ్రంగా, శాస్త్రీయంగా వివరణ ఇవ్వలేకపోతున్నాయి. ఒకప్పుడు అరుణపతాకచ్ఛాయలో వున్న వారు ఇప్పుడు ఇతర బూర్జువా పార్టీలవైపు ఎందుకు మొగ్గు చూపుతున్నారన్న విషయంపై సమగ్ర విశ్లేషణ జరగాల్సిన అవసరంవుంది. ఇక సమాజంపై పెరుగుతున్న సామాజిక మీడియా, సామాజిక నెట్వర్కింగ్ ప్రభావాన్ని గురించి చర్చించుకోవాల్సి వుంది. ఈజిప్ట్ తెహ్రీర్ స్క్వేర్ ఉద్యమం లేదా బంగ్లాదేశ్లో షాబాగ్ ఉద్యమంలో ప్రజల సమీకరణపై ఈ నెట్వర్కింగ్లు, మీడియా ఎటువంటి ప్రభావాన్ని చూపాయన్న విషయాన్ని మనం ఇటీవలి కాలంలో ప్రత్యక్షంగా చూశాం. మన దేశంలో విప్లవోద్యమాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు వీటిని సరైన విధానంలో ఉపయోగించుకునే అంశాన్ని పరిశీలించాల్సిన అవసరం వుంది. కామ్రేడ్ సుందరయ్య జీవితం, ఆయన కృషికి లెనిన్ ప్రవచించిన విధానాలు మార్గదర్శకంగా నిలిచాయన్న విషయం నేను పైన ప్రస్తావించిన నాలుగు అంశాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రస్తుతం మనం ఆయన శతజయంత్యుత్సవాలను జరుపుకుంటూ ఆయనకు నివాళులర్పిస్తున్నాం. ఈ సమయంలో లెనినిస్ట్ మార్గదర్శక సూత్రాలకు పునరంకితం కావటం ద్వారా విప్లవోద్యమాన్ని ముందుకు తీసుకెళ్లటానికి మన కృషిని, కృతనిశ్చయాన్ని రెట్టింపు చేద్దాం.
– సీతారాం ఏచూరి
సీపీఐ (ఎం) జాతీయ ప్రధాన కార్యదర్శి