నీడలా వెన్నంటే ఉండే స్ఫూర్తి

    పీడిత ప్రజల ప్రియతమ నాయకులు సుందరయ్య గారిని దగ్గరగా చూసినవారిలో నేను కూడా ఒకడిని కావడం నా జీవితంలోని ముఖ్యమైన ఘటనగా భావిస్తాను. 1980లో నేను పార్టీలోకి వచ్చాను. అంతకు ముందు ఆంధ్రా విశ్వవిద్యాలయంలో ఎం.ఏ సోషల్ వర్క్ చదువుకునేటప్పుడు మా విశ్వవిద్యాలయ రాజకీయ విభాగం( పొలిటికల్ డిపార్ట్ మెంట్) వారి ఆహ్వానం మేరకు విశాకపట్నంలో ఉపన్యసించారు. ఆ మహనాయకుడిని తొలిగా చూడటం అదే . అందరినీ ఆప్యాయంగా పలకరించే తీరు, స్వచ్ఛంగా మెరిసే నవ్వు , ఆ సరళమైన భాష ఇప్పటికీ మనస్సుపై తారల్లూడుతూనే ఉన్నది.
ఆ తదుపరి 81 ఆగస్టులొ ప్రజాశక్తి దినపత్రికగా వెలుపడుతున్న సందర్భంలో నేను ఉపసంపాదకునిగా మోటూరి హనుమంతరావు, బొమ్మారెడ్డి, వి.కె.ఆర్.బి కోటేశ్వరరావుల వద్ద పాత్రికేయ శిక్షణ పొందాను. అంతకు ముందు వారపత్రికలో ప్రపంచ భ్రమణం పేరిట సుందరయ్యగారు అంతర్జాతీయ వార్తలు రాసేవారు. వాటిని చాలా శ్రద్ధగా చదువుకునేవారం. 1983లో కారల్ మార్క్స్ శతవర్థంతి సందర్భంగా నేనే ప్రజానాట్యమండలి పూర్తికాలపు కార్యకర్తగా పనిచేస్తూ జీవితాన్ని మలచుకోవాలనే దృఢనిర్ణయానికి వచ్చాను. అప్పటి పి.ఎన్.ఎం రాష్ట్ర అధ్యక్షులు డా.ఎ.వి.విఠల్ గారి సహకారంతో సంకల్పాన్ని నేరవేర్చుకోగలిగాను. అప్పుడు పార్టీ రాష్ట్రకార్యదర్శి సుందరయ్య గారే. నా జీవన గమనపు మార్పుకు సుందరయ్యగారి ఆమోదం లభించినందకు ఇప్పటికీ గర్వపడుతుంటాను.
ఇప్పటికీ కళారంగంలో పట్టుదలగా పనిచేయాలని నేను కోరుకోవడంలో సుందరయ్యగారి స్ఫూర్తి ఉన్నదనే విషయం నా గమనంలో ఎప్పటికీ చెరిగిపోదు. అలా జీవితాంతం పనిచేయడమే ఆయనకు నేనివ్వగలిగే నివాళి.

                                                                                                                                                                                                                                                                                        – కె.శాంతారావు

Spread the love