8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

నవతెలంగాణ –  గ్రేటర్ నోయిడా: విషాద ఘటన చోటు చేసుకుంది. 8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి స్కూల్లోనే చనిపోయాడు. అప్పటివరకు మిగతా విద్యార్థులతో కలిసి ఎంతో హుషారుగా కనిపించిన అతడు.. ఇలా హఠాన్మరణం చెందడం తోటి విద్యార్థులు, ఉపాధ్యాయులను తీవ్రంగా కలిచివేసింది. అయితే, ఆ విద్యార్థి మృతికి గల కారణం ఉపాధ్యాయులను విస్తుపోయేలా చేసింది. రాంపూర్ వాసి అయిన భాలు సింగ్ స్థానికంగా ఉండే ఓ ప్రైవేట్ కంపెనీలో వర్కర్. అతడు పనిచేసే కంపెనీకి సమీపంలోని జల్పూరా గ్రామంలో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నాడు. అతడికి ఇద్దరు కుమారులు, ఓ అమ్మాయి. ఆ ముగ్గురు పిల్లలు కూడా స్థానిక అప్పర్ ప్రైమరీ స్కూల్‌లో చదువుతున్నారు. ఆ ముగ్గురిలో పెద్ద కుమారుడు రోహిత్ రోజులానే సోమవారం కూడా తన సోదరుడు, సోదరితో కలిసి స్కూల్‌కు వెళ్లాడు. స్కూల్‌కి వెళ్లిన తర్వాత కూడా అతడు హుషారుగానే ఉన్నాడు. అయితే, మధ్యాహ్నం భోజన సమయంలో ఇంటికి వెళ్లేందుకు క్లాస్ నుంచి బయటకు వచ్చే క్రమంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. అచేతనంగా పడిపోయిన అతడిని ఉపాధ్యాయులు హూటాహూటిన సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. హాస్పిటల్‌లో రోహిత్‌ను పరీక్షించిన వైద్యులు అప్పటికే అతడు చనిపోయినట్లు నిర్ధారించారు. ఆ తర్వాత రోహిత్ మరణానికి కారణం సడెన్ హార్ట్‌ఎటాక్ అని చెప్పడంతో ఉపాధ్యాయులు విస్తుపోయారు. ఇప్పటికీ 15 ఏళ్ల రోహిత్ ఇలా గుండెపోటుతో మృతిచెందాడంటే తాము నమ్మలేకపోతున్నామని స్కూల్ ప్రిన్సిపాల్ నూతన్ సక్సెనా ఆవేదన వ్యక్తంచేశారు. చదువులో ఎంతో చురుగ్గా ఉండేవాడని, మధ్యాహ్నం వరకు కూడా తోటి విద్యార్థులతో ఎంతో ఆనందంగా ఉన్నాడని ఆమె చెప్పుకొచ్చారు.

 

Spread the love