ఆటో కార్మికులకు నెలకు రూ.20వేల జీవన భృతి కల్పించాలి

– సీఐటీయూ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు అల్వాల రవికుమార్‌, సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు ఏర్పుల శేఖర్‌
నవతెలంగాణ-మహేశ్వరం
ఆటో కార్మికులకు నెలకు రూ.20వేల జీవన భృతి కల్పిం చాలని సీఐటీయూ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు అల్వాల రవికుమార్‌, సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు ఏర్పుల శేఖర్‌ అన్నారు. మంగళవారం మహే శ్వరం మండల కేంద్రంలో సీఐటీయూ ఆధ్వర్యంలో ఆటో కార్మికులు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పిం చిన నేపథ్యంలో ఆటో నడుపుకునే కార్మికులకు ఉపాధి లేకపోవడంతో ఆదాయం తగ్గు తుందన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్ర ప్రజలకు ఉచిత బస్స్‌ సౌకర్యం కల్పించడంతో మహిళలందరూ బస్సుల్లోనే ప్రయాణిస్తున్నారనీ, దీంతో ఆటోలను ఆదరించకపోవడంతో వారికి డీజిల్‌ ఖర్చు కూడా భారమ వుతున్నట్టు తెలిపారు. ఆటోల్లో ఎక్కేవారే కరుయ్యారని, కనీసం డీజిల్‌ కూడా గడిచే పరిస్థితి లేక ఆటో కార్మికుల జీవనోపాధి తీవ్రంగా దెబ్బతిన్నదన్నారు. మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత ప్రయాణంతో ఆటో కార్మికులకు ఉపాధి తగ్గిందని ఆవేదన వ్యక్తం చేశారు. బ్యాంకుల ద్వారా రుణాలు తీసుకొని ఆటోలు నడుపుకుంటున్న ఆటో కార్మికుల కుటుంబాల్లో పూట గడవని పరిస్థితి నెల కొందన్నారు. ఒకవైపు ఆటో ఈఎంఐలు, మరోవైపు కుటుంబ పోషణ భారంగా మారుతుందన్నారు. లక్షలాది ఆటో కార్మికుల జీవితాలు రోడ్డున పడ్డాయని తెలిపారు. రెక్కాడితే గాని డొక్కాడని ఆటో కార్మికుల జీవితాలపై కాంగ్రెస్‌ ప్రభుత్వం పునరాలోచన చేయాలని కోరారు. ఆటో కార్మి కులకు నెలకు రూ.20 వేల జీవనభృతి కల్పించాలి. రూ.25 లక్షల ప్రమాదబీమా, ఇన్సూరెన్స్‌ సౌకర్యం కల్పించాలన్నారు. ట్రాన్స్‌పోర్ట్‌ కార్మికులకు వెల్ఫేర్‌ బోర్డు ఏర్పాటు చేసి కార్డులు జారీ చేయాలనీ, ఫిట్‌నెస్‌లు, అడ్డా కేంద్రాలు ఏర్పాటు తదితర డిమాండ్లను నెరవేర్చి, ఆటో కార్మికుల కుటుంబాలను పట్టించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఆటో డ్రైవర్లు వృత్తినే వదిలేసుకుని రోడ్డున పడాల్సిన దుస్థితి వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మహేశ్వరం, కందుకూరు, అమీర్‌పేట్‌, తుక్కుగూడ ప్రాంతాల్లోని ఆటో కార్మికులు పాల్గొన్నారు.

Spread the love