విదేశాలకు పారిపోకుండా చర్యలు చేపట్టాలి
బాధితురాలికి న్యాయం చేయాలి
ఆంధ్రాకు డబ్బులిచ్చి…తెలంగాణకు పొదుపు సూత్రాలు చెప్పిన పీఎం : కల్వకుంట్ల కవిత
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడిపై పోలీసులు లుక్ ఔట్ నోటీసులు జారీ చేసి విదేశాలకు పారిపోకుండా చర్యలు చేపట్టాలని తెలంగాణ రక్షణ సేన (టీఆర్‌ఎస్) చీఫ్ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. బుధవారం హైదరాబాద్ బంజారాహిల్స్ లోని టీఆర్‌ఎస్ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆమెమాట్లాడారు. బండి భగీరథ్ పై గంభీరమైన ఆరోపణలు వచ్చినప్పటికీ బండి సంజయ్ ప్రధానితో వేదిక పంచుకోవటం శోచనీయమని అన్నారు. బడాబాబుల పిల్లలు ఏం చేసిన సరే పోలీసులు చర్యలు తీసుకోరన్న అభిప్రాయం ప్రధాని సభతో ప్రజల్లోకి వెళ్లిందన్నారు. నిందితులను దేశం దాటించే అలవాటు బీజేపీకి ఉందని గుర్తు చేశారు. ప్రజ్వల్ రేవణ్న కేసులో అది నిరూపితమైందని గుర్తుచేశారు. బీఆర్‌ఎస్ సోషల్ మీడియా అత్యుత్సాహం కారణంగా బాధిత అమ్మాయి ఫొటోలు బయటకు వచ్చాయని ఆవేదన వ్యక్తం చేశారు. బాధితుల ఫోటోలు బయటకు వస్తే వారు జీవితం నష్టపోయే ప్రమాదం ఉంటుం దన్నారు. ఫోటోలు పోస్ట్ చేసిన సోషల్ మీడియా ఎకౌంట్లను గుర్తించి వారిని అరెస్ట్ చేయాలని కవిత డిమాండ్ చేశారు. రాజకీయాల్లో లేని బండి సంజయ్ కుమారుడి విషయంలో రాజకీయాలను చేయటం తనకు ఇష్టం లేదని బాధితురాలికి న్యాయం జరగాలన్నదే తన అభిమతమన్నారు.
రాష్ట్ర పర్యటనకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్ కు జాతీయ హోదాపై మాట్లాడలేదనీ, హోదా విషయంలో సీఎం రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి లేదనీ, బీఆర్‌ఎస్ ప్రశ్నించలేదని విమర్శించారు. తెలంగాణకు పొదుపు సూత్రాలు చెప్పిన పీఎం ఆంధ్రాకు పైసలు ఇచ్చి వెళ్లిపోయారని మండిపడ్డారు. మహిళా బిల్లు, జన గణనలో కుల గణన గురించి ఒక్క మాట మాట్లాడలేదనీ, 16 రాష్ట్రాల్లో ప్రాజెక్ట్ లకు జాతీయ హోదా ఇచ్చి తెలంగాణకు ఎందుకు ఇవ్వరంటూ ప్రశ్నించారు. పాలమూరు-రంగారెడ్డి కి జాతీయ హోదా ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. దీనిపై తాము పోరాటం చేస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. అదే విధంగా బీసీ రిజర్వేషన్లకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం పంపించిన బిల్లులకు ఆమోదం తెలుపాలని మరోసారి డిమాండ్ చేశారు. జనగణ నలో కుల గణన కాలంతో పాటు సబ్ క్యాస్ట్, ప్రజల సామాజిక స్థితిగతులు తెలుసుకునేలా వివరాలు పొందుపర్చాలని కేంద్రాన్ని కవిత కోరారు. మహిళ బిల్లులో ఓబీసీ మహిళల సబ్ కోటా ఉండాల్సిందేన్నారు.
పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్ట్ కు జాతీయ హోదా విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ కవిత మండ పడ్డారు. నీళ్ల విషయంలో తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. పాలమూరు-రంగారెడ్డి కి జాతీయ హోదా కోసం ప్రధాని మోడీకి లేఖ రాయాలని రేవంత్ ను కోరారు. ఇప్పటి వరకు కూడా పాల మూరు – రంగారెడ్డి ప్రాజెక్ట్ విషయంలో ఒక్క రివ్యూ కూడా చేయలేదని కవిత విమర్శించారు. పోలవరం పూర్తి చేసేందుకు కషి చేస్తున్న రేవంత్ రెడ్డి గురువు చంద్రబాబు నాయుడిని చూసైన నేర్చుకోవాలని రేవంత్ కు సూచించారు. పాలమూరు -రంగారెడ్డి లాంటి పరిస్థితే ఉన్న అప్పర్ భద్రకు కూడా జాతీయ హోదా ఇచ్చారని కవిత గుర్తు చేశారు.
గోదావరి నీటి వాటాలో పావు శాతం, కృష్ణాలో అర శాతం కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉపయోగంలోకి తేవడం లేదని కవిత విమర్శించారు. ఆంధ్రాలో మాత్రం వాళ్ల వాటాకు మించి నీళ్లు వాడుకునేలా ఏర్పాట్లు చేసుకున్నారన్నారు. బీఆర్‌ఎస్ హయాంలో రూ.1.89 లక్షల కోట్లు ఖర్చు కాగా ఇప్పుడు కాంగ్రెస్ కూడా పెద్ద ఎత్తున డబ్బు ఖర్చు చేస్తుందని కానీ నీళ్లు మాత్రం వాడుకునే వ్యవస్థను ఏర్పాటు చేయలేకపోయారని మండిపడ్డారు. తాము అధికారంలోకి వచ్చాక తెలంగాణ లో సాగు యోగ్యమైన ప్రతి గుంటకు నీళ్లు ఇస్తామని కవిత చెప్పారు. ఇందుకోసం వాటర్ కమిషన్ ను ఏర్పాటు చేస్తామన్నారు. ప్రతి మూడు వేల ఎకరాలకు ఒక లష్కర్ ను నియమిస్తామని చెప్పారు. తెలంగాణలో ఉన్న అన్ని నదులపై వందేళ్లు పటిష్టంగా ఉండేలా గేట్లతో కూడిన చెక్ డ్యామ్ లు కడుతామన్నారు.
ఈ నెల 20 నుంచి చేపట్టబోయే జెండా పండుగ పార్టీ నిర్మాణానికి పునాది అని కవిత అన్నారు. పలు నియోజకవర్గాల్లో జెండా పండుగకు తాను హాజరవుతానని చెప్పారు. జెండా పండుగ నిర్వహణ ఆధారంగా పదవులు ఇస్తామని చెప్పారు. బీసీలకు చట్టసభలు, విద్య, ఉద్యోగాల్లో 50 శాతం రిజర్వేషన్ల కోసం పోరాడుతామని చెప్పారు. అన్ని రాష్ట్రాలు తిరిగి ఈ అంశంపై తమ వంతు ప్రయత్నం చేస్తామన్నారు. పది రూపాయల డైపర్ కూడా లీక్ కావటం లేదని, అలాంటి నీట్ పేపర్ ఎలా లీక్ అవుతుందని ప్రశ్నించారు.
రైల్వే కోర్టుకు హాజరైన కల్వకుంట్ల కవిత
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ కామారెడ్డిలో రైల్ రోకో చేసిన కేసులో తెలంగాణ రక్షణ సేన (టీఆర్‌ఎస్) చీఫ్ కల్వకుంట్ల కవిత బుధవారం రైల్వే కోర్టుకు హాజరయ్యారు. నాంపల్లిలోని మనోరంజన్ కాంప్లెక్స్ లో గల సికింద్రాబాద్ సెకండ్ జ్యూడీషియల్ మేజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ కోర్టు మేజిస్ట్రేట్ సమన్లు జారీ చేయడంతో వ్యక్తిగతంగా హాజరయ్యారు. కేసు తదుపరి విచారణ జూలై 17న నిర్వహిస్తామని మేజిస్ట్రేట్ ప్రకటించారు. విచారణ అనంతరం కవిత మీడియాతో మాట్లాడారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే వరకు ఉద్యమం కొనసాగిస్తామన్నారు.



