సీపీఐ(ఎం)నేడు రాష్ట్ర వ్యాప్త నిరసనలకు పిలుపు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ బాలికపై లైంగిక దాడికి పాల్పడటం అత్యంత హేయమైన చర్య అనీ, ఈ ఘటనలో భగీరథ్‌ను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అరెస్టు చేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. భగీరథ్‌ను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా గురువారం నిరసనలు చేపట్టాలని ప్రజలకు ఆ పార్టీ పిలుపునిచ్చింది. బుధవారం ఈ మేరకు సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ ఘటనపై మహిళా సంఘాలు, పౌర సమాజం నిరసనలు తెలుపుతున్నా, నిందితుడు బండి భగీరథ్‌పై పోక్సో కేసు నమోదైనప్పటికీ, పోలీసులు ఇప్పటి వరకు అరెస్టు చేయకపోవడాన్ని తప్పుబట్టారు. పోలీసు యంత్రాంగంపై రాజకీయ ఒత్తిళ్లే అనీ, బీజేపీ పలుకుబడిని ఉపయోగించి కేసును నీరుగార్చే ప్రయత్నం జరుగుతోందని విమర్శించారు. న్యాయానికి, చట్టానికి కట్టుబడి ఉంటానని చెప్పే బండి సంజయ్, తన కొడుకుని రహస్యంగా ఉంచి బెయిల్ కోసం కోర్టుల చుట్టూ తిరగడం బాధ్యతారాహిత్యమని పేర్కొన్నారు. చట్టంపై గౌరవం ఉంటే వెంటనే తన కుమారుడిని పోలీసులకు సరెండర్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి, డీజీపీ తక్షణమే జోక్యం చేసుకుని నిందితుడిని వెంటనే అరెస్టు చేయించాలనీ, బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చూడాలని కోరారు.



