లెబనాన్‌పై 4-0తో సంచలన విజయం
తొలిసారి క్వార్టర్‌ఫైనల్లో ప్రవేశం
ఏఎఫ్‌సీ అండర్-17 ఆసియా కప్
న్యూఢిల్లీ : భారత ఫుట్‌బాల్ చరిత్రలో సరికొత్త అధ్యాయం. భారత మహిళల యువ జట్టు ఆసియా కప్‌లో అద్భుతం చేసింది. రెండు దశాబ్దాలుగా ఆసియా కప్‌లో ఒక్క విజయం సాధించని అమ్మాయిలు, ఏఎఫ్‌సీ ఆసియా కప్ చరిత్రలో ఎన్నడూ నాకౌట్ దశకు చేరుకోని భారత్ ఇప్పుడు ఆ రెండింటిని సాకారం చేసుకుంది. చైనాలోని సుజోవ్‌లో జరుగుతున్న ఏఎఫ్‌సి మహిళల అండర్-17 ఆసియా కప్‌లో టీమ్ ఇండియా ముందంజ వేసింది. గ్రూప్ దశ ఆఖరు మ్యాచ్‌లో అగ్రజట్టు లెబనాన్ పై 4-0తో కండ్లుచెదిరే విజయం నమోదు చేసింది. క్వార్టర్‌ఫైనల్‌కు చేరాలంటే తప్పక నెగ్గాల్సిన మ్యాచ్‌లో అమ్మాయిలు ఆకట్టుకున్నారు. టోర్న మెంట్‌లో ఒక్క గోల్ కొట్టని భారత్.. లెబనాన్‌పై శుక్రవారం విరుచుకుపడింది. లెబనాన్‌పై విజయంతో గ్రూప్-బిలో తృతీయ స్థానంలో నిలిచింది. గ్రూప్ దశలో తృతీయ స్థానంలో నిలిచిన జట్లలో టాప్-2లో నిలిచిన టీమ్ ఇండియా.. ఫిలిప్పీన్స్‌తో పాటు క్వార్టర్‌ఫైనల్ బెర్త్ దక్కించుకుంది. ఏఎప్‌సీ ఆసియా కప్ చరిత్రలో తొలి సారి క్వార్టర్‌ఫైనల్లో ఆడనున్న భారత్.. సెమీస్ వేటలో ఆతిథ్య చైనాను ఢీకొట్టనుంది. క్వార్టర్స్‌లో చైనాపై భారత్ విజ యం సాధిస్తే… ఈ ఏడాది మొరాకోలో జరుగ నున్న ఫిఫా మహిళల అండర్-17 ప్రపంచకప్‌కు భారత్ నేరుగా అర్హత సాధించనుంది. ప్రతిభ ఆధారంగా భారత్ నుంచి సీనియర్, జూనియర్ సహా మహిళలు, పురుషుల జట్టు ఏదీ ఫిఫా ప్రపంచకప్‌కు ఇప్పటివరకు అర్హత సాధించ లేదు. భారత అండర్-17 జట్టు అమ్మాయిలు ఇప్పుడు చారిత్రక విజయం ముంగిట నిలిచారు. గ్రూప్-ఏలో అగ్రస్థానంతో చైనా క్వార్టర్‌ఫైనల్‌కు చేరుకుంది.
అమ్మాయిల గోల్స్ మోత
గ్రూప్-బిలో తప్పక నెగ్గాల్సిన మ్యాచ్‌లో భారత అమ్మాయిలు సమిష్టిగా రాణించారు. ప్రితిక బర్మన్ 7వ, 85వ నిమిషంలో గోల్స్ కొట్టగా.. అల్వ దేవి సెంజమ్ 36వ నిమిషంలో, జోయ 72వ నిమిషంలో గోల్స్ కొట్టారు. ప్రథమార్థంలో 2-0తో ఆధిక్యంలో నిలిచిన భారత్.. ద్వితీయార్థంలోనూ దుమ్మరేపింది. ఏఎఫ్‌సీ అండర్-17 ఆసియా కప్‌లో 2005 తర్వాత భారత్ గోల్ ఖాతా తెరవటం ఇదే తొలిసారి కాగా, తొలి విజయం సైతం ఇప్పుడే వచ్చింది!.



