ప్రాంఛైజీ యజమానులకు
సైతం గైడ్‌లైన్స్
ఐపీఎల్‌లో
అమల్లోకి
కఠిన నిబంధనలు
ముంబయి : ఐపీఎల్‌లో మితిమీరుతున్న గర్ల్‌ఫ్రెండ్స్ కల్చర్‌కు అడ్డుకట్ట వేసేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కఠిన నిబంధనలు తీసుకొచ్చింది. ఈ సీజన్‌లో పలు సంఘటనలు సోషల్ మీడియాలో దుమారం రేపటంతో యాంటీ కరప్షన్ అండ్ సెక్యూరిటీ వింగ్ అప్రమత్తమైన సంగతి తెలిసిందే. ఐపీఎల్‌లో క్రికెటర్లు, సహాయక సిబ్బంది, ప్రాంఛైజీ యజమానుల స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రోటోకాల్స్ (ఎస్‌ఓపీ)లో మార్పులు తీసుకొస్తూ ఏసీఎస్‌యూ సమగ్ర నివేదికను బీసీసీఐకి అందజేసిన సంగతి తెలిసిందే. ఏసీఎస్‌యూ నివేదికను పరిగణనలోకి తీసుకున్న బీసీసీఐ.. ఐపీఎల్ స్టాండర్స్ ఆపరేటింగ్ ప్రోటోకాల్స్ రూల్స్‌లో మార్పులు చేర్పులతో ప్రాంఛైజీ సీఈవోలకు లేఖలు రాసింది. ఐపీఎల్ నూతన ఎస్‌ఓపీ ప్రకారం ప్లేయర్స్, మ్యాచ్ అఫీషియల్స్ ఏరియా (పిఎంఓఏ) సహా డగౌట్, డ్రెస్సింగ్‌రూమ్, హోటల్ రూమ్‌లో పాటించాల్సిన నిబంధనలను కఠినతరం చేసింది. కొత్త రూల్స్ ప్రకారం టీమ్ మేనేజర్, టీమ్ ఇంటిగ్రిటి ఆఫీసర్ అనుమతి లేకుండా ఏ ఆటగాడు తన హోటల్ రూమ్‌కు ఇతరులను ఆహ్వానించడానికి వీల్లేదు. నిబంధనలకు విరుద్ధంగా కుటుంబసభ్యులు కానివారు జట్టుతో పాటు టీమ్ బస్‌లో ప్రయా ణం చేయకూడదు. హనీ ట్రాప్ , సెక్యూరిటీ సహా న్యాయపరమైన చిక్కులు ఎదుర్కొనే ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించింది. ప్రాంఛైజీ యజమానులు సైతం మ్యాచ్ సమయంలో జట్టుతో కమ్యూనికేషన్ కొనసాగించడానికి వీల్లేదు. మ్యాచ్ జరుగుతున్న సమయంలో పిఎంఓఏ సహా డగౌట్ ఏరియాకు యజమానులు వెళ్లకూడదు. గ్రౌండ్‌లో క్రికెటర్లతో యజమానులు ఆలింగం చేసుకోవటం వంటివి మంచి ఉద్దేశాలే అయినా.. భవిష్యత్‌లో ఇటువంటివి పునరావృతం చేయకూడదని ఎస్‌ఓపీలో పొందు పరిచారు. కొత్త రూల్స్ అమలు తీరును పర్యవేక్షించేందుకు ఐపీఎల్ పత్యేక బృందాలు ఏర్పాటు చేసింది. క్రికెటర్లు, సహాయక సిబ్బంది సహా యజమానులు రూల్స్‌ను ఉల్లంఘించినట్టు తేలితే.. జరిమా నాలు, సస్పెన్షన్ వంటి శిక్షలు విధిస్తామని సీఈవోలకు రాసిన లేఖలో బీసీసీఐ కార్యదర్శి దేవాజిత్ సైకియా స్పష్టం చేశారు. దీనితో పాటు వేపింగ్ (ఈ సిగరెట్) భారత చట్టాలకు ప్రకారం నిషేధం. నిషేధిత వేపింగ్ సహా ఇతర కార్యకలాపాలను డగౌట్, డ్రెసింగ్‌రూమ్, ప్రాక్టీస్ సెషన్లలో పునరావృతమైతే కఠినంగా వ్యవహరిస్తామని సైకియా హెచ్చరించారు.



