Friday, June 19, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిపుష్కర కాలం- ఏమున్నది గర్వకారణం?

పుష్కర కాలం- ఏమున్నది గర్వకారణం?

- Advertisement -

కొన్ని సందర్భాల్లో చర్చలు కూడా విచిత్రంగా జరుగుతాయి. ముఖ్యంగా నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత దేశం గురించి గానీ, దేశ ఆర్థిక వ్యవస్థల గురించి గానీ, లేదా సామాజిక సమస్యల గురించి గానీ, మరియు రాజకీయ పోకడల గురించి గానీ చర్చించడం కన్నా మోడీని స్తుతిస్తూ జరిగిన డిబేట్లే ఎక్కువ. మోడీని భారతదేశానికి ప్రత్యామ్నాయంగా చూసే పరిస్థితులు నెలకొల్పుతున్నారంటే ఆశ్చర్యం లేదు. ఇంతటి వ్యక్తిగత భక్తి ప్రజాస్వామ్యానికి అత్యంత ప్రమాదకరం. నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టి నిరంతరాయంగా 12 సంవత్సరాలు గడిచిన సందర్భంగా ఒక వ్యక్తిగా ఆయనకు ఇస్తున్న క్రెడిట్ గాని, ఆయన గురించి జరుగుతున్న చర్చలు గాని అత్యంత శోచనీయంగా ఉన్నవి. ప్రధాన మీడియా నుండి మొదలుకొని అనేకమంది కాలమిస్టులు ఇదే ధోరణిని ప్రదర్శించడం ఆశ్చర్యకరం. ఇక సోషల్ మీడియాలో అంధభక్తుల సంగతి చెప్పనవసరమే లేదు. పరిస్థితి ఎలా తయారైందంటే ఆర్థిక సామాజిక రాజకీయ అంశాలను ఎవరైనా కనీసం వేలెత్తి చూపితే సరాసరి మోడీని కించపరుస్తున్నంత భావవేశాలకు అంధభక్తులు గురవుతున్నారు.

ఈ సందర్భంగా జవహరాల్ నెహ్రూను మించి మరి మోడీ ప్రధానమంత్రిగా ఎక్కువ కాలం ఆ పదవిలో కొనసాగారని కొత్త కోణంలో అర్థాలు తీస్తు న్నారు. అనగా నెహ్రూ ఎన్నికల అనంతరం అంటే 1952 మే 13 నుండి 1964 మే 27 వరకు నిరంతరాయంగా పన్నెండేండ్ల 14 రోజులు పని చేశారు కాబట్టి ఆ మైలురాయిని మోడీ అధిగమించి కొత్త రికార్డును నెల కొల్పారని చర్చలకు దిగారు. 1947 ఆగస్టు 15 నుండి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టి ఎన్నికలు నిర్వహించి మళ్లీ 1952 మే 13న ప్రధాన మంత్రిగా ఎన్నికైన కాలాన్ని బాధ్యత రహితంగా లెక్కలోంచి ఈ అంధ భక్తులు తీసివేసి చర్చిస్తున్నారు. ఎంతకాలం అధికారంలో కొనసాగితే ఏమున్నది! ఎలాంటి పాలనాపర నిర్ణయాలు తీసుకున్నారనేది ముఖ్యంగా చూడవలసిన అవసరం ఉంది కదా. అలా కాకుండా కేవలం పరిపాలన కాలాన్ని లెక్కిస్తూ ఒక సంకుచిత ఆనందాన్ని పొందే ప్రయత్నాలు చేయడం చాలా విచారకరం. నిజానికి బ్రిటిష్ పాలకులు 1945లోనే భారతదేశాన్ని విడిచి వెళ్లిపోవాలనే నిర్ణయాన్ని చేశారు. 1946లో ఇండియాలోని అనేక ప్రావిన్సులకు ఎన్నికలు జరిగాయి.

ఆ ఎన్నికలలో ఆనాటి కాంగ్రెస్ పార్టీ అత్యంత ఘనవిజయాన్ని సాధించింది. అప్పటికే కీలక బాధ్యతలు చూస్తు న్నటువంటి నెహ్రూను ఏకగ్రీవంగా నాయకుడిగా ఎన్నుకున్నారు. బ్రిటిష్ వారి సూచన మేరకు ఒక కాన్స్టిట్యూట్వెంట్ అసెంబ్లీ ఏర్పాటు చేసుకో వాలని, దాని ద్వారా రాజ్యాంగ రచన జరగాలని, అలాంటి నిర్ణయానికి ఒక అడహాక్, తాత్కాలిక, పరిపాలన వ్యవస్థ ఉండాలని ఆనాడు నిర్ణయమైంది. అందుచేత 1946 సెప్టెంబర్ 2న నెహ్రూ భారతదేశానికి నాయకుడుగా ఎన్నుకోబడ్డాడు. ఆయన నాయకత్వంలోనే సర్దార్ వల్లభాయ్ పటేల్, బాబు రాజేంద్రప్రసాద్, శ్యామ ప్రసాద్ ముఖర్జీ వంటి వారందరూ బాధ్యతల్లోకి దిగారు. వీరందరి ఆధ్వర్యంలోనే రాజ్యాంగ రచన కమిటీ ఏర్పాటయింది. ఆ తర్వాత భారతదేశానికి స్వతంత్రం రావడం, రాజ్యాంగ రచన జరగడం, రాజ్యాంగం అమల్లోకి రావడం ఇవన్నీ కూడా ఒక క్రమ పద్ధతిలో నెహ్రూ ప్రధానమంత్రి హోదాలో నిర్వహించినవే.

ప్రభుత్వ రంగాలను నిర్మించిన నెహ్రూ
నిస్సందేహంగా నరేంద్ర మోడీ పన్నెండేండ్లు నిరంతరాయ పరిపాలన అందించారు. నెహ్రూ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టే నాటికి భారత దేశం ఒక వలసవాద విముక్తి దేశం. అంతే కాకుండా కనీస మౌలిక వసతులు కల్పన కూడా జరగలేదు. పరిశ్రమలు లేవు, అదునాతన వ్యవ సాయం తెలియదు, నీటి ప్రాజెక్టులు లేవు, ప్రజలంతా కేవలం పద్నాలుగు శాతం మాత్రమే అక్షరాస్యులు, ప్రైవేటు పెట్టుబడి లేదు, భారీ వ్యాపార సంస్థలు లేవు, విమానాశ్రయాలు, నౌకాశ్రయాలు, ఇనుము, ఉక్కు కర్మా గారాలు ఏవి కూడా లేవు. ఇలాంటి పరిస్థితులలో దేశానికి నాయకత్వం వహిస్తూ వీటన్నింటికీ అంకురార్పణ చేసిన ఘనత కేవలం నెహ్రూది మాత్రమే. రెండవ ప్రపంచ యుద్ధానికి ఆజ్యం పోసిన అమెరికా, అప్పుడే స్వాతంత్రం సాధించుకున్న భారతదేశానికి ఏ మాత్రం సహాయ పడలేదు. ఇనుము ఉక్కుకర్మాగారాలు నెలకొల్పుకోవడానికి ఇంగ్లాండ్, పశ్చిమ జర్మనీ, రష్యా వంటి దేశాలు మాత్రమే ముందుకొచ్చి సహాయం చేశాయి. ఇలాంటి సహాయాన్ని పొందడంలో నెహ్రూ కృతకృతీయు లయ్యారు. ప్రజల దగ్గర నుండి చిన్న మొత్తాల పొదుపులను సేకరించే బ్యాంకులను ఇన్సూరెన్స్ రంగాలను నెలకొల్పి మౌలిక వసతులు కల్పనలకు నిధులను సమకూర్చి రవాణా మార్గాలను, ఓడరేవులను విమానా శ్రయాలను, అంతరిక్ష పరిశోధనలకు ఉపయోగపడే ఇస్రోను కూడా నెలకొల్పిన ఘనత నెహ్రూ ది మాత్రమే.

మోడీది కార్పొరేట్‌ అనుకూల పాలన
మోడీ అధికారం చేపట్టే నాటికి పైన పేర్కొనబడిన దాదాపు అన్ని సదుపాయాలను భారతదేశం కలిగి ఉన్నది. ప్రభుత్వ రంగాల ద్వారా పటిష్టంగా తయారైన భారతకు ఆర్థిక వ్యవస్థలో ప్రైవేటు పెట్టుబడికి ఎంతో అవకాశాలు కలిగాయి. తద్వారా ప్రైవేటు సంస్థలు కార్పొరేటు వ్యవస్థలు వేళ్లునుకొని ఉన్న పరిస్థితి. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన మిలిటరీ, ప్రపంచ దేశాలను సవాలు చేసే ఆర్థిక వ్యవస్థ, ప్రపంచ దేశాలకు సర్వీ సులను అందజేసే యువ నైపుణ్యం మోడీ అధికారం చేపట్టే నాటికి భారత దేశంలో పుష్కలంగా ఉన్నాయి. ఇలాంటి వ్యవస్థను నడిపించడం కష్టమా లేక ఏ వసతులు లేని నెహ్రూ కాలం నాటి దేశాన్ని నడిపించడం కష్టమా? అట్టహాసంగా భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో మూడవ ఆర్థిక వ్యవస్థగా ఎదగబోతున్నదని ప్రకటించి ఏడాది గడవకముందే మెల్లిమెల్లిగా వెనకడుగు వేస్తూ మళ్లీ ప్రపంచంలో ఆరవ లేదా ఏడవ స్థానానికి పడిపోయే పరిస్థితి ఇప్పుడు మన కళ్ల ముందున్నది. నిజానికి ఈ దేశంలో ఉత్పత్తి జరగడం లేదా అంటే అలాంటిదేమీ లేదు. ఉత్పత్తి జరుగుతున్నది కానీ ఒక విచిత్ర మైన ఆర్థిక ఎదుగుదల దేశంలో నెలకొంటున్నది. అధికాదాయం కలిగిన వాళ్లు మరింత ధనవంతులుగా మారుతుంటే అల్పాదాయం కలిగిన వాళ్లు వారి ఆర్థిక శక్తిలో క్షీణత ఏర్పడుతున్నది. అనగా 2014 కన్నా ముందు దేశంలో ఒక శాతం ప్రజల దగ్గర 12 శాతం సంపద ఉంటే 2026 లో ఒక శాతం ప్రజల దగ్గర 22శాతం సంపద పోగయింది. కొద్దిమంది చేతుల్లో ఎక్కువ సంపద పోగవుతూ ఎక్కువ మంది చేతులలో తక్కువ సంపద పోగవుతూ ఉంటే దాని అభివృద్ధి నమూనా తిరోగమనమే!

దిగజారిన రాజకీయాలు
ప్రతిపక్షాలకు సముచిత స్థానం ఇవ్వడం, విమర్శలను హుందాగా స్వీకరించడం ద్వారా మాత్రమే పటిష్ట ప్రజాస్మ్యాన్ని నిర్మించవచ్చన్న సూత్రాలకు భిన్నంగా నేడు పాలన సాగుతున్నది. ప్రతిపక్షాల ఉనికి లేకుండా చూడటమే ప్రధాన లక్ష్యంగా రాజకీయ పావులు కదులుతున్నాయి. స్వీడన్ కు సంబంధించిన వీడెమ్ అనే స్వతంత్ర పరిశోధనా సంస్థ ప్రకటించినట్లు, భారతదేశంలో ప్రజాస్వామ్యం పూర్తిగా మాయమైపోయి కేవలం ఎలక్టోరల్ ఆటోక్రసి, ఎన్నికల ఏకస్వామ్యం, కొనసాగుతున్నది. ఎన్నికలు ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబించేవిగా ఉండాలి. కానీ, ఇప్పుడు అధికార పార్టీ కనుసన్నల్లో, అదుపు ఆజ్ఞలలో మాత్రమే జరిగే స్థితి ఏర్పడిందంటే ఆశ్చర్యం లేదు. ఇక ప్రతిపక్ష నాయకులపై ఇన్కమ్ టాక్స్, ఈడి, సెబి లాంటి సంస్థలను పురమాయించి, లొంగదీసుకుని మెజారిటీ పార్టీ కండువా కప్పుకునే భయకంపిత వాతావరణం నెలకొన్నది. అధికార పక్షానికి దగ్గరలో లేకుంటే తమ ఆస్తిపాస్తులకు ఏమాత్రం భరోసా లేదనే స్థితికి భారత రాజకీయాలు గత దశాబ్ద కాలంలో పడిపోయాయి. ఇక న్యాయ వ్యవస్థ ఎన్నికల కమిషన్, కేంద్రం ఆధీనంలో పనిచేసే ప్రధాన ప్రాధికార సంస్థలు సిబిఐ,ఈడి వంటివన్నీ కూడా వాటి ప్రభావాన్ని కోల్పోయాయి. ఎందుకంటే మితిమీరి అధికార పక్షానికి వంత పాడుతున్నాయి. నేడు వాటి స్వతంత్రత ప్రశ్నార్థకమైంది. ప్రజలెవరూ కూడా వాటిని నమ్మే పరిస్థితిలో లేరు. అయినప్పటికీ అధికారాన్ని చేపడుతున్నారు కదా అని అంటే దానికి ప్రధాన కారణం భావోద్వేగాలతో ఒక సమూహాన్ని ద్వేషించే స్థితికి ప్రజల మనోభావాలను నిర్మించడంలో సఫలీకృతులయ్యారు కాబట్టి.

ప్రమాదకరంగా మతపరమైన ఏకీకరణ
గడిచిన పుష్కర కాలంలో ఈ దేశం ఏమైనా సాధించిందంటే అది మతపరమైన ఏకీకరణ లేదా మైనారిటీ మతాన్ని ద్వేషించే ఒక సంకుచిత భావజాలం పెరిగి పెద్దదయింది. ఇస్లామో ఫోబియా అత్యంత భయా నకంగా పెరిగిపోతున్నది. తాత్కాలిక రాజకీయ ప్రయోజనాల కోసం భారతీయ జనతా పార్టీ ఆ దుశ్చర్యకు పాల్పడుతున్నది. ఇలాంటి మత పరమైన రంగు పూర్తిగా ప్రజలందరిపై రుద్దడం వలన పాలనా వ్యవస్థ లోని లోపాలను ఎత్తి చూపినా దాన్ని దేశద్రోహంగా భావించే స్థితికి పడిపో యారు. ఈ మతపరమైన ద్వేషాలు రాజకీయాలకు మాత్రమే పరిమితం కాకుండా సమాజంలో అన్ని వ్యవస్థల్లో చొరబడ్డాయి. చివరకు ఆఫీసుల్లో మరియు వర్గ ప్రయోజనానికి కట్టుబడి ఉండే కార్మికుల్లోనూ వీటి ప్రభావం విపరీతంగా ఉన్నది. ఇలాంటి మితవాద దోరణల వల్ల తాత్కాలిక రాజకీయ ప్రయోజనం కలగవచ్చును గాని దీర్ఘకాలంలో వైపరీత్యాలకు ఇదే నాంది అవుతుంది.

కార్మిక చట్టాల స్థానంలో లేబర్‌‌కోడ్‌‌లు
గడచిన శతాబ్దకాలంగా అనేకానేక సందర్భాలలో వివిధ రకాల పోరాటాల ద్వారా కార్మికులు చట్టాలను సాధించుకున్నారు. ఇలాంటి 29 చట్టాల వల్ల ఒక క్రమ పద్ధతిలో పారిశ్రామిక వ్యవస్థ పరుగులు తీసింది. అందు చేతనే భారతదేశం అభివృద్ధి నమూనాను చవిచూసింది. కానీ మితిమీరిన లాభాలకు తెరతీసిన కార్పొరేట్ వ్యవస్థ, అంతర్జాతీయ పెట్టుబడి కలిసి కార్మిక చట్టాలను పూర్తిగా కాలరాసి నాలుగు లేబర్ కోడ్‌‌లను ముందుకు తెచ్చాయి! వీటిని ప్రతిపాదించిన 2019 నుంచి క్రమం తప్పకుండా దేశ కార్మిక వర్గం విపరీతంగా వ్యతిరేకిస్తున్న ప్పటికీ ఏమాత్రం ఖాతరు చేయకుండా కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా వీటిని అమల్లోకి తీసుకు వచ్చింది. దేశవ్యాప్తంగా జరిగిన సమ్మెలను, క్రమం తప్పని ధర్నాలను పూర్తిగా విస్మరించింది. ఈ కోడ్ లను అమలులోకి తీసుకొచ్చిన తర్వాత కార్మిక సంఘాలకు ప్రాధాన్యత లేకుండా చేయడమే ప్రథమ లక్ష్యంగా కేంద్రం ముందుకు సాగుతున్నది.

కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ వ్యవస్థలను మరింత పెంచి పోషించడం ద్వారా సంఘటిత రంగాలకు అవకాశం లేకుండా చేసి, కార్మిక సంఘాల ద్వారా నడిచే పోరాటాలే లేకుండా చేయాలనే కార్పొరేట్ వ్యవస్థల ఆకాంక్షలను కేంద్ర ప్రభుత్వం పూర్తి చేస్తుంది. ఇలాంటి సందర్భంలో వర్గ ఐక్యతపై సరైన అవగాహన ఉన్న కార్మికులందరూ మరింత చైతన్యవంతులు కావడం ఎంతో ఆవశ్యం. దీనికోసం విపరీతమైన త్యాగాలు చేయనవసరం లేదు గానీ క్రమం తప్పని నిరసన కార్యక్రమాలలో కూడా పాల్గొనకపోతే భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారే పరిస్థి‌తులున్నవి. వీటిని మరింత లోతుగా అధ్యయనం చేసి దేశంలో పెట్రేగిపోతున్న కార్పొరేట్ కమ్యూనల్, పొలిటికల్ నెక్సస్ ను ఎదుర్కోవడానికి ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాల్సిందే.

గూళ్ల తిరుపతయ్య, 9951300016

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -