ప్రజాస్వామ్యంలో అధికారాన్ని ప్రశ్నించడం పౌరుల హక్కు. ప్రభుత్వ వైఫల్యాలను నిలదీయడం ప్రతిపక్షాల బాధ్యత. కానీ, నేడు దేశంలో ప్రశ్న అడిగిన వారిపై దాడి చేయడం, దాడిచేసిన వారిని వీరులుగా కీర్తించడం, నిందితులకు పూలదండలు వేసి ఊరేగింపులు నిర్వహించడం రోజు రోజుకూ దేశంలో ఒక కొత్త రాజకీయ సంస్కృతిగా మారుతోంది. నీట్ పేపర్ లీకేజీ, కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఆందోళన, కేంద్ర విద్యామంత్రి రాజీనామా డిమాండ్, పలు రాష్ర్టాల్లో యువత నిరసనలు అధికార పార్టీని ఆద్యంతం కలవరపెట్టిన మాట నిజం. దీన్ని జీర్ణించు కోలేని కాషాయ మూక ఈ నెల పదిహేనున రాజస్థాన్‌లోని జైపూర్‌లో సీజేపీ చేపట్టిన ప్రదర్శనలో వీరంగం సృష్టించింది. అధ్యక్షుడు అభిజిత్ దీప్కేపై దాడికి దిగింది. ప్రజాస్వామ్యంలో ప్రశ్నకు జవాబు చెప్పాల్సిన చోట భౌతికదాడిని ఆయుధంగా ఎంచుకోవడం ప్రమాద కరం.పోలీసులు ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు.
కానీ అసలు వివాదం అక్కడితో ఆగలేదు. బెయిల్‌పై విడుదలైన నిందితులకు పూల దండలు వేసి స్వాగతించడం, మోటార్‌సైకిల్ ర్యాలీలు నిర్వహించడం, ‘జై శ్రీరామ్’, ‘భారత్ మాతాకీ జై’, ‘హిందూ ఏక్తా జిందాబాద్’ వంటి నినాదాలతో వారిని వీరులుగా చిత్రీకరించడం దేశవ్యాప్తంగా విమర్శలకు దారితీసింది. బెయిల్ అనేది న్యాయ ప్రక్రియలో ఒక భాగం మాత్రమే. అది నిర్దోషిత్వానికి ధ్రువీకరణ కాదు. అయినప్పటికీ నిందితులను సమాజ రక్షకులుగా, మత యోధులుగా ప్రదర్శించడం న్యాయవ్యవస్థకు, ప్రజాస్వా మ్యానికి, బాధితులకు అవమానం. మరింత ప్రమాదకర విషయం ఏమిటంటే, ఈ ఘటనలో నేరారోపణలపై కాకుండా నిందితుల మతపరమైన గుర్తింపుపై ప్రచారం జరగడం. ఇదొక్కటే కాదు, గత దశాబ్ద కాలంగా ఇలాంటి దృశ్యాలు దేశంలోని అనేక ప్రాంతాల్లో కనిపిస్తున్నాయి. గుజరాత్‌లో బిల్కిస్ బానోపై సామూహిక లైంగికదాడి, ఆమె కుటుంబ సభ్యుల హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్న దోషులు విడుదలైనప్పుడు వారికి పూలమాలలు వేసి ఘన స్వాగతం పలికిన ఘటన దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.
కొందరు వారికి మిఠాయిలు పంచి సన్మానించారు. ‘హత్రాస్’ ఘటనలోనూ బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేసినవారికంటే నిందితుల పక్షాన నిలిచిన శక్తులు ఎక్కువగా కనిపించాయి. లైంగిక, హత్య వంటి తీవ్రమైన నేరాలకు సంబంధించి కూడా నిందితులను సామాజిక హీరోలుగా మలిచే ప్రయత్నాలు జరిగాయి. అదేవిధంగా ఢిల్లీ అల్లర్ల కేసులు, మత ఘర్షణల కేసులు, గోరక్షణ పేరిట జరిగిన దాడులు, మైనార్టీలపై హింసకు సంబంధిం చిన అనేక సందర్భాల్లోనూ నిందితులకు సంఘీభావ ర్యాలీలు నిర్వహించడం దేశం చూసింది. ఇవన్నీ బీజేపీ పాలిత రాజస్థాన్, గుజరాత్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, హర్యానా వంటి రాష్ట్రాల్లో తరచూ వెలుగు చూస్తున్నవి. చట్టాన్ని ఉల్లంఘించిన వారిని సమాజంలో ఆదర్శంగా నిలబెట్టే ఈ సంస్కృతి నేరాన్ని సాధారణీకరిం చడమే తప్ప వేరేకాదు. అయితే, ఈ పరిస్థితి యాదృచ్ఛికంగా ఏర్పడలేదు. బీజేపీ పాలనలో రాజకీయ చర్చల స్థాయిలో వచ్చిన మార్పుల ఫలితమిది.
అధికారాన్ని ప్రశ్నిం చిన వారిని ‘దేశద్రోహులు’, అర్బన్ నక్సల్స్’, ‘పాకిస్థాన్ ఏజెంట్లు’, ‘హిందూ వ్యతిరేకులు’గా ముద్ర వేయడం వ్యూహాత్మకంగా సాగుతోంది. విద్యార్థులు ప్రశ్నించినా, జర్నలిస్టులు విమర్శించినా, ప్రతిపక్షాలు నిలదీసినా దేశద్రోహం అన్న భావజాలం దించబడింది. ప్రజాస్వామ్యంలో అసమ్మతి సహజమనే సూత్రాన్ని పక్కనబెట్టి, విభేదాన్ని శత్రుత్వంగా చిత్రీకరించడం వల్లే ఇలాంటి హింసాత్మక వాతావరణం బలపడుతోంది. రాజ్యాంగం ప్రతి పౌరుడికి అభిప్రాయ స్వేచ్ఛను హామీ ఇస్తుంది. ప్రభుత్వ విధానాలను విమర్శించే హక్కు కూడా అదే రాజ్యాంగం కల్పించింది. కానీ ప్రశ్నించిన వారిపై దాడులు జరగడం, దాడిచేసిన వారిని కీర్తించడం, వారి విడుదలను విజయోత్సవంగా మార్చడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం. న్యాయస్థానాలు ఇంకా విచారణ కొనసాగిస్తుండగానే నిందితులను మతం, జాతి, జాతీయత పేరుతో కొలవడం సమాజాన్ని మరింత ప్రమాద కర దిశలో నడిపిస్తుంది.
ఇక్కడ మరో ప్రశ్న కూడా తలెత్తుతోంది. ‘జై శ్రీరామ్’, ‘భారత్ మాతాకీ జై’ వంటి నినాదాలు నిజంగా దేశభక్తి, ఆధ్యాత్మిక విశ్వాసాలకు ప్రతీకలా? లేక నేరారోపణలను కప్పిపుచ్చే రాజకీయ ఆయుధాలా? ఒక దాడి కేసులో నిందితుల స్వాగత ర్యాలీలో ఈ నినాదాలు వినిపించడం వల్ల నినాదాల గౌరవమే దెబ్బతింటోంది. చట్టం ముందు అందరూ సమానమనే రాజ్యాంగ సూత్రానికి బదులుగా, రాజకీయ అను బంధమే రక్షణ కవచంగా మారుతున్న సందేశం వెళ్తోంది. నేరానికి శిక్ష పడాలా వద్దా అనేది కోర్టులు నిర్ణయిస్తాయి. కానీ నిందితులను వీరులుగా కీర్తించాలా వద్దా అనేది సమాజం నిర్ణయించాలి. నేడు దాడి చేసిన వారిని పూలదండలతో సత్కరిస్తే, రేపు మరింత తీవ్రమైన నేరాలకు కూడా అదే సంస్కృతి విస్తరిస్తుంది. ప్రజాస్వామ్యంలో వాదనకు ప్రత్యుత్తరం వాదనే కావాలి, దాడి కాదు. చట్టానికి గౌరవం కావాలి, నిందితులకు ఊరేగింపు కాదు. ప్రశ్నించడం నేరమై, దాడి చేయడం దేశభక్తిగా మారిన పరిస్థితి భవిష్యత్తుకు ప్రమాదకరం.
నిందితులకు నీరాజనాలు!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



