– విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటాం : కేఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ మోహన్ దాస్
నవతెలంగాణ – మట్టెవాడ
వరంగల్ కాకతీయ మెడికల్ కళాశాల (కేఎంసీ)లో ర్యాగింగ్ భూతం ఇప్పట్లో వదిలేలా లేదు. కాకతీయ మెడికల్ కళాశాల పేరు ప్రఖ్యాతులు ర్యాగింగ్ వల్ల అభాసుపాలవుతున్నా సీనియర్ వైద్య విద్యార్థుల్లో ఎలాంటి మార్పు రాకపోవడం శోచనీయం. ర్యాగింగ్ భూతం వల్ల ఆత్మహత్య చేసుకుని మృతిచెందిన ప్రీతి సంఘటన పూర్తిగా మర్చిపోకముందే మూడు రోజుల కిందట మొదటి సంవత్సరం వైద్య విద్యార్థి ఆస్పత్రి పాలయ్యాడు. వికృత చేష్టలతో సీనియర్ వైద్య విద్యార్థులు ర్యాగింగ్ పేరుతో విచక్షణ రహితంగా కొట్టడంతో ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం చదువుతున్న రాజస్థాన్‌కు చెందిన మనోహర్ తీవ్ర గాయాలపాలై ఎంజీఎం ఆస్పత్రిలో చేరిన సంఘటన ఆలస్యంగా వెలుగు లోకొచ్చింది. దీన్ని బయటకి పొక్కకుండా కాకతీయ మెడికల్ కళాశాల ఉన్నతాధికారులు తీసుకున్న జాగ్రత్తలపై మెడికల్ కళాశాల విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈనెల 14వ తేదీన ఒక సీనియర్ విద్యార్థి పుట్టినరోజు వేడుకల్లో ఆడిపాడిన సీనియర్ విద్యార్థులు, ఆ సమయంలో కళాశాల లైబ్రరీలో అర్ధరాత్రి వరకు చదువుకుని వెళ్తున్న ఫస్ట్ ఇయర్ విద్యార్థి మనోహర్‌ను గమనించి వారి వద్దకు పిలిపించుకున్నారు. సీనియర్ల మాట వినాలని బెదిరిస్తూ మద్యం తాగించి, నృత్యాలు చేపించి వికృత చేష్టలు చేశారు.
అంతేకాకుండా ఫస్ట్ ఇయర్ విద్యార్థిపై 13 మంది విద్యార్థులు దాడికి పాల్పడ్డారు. తీవ్ర గాయా లైన విద్యార్థి ప్రిన్సిపాల్ డాక్టర్ మోహన్‌దాస్‌కు సమాచారాన్ని అందించి మట్టెవాడ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసి వరంగల్ ఎంజీఎంలో చికిత్స కోసం చేరాడు. ఈ విషయం శనివారం రాత్రి బయటికి పొక్కడంతో సోషల్ మీడియాలో చెక్కర్లు కొట్టింది. గేమ్స్‌లో జరిగిన ర్యాగింగ్‌పై రెండు రోజులుగా అంతర్గతంగా విచారణ చేసిన కమిటీకి ర్యాగింగ్ చేసిన మాట వాస్తవమే అనేది నిర్ధారణకు వచ్చినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. 13 మంది విద్యా ర్థులను సంవత్సరం పాటు సస్పెన్షన్‌కు సిఫారసు చేసినట్లు తెలుస్తున్నప్పటికీ అధికారికంగా మెడికల్ కళాశాల నుంచి సమాచారం వెలువడలేదు
చర్యలు తీసుకుంటాం
ర్యాగింగ్ జరిగింది వాస్తవమే. పిల్లల భవిష్యత్తుకు సంబంధించిన సున్నితమైన విషయం కాబట్టి అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాం. ర్యాగింగ్‌తో గాయాలపాలైన మనోహర్‌తో యాంటీ ర్యాగింగ్ కమిటీ శనివారం మాట్లాడి వివరాలు సేకరించింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. శనివారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయి హాస్టల్‌కు చేరుకున్నాడు. ఆరోపణలు ఎదుర్కొంటున్న విద్యార్థులతో 19న(మంగళవారం) కమిటీ సమావేశం అవుతుంది. ర్యాగింగ్ చేసినట్టుగా నిర్ధారణ అయితే కఠిన చర్యలు తీసుకుంటాం.
– మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మోహన్‌దాస్