బీరెన్‌ సర్కార్‌కు షాక్‌..

Shock for Biren Sarkar..– మణిపూర్‌లో కేపీఏ మద్దతు ఉపసంహరణ
– 15 ఇండ్ల దహనం..ఆగని మూకదాడులు
ఇంఫాల్‌: మణిపూర్‌లో సీఎం ఎన్‌ బీరెన్‌సింగ్‌ ప్రభుత్వానికి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఎన్డీయే మిత్రపక్షం కుకీ పీపుల్స్‌ అలయన్స్‌ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంది. ఆదివారం సాయంత్రం ఈ నిర్ణయం తీసుకున్నట్టు పార్టీ ప్రకటించింది. మణిపూర్‌లో గత మే నెల నుంచి ఉద్రిక్తత కొనసాగుతోంది. రాష్ట్రంలో కొనసాగుతున్న హింసాకాండ, మూడు నెలలు గడిచినా సాధారణ స్థితికి రాని నేపథ్యంలో పార్టీ ఈ నిర్ణయం తీసుకున్నది. రాష్ట్ర ప్రభుత్వంలో కుకీ ప్రజా కూటమికి ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు. బీరెన్‌ ప్రభుత్వం నుంచి మద్దతు ఉపసంహరించుకున్న ఇద్దరు కేపీఏ శాసనసభ్యులు కిమ్నియో హాంగ్‌షింగ్‌ (సకుల్‌) , చిన్లుంతంగ్‌ (సింగత్‌).
అసెంబ్లీ సమావేశాలకు నో…
ఆగస్టు 21న అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న తరుణంలో కుకీ పీపుల్స్‌ అలయన్స్‌ ఈ నిర్ణయం తీసుకుంది. మణిపూర్‌ క్యాబినెట్‌ ఆగస్టు 21 నుంచి అసెంబ్లీ సమావేశాన్ని నిర్వహించాలని గవర్నర్‌ అనుసూయా ఉయికేని సిఫారసు చేసింది, అయితే చాలా మంది కుకీ శాసనసభ్యులు సమావేశానికి హాజరయ్యే అవకాశం లేదు.
ఇంతకుముందు, కుకీ పీపుల్స్‌ అలయన్స్‌ ప్రెసిడెంట్‌ టోంగ్‌మాంగ్‌ హౌకిప్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో కొనసాగుతున్న హింస , ప్రత్యేక పరిపాలనకు సంబంధించి కుకీ కమ్యూనిటీ డిమాండ్లపై ఇప్పటివరకు ఎటువంటి పరిష్కారం కాలేదు. దీని కారణంగా కుకీ-జోమి-హమర్‌ శాసనసభ్యులకు అసెంబ్లీ సమావేశం చేరడం సాధ్యం కాదు.
బీజేపీ ప్రభుత్వానికి ఎలాంటి ముప్పు లేనప్పటికీ
కేపీఏ మద్దతు ఉపసంహరించుకున్నప్పటికీ రాష్ట్రంలోని సీఎం ఎన్‌ బీరెన్‌ సింగ్‌, బీజేపీ ప్రభుత్వానికి ఎలాంటి ముప్పు లేదు. అసెంబ్లీలో బీజేపీకి గరిష్టంగా 32 మంది సభ్యులు ఉన్నందున, ఐదుగురు ఎన్‌పీఎఫ్‌ ఎమ్మెల్యేల మద్దతు కూడా ఉంది. ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు కూడా బీజేపీతో ఉన్నారు, అటువంటి పరిస్థితిలో, 60 మంది సభ్యుల అసెంబ్లీలో బీజేపీ (ఎన్డీఏ)కి ఇప్పటికీ 40 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఇది ప్రభుత్వాన్ని మెజారిటీలో ఉంచుతోంది.
మణిపూర్‌లో ఆగని మూక దాడులు
మణిపూర్‌లో హింసాత్మక ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. పశ్చిమ ఇంఫాల్‌ జిల్లా లాంగోల్‌ గేమ్స్‌ గ్రామంలోశనివారం రాత్రి అల్లరి మూక దాడి చేసినట్టు ఆదివారం అధికారులు తెలిపారు. ఈ ఘటనలో 15 నివాసాలు తగలబెట్టగా.. ఒకరు గాయపడ్డారని చెప్పారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు, అల్లరి మూకను చెదరగొట్టేందుకు పోలీసులు పలు రౌండ్లు టియర్‌ గ్యాస్‌ ప్రయోగించాల్సి వచ్చిందని వివరించారు. కాల్పుల్లో 45 ఏండ్ల వ్యక్తి గాయపడ్డాడని, ఎడమ తొడపై బుల్లెట్‌ గాయమైన అతనిని రిమ్స్‌ ఆస్పత్రిలో చేర్చామని తెలిపారు. ప్రస్తుతం అతను ప్రాణాపాయం నుంచి బయటపడ్డారని చెప్పారు. ఇంఫాల్‌ ఈస్ట్‌ జిల్లా చెకాన్‌లో ఓ పెద్ద వాణిజ్య సముదాయానికి దుండగులు నిప్పుపెట్టారు.

Spread the love