బలమైన ప్రతిపక్షం అత్యావశ్యకం

స్వాతంత్య్రం సాధించి 75సంవత్సరాలు, రిపబ్లిక్‌ స్థాపన 74సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మన దేశం ”ఆజాదీ కా అమృత మహౌత్సవ్‌”ను జరుపుకొని ఉండవచ్చు. కానీ దేశంలో ఇంకా చాలా తీవ్రమైన వైరుధ్యాలు ఉన్నాయి. దేశంలో దుర్భరమైన పేదరికం ప్రబలుతుంది. ధనికులు, పేదలకు మధ్య తీవ్రమైన విభజన ఏర్పడింది. సందిగ్ధమైన పరిస్థితులు చట్టబద్ధ పాలనపై ప్రభావం చూపుతాయి. అంతగా బాగాలేని పాలన ప్రజాస్వామ్యం, రిపబ్లిక్‌ల ఉనికికి తీవ్రమైన సవాళ్ళను సృష్టిస్తాయి.
కులం, మతాల ప్రాతిపదికన దేశంలో విభజన ఏర్పడిన ఫలితంగా శత్రుత్వం కాకపోయినా తీవ్ర అపనమ్మకం సృష్టించబడింది. ఒక శక్తివంతమైన ప్రజాస్వామ్యం కోసం, కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ ప్రతిపక్ష పార్టీకి ఒక్క అంగుళం మాత్రం అవకాశం కూడా ఇవ్వడానికి ఇష్టపడడం లేదు. మాటల దాడులు, ప్రతిపక్ష పార్టీల పాలిత రాష్ట్రాల్లో రాజకీయ అస్థిరతతోపాటు రాజకీయ కుట్రలు, అనేక కేంద్ర సంస్థలతో ”దాడులు”, ”తనిఖీలు” చేయించడం ద్వారా కేంద్రం నిరంతరం ప్రతిపక్షాలను లక్ష్యంగా చేసుకుంటుంది.
బలహీనమైన రాజ్యాంగ సంరక్షణా వ్యవస్థ, సంస్థల కారణంగా భారత సర్వోన్నత న్యాయస్థానంతో సహా న్యాయ వ్యవస్థ కూడా ఈ దాడుల్ని నిరోధించడంలో ఆలస్యం చేస్తుంది. ఉదాహరణకు న్యాయ వ్యవస్థ వర్తించే బల నిరూపణ, ప్రతిపక్ష పార్టీల పాలిత ప్రభుత్వాలను కూల్చడానికి, పాలకపార్టీ ప్రయత్నాలకు సహాయపడడానికి మాత్రమే దోహదం చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఇది పూర్తిగా పనికిమాలిన న్యాయ సంబంధిత ఆయుధం. సర్‌ విన్సన్‌ చర్చిల్‌ పేర్కొన్నట్టు… ప్రజాస్వామ్యంలో ”చిన్న వ్యక్తి” యొక్క అధికారాన్ని కాపాడేందుకు ఎన్నుకోబడిన ఎంఎల్‌ఏలు ప్రలోభాలకు గురి కాకుండా నిరోధించే నూతన మార్గాలను న్యాయవ్యవస్థ వెతకాల్సిన అవసరం ఇప్పుడు ఉంది.
కాబట్టి, ‘అమృత్‌’ ఎక్కడుంది? మన రాజ్యాంగ నిర్మాతలు ఒక భిన్నమైన భారతదేశాన్ని ఊహించినట్లు మన రాజ్యాంగ పరిషత్‌ చర్చలు తెలియజేస్తున్నాయి. నవంబర్‌ 5, 1948న హెచ్‌.వీ.కామత్‌ ఇలా పేర్కొన్నాడు… ”రాజ్యం కోసం వ్యక్తి కంటే కూడా వ్యక్తి కోసమే రాజ్యం ఉనికిలో ఉండే ‘రాజ్యం’ కోసం ప్రయత్నం చేయడానికి భారతీయులమైన మనం ముందుకు సాగుతామని నేను ఆశిస్తున్నాను. కనీసం మనం ఈ స్ఫూర్తిని మన స్వంత రాజకీయ సంస్థల్లో తీసుకొని వచ్చే ప్రయత్నం చేద్దాం. మనం ఈ పని చేయకుంటే, నేడు రాజ్యాంగ పరిషత్‌లో చేస్తున్న మన ప్రయత్నం భారతీయ ప్రజల యొక్క రాజకీయ మేథోప్రతిభను ప్రతిబింబించదు. యుగాల నాటి భారతదేశం చనిపోదు లేదా తన చివరి సృజనాత్మక మాటను మాట్లాడలేదు. ఆమె జీవిస్తుంది, తన కోసం, మానవ కుటుంబం కోసం ఎంతో కొంత చేయాలని ఆమెకు ఉంది.”
ఏడు దశాబ్దాలుగా మనం ఈ మార్గంలో పయనించామా? విభజన శాశ్వతంగా ఉండాలని కోరుకునే వారికి హెచ్‌.వీ.కామత్‌ వివరించిన సంఘటనే సమాధానం. 1927లో మద్రాస్‌లో జరిగిన కాంగ్రెస్‌ సమావేశాన్ని గురించి ఇలా చెప్పాడు… ”మీరు భారత రాజ్య కార్యదర్శి లేదా భారత ప్రభుత్వం నుండి ఎలాంటి రక్షణలు కావాలని” ముస్లింలను అడిగారు పండిట్‌ మదన్‌ మోహన్‌ మాలవ్య. మేము ఇక్కడే ఉన్నాం గదా, ఇంకా ఎలాంటి రక్షణలు మీరు కోరుతున్నారు? ఆ ఉపన్యాసం తరువాత, మౌలానా మొహమ్మద్‌ ఆలీ వేదిక మీదకు వెళ్ళి మాలవ్యను కౌగిలించుకొని ఇలా అన్నారు, ”నేను ఏ రక్షణలూ కోరడం లేదు. మేము భారతీయ రాజకీయ సమూహంలో భారతీయులుగా జీవించాలని కోరుకుంటున్నాం. బ్రిటిష్‌ ప్రభుత్వం నుండి మేము ఎలాంటి రక్షణలను కోరుకోవడం లేదు. పండిట్‌ మాలవ్యా నే మాకు మంచి రక్షణ.”
ప్రతిపక్షం, ఒక ‘అవసరమైన చెడు’
రాజ్యాంగంలో చెప్పిన దానికి, రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా పని చేయడంలో రాజ్యాంగబద్దమైన, పరిపాలనా అధికారుల వైఫల్యం, భారతదేశం ఎంత అప్రజాస్వామికమైనదో తెలియజేస్తుంది. రాజ్యాంగ పరిషత్‌లో ప్రతిపక్ష సభ్యుల ప్రాముఖ్యతపై చర్చిస్తూ, మే 20, 1949న జెడ్‌.హెచ్‌.లారీ ఇలా పేర్కొన్నారు…. ”అధికారం కలుషితం చేస్తుంది, సంపూర్ణమైన అధికారం పూర్తిగా కలుషితం చేస్తుందని ప్రతి ఒక్కరికీ తెలుసు. అధికారంలోకి వచ్చే ప్రతీ రాజకీయ పార్టీ తన పట్టును శాశ్వతంగా నిలిపి ఉంచుకునేందుకు ప్రయత్నం చేసే మాట యదార్థం. పాలక పార్టీ ప్రభుత్వం నిరంకుశంగా దిగజారకుండా తనిఖీ చేసేది ఇతర పార్టీల ఉనికి మాత్రమే. పాలక పార్టీ మంత్రివర్గం, పాలక పార్టీ చర్యలపై కఠినమైన నిఘా పెంచడం ద్వారా పార్టీ ప్రభుత్వం నిరంకుశ పాలన వైపు దిగజారిపోకుండా ఈ ఇతర పార్టీలు అడ్డుకుంటాయి. దీనితో పాటు, ప్రభుత్వాన్ని నబలమైన ప్రతిపక్షం అత్యావశ్యకండిపే పార్టీ చర్యలపై స్థిరమైన విమర్శలు లేకుంటే పార్టీ ప్రభుత్వ పనితీరు సరియైన రీతిలో ఉండదు.”
”ఒకవేళ ప్రతిపక్ష నాయకునికి జీతం చెల్లించే విధానం ప్రతిపక్షం సృష్టిని, ఆరోగ్యవంతమైన ప్రతిపక్ష పార్టీ సృష్టిని ప్రోత్సహిస్తే, ప్రతిపక్ష నాయకునికి జీతం చెల్లించాలనే జెడ్‌.హెచ్‌. లారీ సూచనను, భవిష్యత్‌ పార్లమెంట్‌, ఈ దేశానికి బాధ్యత వహించే వారు దృష్టిలో ఉంచుకుంటారు అనే విషయంలో నాకు ఎలాంటి సందేహం లేదని” టీ.టీ.కృష్ణమాచారి అన్నాడు.
”ఒక ఆరోగ్యకరమైన ప్రతిపక్షం కచ్చితంగా ఉండాలి అనే దానిని నేను అంగీకరిస్తాను. ఈ ఆరోగ్యకరమైన ప్రతిపక్షంలోని ముఖ్యమైన వ్యక్తికి మంచి అవకాశం వచ్చింది. ఆయన ప్రతిపక్షాన్ని ఎందుకు ప్రారంభించలేదో నాకు తెలియదు. ఇదంతా చూస్తే నాకు ఆశ్చర్యం వేసింది. కాంగ్రెస్‌ పార్టీ తన మ్యానిఫెస్టోలో పేర్కొన్న అంశాలకు మించి దేశ సంక్షేమాన్ని మెరుగుపరిచే విధంగా ఉన్నాయా వారి చర్యలు?” అని ఎం.ఏ.అయ్యంగార్‌ అన్నారు. ”ప్రతిపక్షం ఒక అవసరమైన చెడు అనీ, అధికారంలో ఉన్న పార్టీకి పూర్తి స్థాయిలో పని ఇవ్వడమే ప్రతిపక్షం యొక్క విధి” అని బిశ్వనాథ్‌ దాస్‌ అభిప్రాయపడ్డారు.
స్వాతంత్య్రం సాధించిన తరువాత దాదాపు నాలుగు దశాబ్దాల పాటు ఈ దేశంలో ఆధిపత్యం చెలాయించిన కాంగ్రెస్‌ పార్టీ, ఆరోగ్యవంతమైన ప్రతిపక్షాన్ని అడ్డుకోవడం ద్వారా తన అధికారాన్ని శాశ్వతంగా నిలబెట్టుకోవాలనే ప్రయత్నం చేసింది. ప్రతిపక్ష పార్టీలు పాలిస్తున్న రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూల్చడమే కాంగ్రెస్‌ పార్టీ ప్రధానమైన ఆయుధంగా ఉండేది.అయినా, నేడు కాంగ్రెస్‌ పార్టీ, ఇతర ప్రతిపక్ష పార్టీలు దేశంలో ప్రస్తుత ప్రజాస్వామ్యం పరిస్థితిపై ఫిర్యాదులు చేసే పరిస్థితికి నెట్టబడ్డాయి.
కానీ వారంతా సమిష్టిగా ఆరోగ్యకరమైన ఒకే ప్రతిపక్షంగా ఉన్నారా? వారి మాటలు, చేతలు అన్నీ దిగ్భ్రాంతిని కలిగిస్తున్నాయి. వారి చర్యలు ఈ దేశ సంక్షేమాన్ని మెరుగు పరిచేందుకు ఉద్దేశించినవేనా? వారు ఒకే గొంతుకతో మాట్లాడక పోవడం అనేది పాలక పార్టీ ప్రతీ ఎన్నికలో విజయం సాధించేందుకు మార్గం సుగమం చేస్తుంది.
మన రాజ్యాంగాన్ని సంరక్షించడంలో దేశ పౌరుల కర్తవ్యాల పై అవగాహన కల్పించడం ఎలా అన్నదే మన దేశం ముందున్న సవాల్‌. స్వేచ్ఛను అసంబద్ధం చేస్తున్న రాజకీయ వర్గం ముందు ఇప్పుడు ప్రజలు ప్రేక్షకపాత్రను పోషిస్తున్నారు. ఇజ్రాయిల్‌లో న్యాయ వ్యవస్థను బలహీనపరచడానికి ప్రధాని, బెంజమిన్‌ నేతన్యాహూ తయారుచేసిన ప్రతిపాదనలను అక్కడి ప్రజలు తీవ్రంగా ప్రతిఘటిస్తున్నారు. కానీ నేడు మన దేశంలో మనకు ఏముంది?
ఒక బలమైన, ఆరోగ్యవంతమైన ప్రతిపక్షాన్ని కలిగి ఉండడంలో పొందిన వైఫల్యం, అధికార పార్టీ నిరంకుశ ధోరణితో తన స్థానాన్ని శాశ్వతం చేసుకోవడానికి కారణభూతమవుతుంది. భారత సుప్రీంకోర్టుపై మంత్రులు, ఇతరులు నిరంతరం చేస్తున్న దాడులు, ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యం పట్ల అంతగా గౌరవం చూపడం లేదని రుజువు చేస్తున్నాయి. ప్రస్తుత పాలక పార్టీ, ఒకప్పుడు రామ్‌నారాయణ్‌ సింగ్‌ చెప్పిన ఈ మాటలను గుర్తుంచుకోవాలి… ”ఈ దేశంలో మనం ఇప్పుడే స్వేచ్ఛను సాధించుకున్నాం. మన స్వంత పార్టీ అంటే కాంగ్రెస్‌ పార్టీకి ప్రతిపక్షం అనేది లేదు. ఇక్కడ పరిస్థితులు ఎలా మారుతున్నాయో నేను చూస్తూనే ఉన్నాను. కాబట్టి మన చర్యల్ని విమర్శించి, సమీక్షించే ఒక బలమైన ప్రతిపక్షం ఉండాలని నేను అభిప్రాయ పడుతున్నాను. ప్రతిపక్షం అంటే ఇష్టం లేని, నిత్యం అధికారంలోనే ఉండాలని కోరుకునే ప్రభుత్వం దేశభక్తియుత ప్రభుత్వం కాదు, అది దేశద్రోహపూరిత ప్రభుత్వం అవుతుంది.” అధికారంలో ఉన్న పార్టీ, ప్రతిపక్ష పార్టీ రాజ్యాంగం పట్ల వాటి విధులను, బాధ్యతలను గుర్తించి, రాజ్యాంగ నిర్మాతల ఆశలను, ఆశయాలను గౌరవించి, భారతదేశ ప్రజల సంక్షేమం కోసం పని చేస్తాయని ఆశిద్దాం.
(”ది హిందూ” సౌజన్యంతో)
అనువాదం: బోడపట్ల రవీందర్‌, 9848412451
– దుష్యంత్‌ దవే

Spread the love