కేసీఆర్, జీవన్ సమావేశంలో హరీష్ డుమ్మా ..
సభలో సీనియర్ నేతలకు దక్కని ప్రాధాన్యత
చర్చనీయాంశంగా అంతర్గత విభేదాలు
ఫ్లెక్సీలు, వేదికపై కనిపించని ఫోటోలు
జీవన్ రెడ్డి ఐరన్ లెగ్ అంటున్న సంజయ్
నవతెలంగాణ – జగిత్యాల టౌన్
జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. అధికార కాంగ్రెస్ ను ఢీకొట్టేందుకు పార్టీ కేడర్ ను సిద్ధం చేస్తున్న తరుణంలో, సొంత పార్టీలోని బీసీ సామాజిక వర్గ సీనియర్ నేతలకు జరుగుతున్న ‘అవమానం’ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఉద్యమ కాలం నుండి పార్టీని నమ్ముకున్న నేతలను ఉద్దేశపూర్వకంగానే పక్కన పెడుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
తుల ఉమ, రాజేశం గౌడ్ పేర్లు..
ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిషత్ మాజీ చైర్ పర్సన్ గా, పార్టీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలిగా పని చేసిన తుల ఉమకు తాజా సభలో తీవ్ర అన్యాయం జరిగినట్లు ఆమె అనుచరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పట్టణంలో ఏర్పాటు చేసిన భారీ ఫ్లెక్సీలలో కానీ, సభా వేదికపై ఉన్న ఫొటోల లో కానీ ఆమెకు కనీస స్థానం కల్పించకపోవడం గమనార్హం. అదేవిధంగా, ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పనిచేసిన గౌడ సామాజిక వర్గ సీనియర్ నేత రాజేశం గౌడ్ పరిస్థితి కూడా ఇలాగే ఉందని సమాచారం. కేసీఆర్ తో కలిసి నాడు ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసిన ఇలాంటి నేతలను ఇప్పుడు విస్మరించడం వెనుక స్థానిక నాయకత్వపు హస్తం ఉందనే ఆరోపణలు వస్తున్నాయి.
ముఖ్య నేతలు హాజరవుతున్న సభలో, ఒక బీసీ మహిళా నాయకురాలిని, అనుభవం ఉన్న సీనియర్లను కావాలనే విస్మరిస్తున్నారా ? లేక పార్టీలోని కొందరు వ్యక్తులు తమ ఆధిపత్యాన్ని నిరూపించుకునేందుకు ఇలా చేస్తున్నారా అనే కోణంలో చర్చ సాగుతోంది. ఇటీవల కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి నీ తుల ఉమ దంపతులు కలవడం కూడా ఈ పరిణామాలకు ఒక కారణమై ఉండవచ్చని కొందరు అభిప్రాయపడుతున్నారు.
పార్టీకి నష్టం తప్పదా.?
జిల్లాలో బలమైన ఓటు బ్యాంకు ఉన్న బీసీ సామాజిక వర్గానికి చెందిన నేతలను ఇలా బహిరంగంగా అవమానించడం వల్ల పార్టీకి తీవ్ర నష్టం చేకూరుతుందని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. తక్షణమే పార్టీ అధిష్టానం జోక్యం చేసుకుని ఈ విభేదాలను పరిష్కరించకుంటే, భవిష్యత్తులో కేడర్ లో అసహనం మరింత పెరిగే అవకాశం ఉందని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి.
జీవన్ రెడ్డి ఐరన్ లెగ్..సంజయ్ కుమార్
జీవన్ రెడ్డి ఐరన్ లెగ్ అని, జీవన్ రెడ్డి వల్ల ఎన్టీఆర్, తక్కువ వ్యవధిలో నాదెండ్ల భాస్కర్ పదవి కోల్పోయారని అన్నారు. 2009 లో రెండవసారి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ స్వర్గస్తులయ్యారన్నారు. అందువల్ల జీవన్ రెడ్డిని ఐరన్ లెగ్ గా భావిస్తారన్నారు. జీవన్ రెడ్డి చేరికను హరీష్ రావు వ్యతిరేకిస్తున్నారని, కెసిఆర్ జీవన్ రెడ్డి కలయిక రోజు హరీష్ రావు కెసిఆర్ ఫామ్ హౌస్ కు రాలేరని, ఈరోజు సభకు కూడా హరీష్ రావు అందుబాటులో లేకుండా ఢిల్లీ వెళ్లారని జగిత్యాల ఎమ్మెల్యే అన్నారు.
బీఆర్ఎస్ లో అర్థబలం ఉన్న నాయకులకు కొదువ లేదు. సాదాసీదాగా, అవినీతి అక్రమాలకు దూరంగా ఉండే జీవన్ రెడ్డి భవిష్యత్తులో బిఆర్ఎస్ లో ఏ మేరకు మనగాగలడో వేచి చూడాల్సిందే.



