– అధిష్టాన నిర్ణయానికి కట్టుబడి పార్టీ బలోపేతానికి కృషి చేయాలి
– ఏఐసీసీ పరిశీలకులు, ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు
నవతెలంగాణ – జుక్కల్
సాంగ్లీ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడి (డీసీసీ ప్రెసిడెంట్) ఎంపిక ప్రక్రియలో భాగంగా జిల్లాలోని ముఖ్య నాయకులు, కార్యకర్తలతో సంఘటన్ సృజన్ అభియాన్ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ఏఐసీసీ అబ్జర్వర్, జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీ కార్యకర్తలు, మండల, బ్లాక్ స్థాయి అధ్యక్షుల అభీష్టం మేరకే జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి నియామకం జరుగుతుందని అన్నారు.
సంఘటన్ సృజన్ అభియాన్ లో భాగంగా కార్యకర్తల అభిప్రాయాలు తీసుకుని జిల్లా అధ్యక్షులను ఎంపిక చేయడం శుభపరిణామన్నారు. ఈ ప్రక్రియ ద్వారా పార్టీ కోసం కష్టపడే నిబద్ధత కలిగిన నాయకుడిని జిల్లా అధ్యక్షుడిగా ఎన్నుకునే వెసలుబాటు కలుగుతుందన్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల బ్లాక్, మండల, గ్రామ స్థాయి నాయకుల అభిప్రాయాలు తీసుకుని ఎంపిక చేసే అధ్యక్షుడికి మనమంతా సంపూర్ణంగా సహకరించాల్సిన అవసరం ఉందన్నారు. కాంగ్రెస్ అధిష్టానం జిల్లా అధ్యక్షుడిగా ఎవరిని నియమించినా అందరూ స్వాగతిస్తూ కలిసి పనిచేసి పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.


