ఏపీలో ఘోర రైలు ప్రమాదం

నవతెలంగాణ-విజయనగరం: ఒడిశాలోని బాలాసోర్‌ రైలు ప్రమాదాన్ని మరువక ముందే ఆంధ్రప్రదేశ్‌లో మరో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. విజయనగరం జిల్లాలో ఆదివారం రాత్రి కొత్త వలస మండలం కంటకాపల్లి వద్ద విశాఖ-రాయగడ ప్యాసింజర్‌ రైలును పలాస ఎక్స్‌ప్రెస్‌ రైలు ఢీకొట్టింది. ఓవర్‌ హెడ్‌ కేబుల్‌ తెగిపోవడంతో ఆగిపోయిన విశాఖ-రాయగడ ప్యాసింజర్‌ రైలును వేగంగా వచ్చిన పలాస ఎక్స్‌ప్రెస్‌ ఢీకొట్టడంతో రాయగడ ప్యాసింజర్‌లోని మూడు బోగీలు పట్టాలు తప్పి బోల్తాపడ్డాయి. ప్రమాదంలో ఆరుగురు మరణించారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

క్షతగాత్రులను అంబులెన్స్లో విజయనగరం, విశాఖపట్నం ఆస్పత్రులకు తరలించారు. రైల్వే అధికారుల, ప్రయాణికులు తెలిపిన వివరాల ప్రకారం.. రాత్రి 7.10 గంటల సమయంలో విశాఖ నుంచి పలాస వెళ్తున్న ప్రత్యేక ప్యాసింజర్ రైలు కొత్తవలస మండలం అలమండ-కంటకాపల్లి వద్ద సిగ్నల్ కోసం పట్టాలపై ఆగి ఉంది. అదే సమయంలో దాని వెనకాలే వస్తున్న విశాఖ-రాయగడ రైలు.. ప్యాసింజర్ రైలును కొట్టింది. ప్రమాదంపై రైల్వే బోర్డు గ్రూపులో డీఆర్ఎం సౌరబ్ ప్రసాద్ సమాచారం ఇచ్చారు. ఎన్డీఆర్ఎఫ్, రెవెన్యూ, పోలీసు సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయీ. ప్రమాద విషయం తెలుసుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వెంటనే సహాయచర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఘటన పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తక్షణ చర్యలకు ఆదేశించారు. మంత్రి బొత్స సత్యనారాయణ, ఆ జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.

Spread the love