జగన్‌ ఇంటి నిర్మాణాల కూల్చివేతలో ట్విస్ట్‌

జగన్‌ ఇంటి నిర్మాణాల కూల్చివేతలో ట్విస్ట్‌– ఖైరతాబాద్‌ జోనల్‌ కమిషనర్‌పై బదిలీ వేటు
– జీహెచ్‌ఎంసీ ఇన్‌చార్జి కమిషనర్‌ ఉత్తర్వులు జారీ
– ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వకుండా కూల్చివేతలు
నవతెలంగాణ-సిటీబ్యూరో
హైదరాబాద్‌ లోటస్‌ పాండ్‌ వద్ద ఏపీ మాజీ సీఎం జగన్‌ ఇంటి ముందు గల అక్రమ నిర్మాణాల కూల్చివేత అంశం సర్వత్రా చర్చకు దారి తీసింది. బల్దియా అధికారులు కూల్చివేయడం చర్చానీయాం శమైంది. దీనిపై జీహెచ్‌ఎంసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. జీహెచ్‌ఎంసీ ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వకుండా వైఎస్‌ జగన్‌ ఇంటి ముందు నిర్మాణాలు, షెడ్ల కూల్చివేతలకు ఆదేశాలు జారీ చేసిన ఖైరతాబాద్‌ జోనల్‌ కమిషనర్‌ హేమంత్‌పై బదిలీ వేటు పడింది. సాధారణ పరిపాలన విభాగానికి అటాచ్‌ చేస్తూ జీహెచ్‌ఎంసీ ఇన్‌చార్జి కమిషనర్‌ ఆమ్రపాలి ఆదేశాలు జారీ చేశారు. ఏపీ సీఎంగా ఉన్న ఐదేండ్ల సమయంలో వైఎస్‌ జగన్‌.. తాడేపల్లిలో ఉంటున్నారు. దాంతో హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని లోటస్‌ పాండ్‌లో ఉన్న జగన్‌ ఇంటికి ఏపీ పోలీసులు భద్రత కల్పించారు. ఆ ఇంటి ముందు విశాలమైన ఫుట్‌పాత్‌ ఉంటుంది. పర్మిషన్‌ లేకుండా ఫుట్‌పాత్‌ స్థలాన్ని ఆక్రమించి సెక్యూరిటీ రూములు నిర్మించారంటూ స్థానికులు పలుమార్లు గ్రేటర్‌ అధికారులకు ఫిర్యాదు చేశారు. రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోందని, తరచూ ట్రాఫిక్‌ జామ్‌ సమస్యలు తలెత్తుతున్నాయనే కారణంతో వాటిని తొలగి స్తామని శుక్రవారం సాయంత్రం జీహెచ్‌ఎంసీ అధికారులు నోటీసులు జారీ చేసి శనివారం కూల్చివేశారు. కాగా, ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వకుండా జగన్‌ ఇంటి ముందు కూల్చివేతలు చేపట్టారని ఖైరతాబాద్‌ జోనల్‌ కమిషనర్‌ భోర్కడేను జీహెచ్‌ఎంసీ ఇన్‌చార్జి కమిషనర్‌ అమ్రాపాలి ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే అతన్ని బదిలీచేసి జీఐడీకి రిపోర్ట్‌ చేయాలని ఆదేశించారు. కాగా, ఈ ఘటనంతా జగన్‌ ఇంటి పక్కనే నివాసం ఉండే ఓ మంత్రి ఆదేశాలతోనే జరిగిం దని తెలుస్తోంది. ఉన్నతాధికారులకు, ప్రభుత్వానికి సమాచారం లేకుండా మంత్రి మాట పట్టుకుని కూల్చివేతలకు పాల్పడినందుకు హేమంత్‌ వేటుకు గురయ్యారని సమాచారం.

Spread the love