
నవతెలంగాణ – వేములవాడ
దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామి వారి ఆలయం లో ఇంటి దొంగలు సరుకులను దాటవేస్తూ సంఘటన వెలుగులోకి వచ్చింది, ప్రసాదం తయారీ విభాగం లో పనిచేసే ఔట్ సోర్సింగ్ ఉద్యోగి గత కొద్ది రోజులుగా ప్రసాదం తయారీ లో ఉపయోగించే కాజు, బాదాం కిస్మిస్ ఇతర పదార్థాలు బయట వ్యక్తులకు విక్రయిస్తున్నాడానే సమాచారం మేరకు నిఘా పెట్టిన అధికారులు శుక్రవారం అట్టి ఉద్యోగిని గుర్తించినట్టు సమాచారం. ఈ విషయం పై ప్రసాదం తయారీ విభాగం ఏఈ ఓ ప్రతాప నవీన్ ను సంప్రదించగా అట్టి విషయం నిజమేనని ప్రసాదం తయారీ లో ఉపయోగించే వస్తువులు బయటి వ్యక్తులకు విక్రయిస్తున్న ఉద్యోగి సంతోష్ గా గుర్తించామని ఉన్నతాధికారుల సూచన మేరకు చర్యలు తీసుకొంటామని తెలిపారు. గత నెల 30న లడ్డు తయారీ కేంద్రంలో సూపర్డెంట్ గా విధులు నిర్వహిస్తున్న రాజశేఖర్ పదవి విరమణ చేసి నేటికి నాలుగు రోజులు గడుస్తున్న నేటి వరకు లడ్డు తయారీ కేంద్రంలో పర్యవేక్షకుని, ఆలయ అధికారులు నియమించకపోవడంలో అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సరుకులు భద్రపరుచు గోదాములలో పర్యవేక్షణలో లోపాలు ఈ సంఘటనతో బహిర్గతమవుతున్నాయని అధికారులపై విమర్శలు వెలివెత్తుతున్నాయి. పర్యవేక్షకుని నియమించి ఇలాంటి అవకతవకలు జరగకుండా తగు జాగ్రత్తలు చూడాలని భక్తులు కోరుతున్నారు.