గగన తీరం చేరిన యుద్ధ నౌక

పదాలను పదాలతో రాపిడి చేస్తూ,
గొంతులో నిప్పుల్ని పుట్టించడమెలాగో
అతడికి బాగా తెలుసు…
ప్రజల మధ్య పాటై ప్రవహిస్తూ,
అన్యాయాన్ని ఉప్పెనలా ముంచెత్తడం
అతడికెంతో సులువు…
చిరుత గజ్జెలు కట్టుకుని చిందేసినట్టు,
వేల సింహాలు వేదికనెక్కి గర్జించినట్టు,
ఒళ్ళు మరిచి తాండవించడం…
అతడికి ”విప్లవం నేర్పిన విద్య”
”ఎరుపు”ను చూసి రాజ్యం ఆంబోతై
రంకెలేసినప్పుడల్లా,
చేతికర్రను అదిలించి, నియంత్రించడం
అతడికి మాత్రమే తెలిసిన తర్కం…
అతడి డప్పు మోత నెత్తురుకు ఉడుకెత్తడం నేర్పించి,
అతడి అందె శబ్దం, ఏలికల కాళ్ళకింద ప్రకంపనలు సృష్టించేది…
పాటలోనే బ్రతికి, పాటను బ్రతికించి,
పాడుతూనే అస్తమించిన ఎర్రెర్రని కిరణమా…
”పొడుస్తున్న పొద్దువోలె” వేల హృదయాల్లో ఉదయిస్తూనో,
”సిరిమల్లె చెట్ల నీడల్లో” కుములుతున్న లచ్చుమమ్మల్ని ఓదారుస్తూనో,
జనం గొంతులో పాటవై శ్వాసిస్తూనే ఉంటావు….
గగన తీరం చేరిన ఓ యుద్ధ నౌకా….
నీ జానపదం, జన చైతన్య రథం,
బిగిసిన నీ మెడ నరం,
పలికించెను ప్రజా స్వరం…

ఇప్పుడు….
కోట్ల గుండెలు, ముక్త కంఠమై నీకై అర్పిస్తున్న ఒకే నినాదం ”లాల్‌ నీల్‌ సలాం….”
– జాబేర్‌ పాషా, 00968 78531638,

Spread the love