రోడ్డుపై వరద నీటిలో కూర్చుని మహిళ నిరసన

– ఏండ్లుగా రోడ్డుకు మరమ్మతులు చేపట్టడం లేదని ఆవేదన
– వాహనదారుల అవస్థలు
నవతెలంగాణ- నాగోల్‌
హైదరాబాద్‌ నగరంలో భారీ వర్షమైనా.. చిన్న వర్షమైనా రహదారులు జలమయమవుతాయి. దీంతో వాహనదారులకు చుక్కలే. రోడ్లు బాగాలేని ప్రాంతాల్లో అయితే, వాహనదారులతో పాటు ప్రజలకూ నరకమే. ఏండ్ల కిందట వేసిన రోడ్డు వాహనాల రద్దీకి గుంతలు పడినా కొన్నిచోట్ల మరమ్మతులు చేయరు. అధికారులు, ప్రజాప్రతినిధులూ పట్టించుకోరు.. వర్షాలు వచ్చినప్పుడు ఆ గుంతలు నీటితో నిండి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతుంటాయి. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌ నగరానికి చెందిన ఓ మహిళ సమస్యను అధికారుల దష్టికి తీసుకెళ్లేందుకు వినూత్న రీతిలో నిరసన చేపట్టింది. రోడ్డుపై నీటి గుంటలో కూర్చుని నిరసన తెలిపింది. ఈ ఘటన గురువారం హైదరాబాద్‌ నాగోలు పరిధిలో జరిగింది. నాగోల్‌-బండ్లగూడ రహదారిలోని ఆనందనగర్‌ చౌరస్తాలో రోడ్డుపై ఏర్పడిన గుంత బుధవారం రాత్రి కురిసిన వర్షానికి నీటితో నిండిపోయింది. దాంతో హయత్‌నగర్‌ మండలం కుంట్లూరు గ్రామానికి చెందిన నిహారిక గురువారం నాగోల్‌ వైపు వెళ్తూ దాన్ని గమనించింది. రోడ్డు మరమ్మతులు చేపట్టడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ అప్పటికప్పుడు నీటి గుంటలో కూర్చుని నిరసన తెలిపింది. రోడ్డుపై గుంతలు ఏర్పడి వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నా పట్టించుకునే వారు లేరంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఆనంద్‌నగర్‌ వద్ద రోడ్లు అధ్వానంగా తయారైందని, వర్షపు నీరు గుంతల్లోనే ఉండటంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోందని తెలిపింది. రోడ్డుకు మరమ్మతులు చేస్తామని జీహెచ్‌ఎంసీ అధికారులు స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్‌ చేసింది. సుమారు గంటపాటు ఆమె నీటి గుంటలో బైటాయించి నిరసన తెలిపింది. సమాచారం తెలుసుకున్న నాగోల్‌ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఆమెతో మాట్లాడి నచ్చజెప్పి పంపించారు.
వాహనాల రద్దీ పెరగడంతో రేడియల్‌ రోడ్డు ధ్వంసం
నాగోల్‌ నుంచి బండ్లగూడ, ఆనంద్‌నగర్‌, మత్తుగూడ మీదుగా గౌరెల్లి వరకు ఓఆర్‌ఆర్‌కు చేరుకునేందుకు ఏడేండ్ల కిందట రేడియల్‌ రోడ్డు నిర్మించారు. దాంతో ఓఆర్‌ఆర్‌కు చేరుకునేందుకు ఈ రహదారిగుండా వందల సంఖ్యలో వాహనాల రాకపోకలు సాగిస్తుంటాయి. రద్దీ పెరగడంతో బండ్లగూడ చౌరస్తా, ఆనంద్‌ నగర్‌ చౌరస్తాలతోపాటు వివిధ ప్రాంతాల్లో రోడ్లు ధ్వంసమై అక్కడక్కడ గుంతలు పడి కంకర తేలింది. సంవత్సరాలుగా రేడియల్‌ రోడ్డు మరమ్మతులకు నోచుకోకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Spread the love