మిల్లర్ల నుంచి క్వింటాకు రూ.216 వసూలు నిజం కాదా?

– సమాధానం చెప్పలేకనే మొహం చాటేసిన మంత్రి ఉత్తమ్‌
– జగ్గారెడ్డికేం తెలుసు.. మంత్రి ఎప్పుడొచ్చినా చర్చకు సిద్ధం
– బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి
– ఉత్తమ్‌ వైట్‌పేపర్‌ లాంటోడు.. ఆయనపై ఇంక్‌ చల్లకండి : జగ్గారెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
ధాన్యం కొనుగోళ్లలో మిల్లర్ల నుంచి క్వింటాకు రూ.216 అదనంగా వసూలు చేసింది నిజం కాదా? అని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ప్రశ్నించారు. సివిల్‌ సప్లరు శాఖలో జరిగిన అవినీతి, అక్రమాలపై సమాధానం చెప్పడానికి చేతగాకనే మంత్రి మొహం చాటేశారనీ, అధికారులతో స్టేట్మెంట్లు ఇప్పిస్తున్నారని విమర్శించారు. ప్రజాసమస్యలపై ప్రతిపక్ష నేతగా ప్రశ్నిస్తే పోలీసులకు ఫిర్యాదు చేయించి కేసులు పెట్టిస్తారా? ప్రజాపాలన అంటే ఇదేనా? అని నిలదీశారు. తాను ఎత్తిచూపిన లోపాలను ఎలా సరిచేసుకోవాలనే దానిపై ఆలోచించుకోవాలని సూచించారు. తన దగ్గర అన్ని ఆధారాలున్నాయనీ, దీనిపై మంత్రి ఉత్తమ్‌ ఎప్పుడొచ్చినా చర్చకు సిద్ధమేనని మరోమారు సవాల్‌ విసిరారు. సివిల్‌ సప్లరు శాఖ అవినీతిపై రిటైర్డ్‌ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. జగ్గారెడ్డికి ఆ శాఖపై ఏం అవగాహన ఉందని ప్రశ్నించారు. తాను బాధ్యతగల ప్రజాప్రతినిధిగా బయటపెట్టానన్నారు. జనవరి 25 ఒక్కరోజే టెండర్ల కమిటీ వేయడం, గైడ్‌లైన్స్‌ రూపొందించడం, గ్లోబల్‌ టెండర్ల ప్రకటన చేయడం ఎలా సాధ్యమని ప్రశ్నించారు. పంజాబ్‌, హర్యానా రాష్ట్రాల నుంచి ముందుకొచ్చిన కాంట్రాక్టర్లను కొందరు అధికారులు బెదిరించారని ఆరోపించారు. ఎన్నికల కోడ్‌ అమలులో ఉండగానే ఏప్రిల్‌ 18న హైదరాబాద్‌లోని జలసౌధలో రైస్‌మిల్లర్లతో ఒప్పందాలు చేసుకున్నారని విమర్శించారు. క్వింటాకు రూ.216ను మిల్లర్ల నుంచి వసూలు చేసింది నిజం కాదా? మిల్లర్లు బియ్యం ఇస్తామంటే డబ్బులే ఇవ్వాలని బెదిరించింది వాస్తవం కాదా? స్థాయికి మించి అదనపు ధాన్యాన్ని మిల్లర్లకు ఇస్తే ఎలా భరిస్తారు? జలసౌధలో మీరు చేసిన అరాచకాలు బయటపెట్టాలా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. కాంట్రాక్టర్‌ మే 23లోపు ధాన్యాన్ని పూర్తిగా లిఫ్ట్‌ చేయకపోతే బ్లాక్‌ లిస్టులో పెడతామన్నారు కదా ఎందుకు అలా చేయలేదని నిలదీశారు. క్వింటాకు రూ.2259 చొప్పున లక్షా 59 వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం అమ్మేశారని తెలిపారు. ఇప్పుడు మధ్యాహ్న భోజనం, హాస్టల్‌ విద్యార్థుల కోసం అంటూ మళ్ళీ ఎందుకు కొంటున్నారని ప్రశ్నించారు. క్వింటాకు రూ.5700 చొప్పున 22 లక్షల క్వింటాళ్ల బియ్యాన్ని కొనుగోలు చేశారని చెప్పారు. 10శాతం నూక ఉన్న బియ్యం బహిరంగ మార్కెట్‌ లో రూ.38 రూపాయలకే దొరుకుతున్నదన్నారు. రూ.2259కి ప్రభుత్వం అమ్మేసి ఇప్పుడు రూ.5700 చొప్పున ఎందుకు కొంటున్నదని ప్రశ్నించారు. సివిల్‌ సప్లరు శాఖలో ఇలా జరిగిన ఎన్నో అవినీతి, అక్రమాలపై తమ దగ్గర స్పష్టమైన ఆధారాలున్నాయని చెప్పారు. కాలేజీలను, కోట్ల ఆస్తులను వదులుకుని ప్రజా సేవ కోసం రాజకీయాల్లో వచ్చాననీ, కేసులకు భయపడే వ్యక్తిని కాదని చెప్పారు.

ఉత్తమ్‌ వైట్‌పేపర్‌ లాంటోడు : జగ్గారెడ్డి
భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి వైట్‌ పేపర్‌ లాంటోడనీ, ఆయనపై ఇంక్‌ చల్లొద్దంటూ బీజేపీ ఫ్లోర్‌ లీడర్‌ ఏలేటి మహేశ్వరరెడ్డికి టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు జగ్గారెడ్డి హితవు పలికారు. యూ ట్యాక్సీ అంటూ ఆరోపించిన ఏలేటి… మీ వద్ద ఆధారాలుంటే మీడియాకు విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. లేనిది ఉన్నట్టు బట్టకాల్చి మీద వేయొద్దంటూ ఆయన హెచ్చరించారు. గురువారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో టీపీసీసీ అధికార ప్రతినిధులు డాక్టర్‌ లింగం యాదవ్‌, చనగాని దయాకర్‌గౌడ్‌తో కలిసి జగ్గారెడ్డి విలేకర్లతో మాట్లాడారు. ఉత్తమ్‌పై ఆయనకు ఎందుకు కోపమొచ్చిందో అర్థం కాలేదని చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీ ప్రజల పక్షపాతి, రైతు పక్షపాతి అన్నారు. తమ ప్రభుత్వం ఏర్పడ్డాక వర్షాలు పడి ధాన్యం తడిసిపోయిందన్నారు. తడిసిన ప్రతీ గింజా ప్రభుత్వం కొంటుందని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. రైతులు, రైస్‌ మిల్లర్లు ఇబ్బంది పడకుండా, నష్టపోకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. అధికార పార్టీపై ప్రతిపక్షాలు బురద జల్లడం సహజమేనన్నారు. ఐదేండ్లు రేవంత్‌రెడ్డే ముఖ్యమంత్రిగా ఉంటారని స్పష్టం చేశారు. ఆయన్ను ఎవరూ డిస్టర్బ్‌ చేయబోరని ఈ సందర్భంగా జగ్గారెడ్డి తెలిపారు.

Spread the love