ఓట్ల తారుమారుకు అవకాశం

– 120 పౌర సమాజ సంస్థల హెచ్చరిక
న్యూఢిల్లీ: లెక్కింపు రోజున ఓట్లను తారుమారు చేసే అవకాశం ఉన్నదని 120 పౌర సమాజ సంస్థలు హెచ్చరించాయి. ఎన్నికల కమిషన్‌ను ఎలా జవాబుదారీ చేయాలనే విషయంపై పలువురు హక్కుల కార్యకర్తలు, ప్రభుత్వ మాజీ ఉన్నతోద్యోగులు, నిపుణులు కర్నాటకలో ఆరు గంటల పాటు కూలంకషంగా చర్చించారు. న్యూఢిల్లీలోనూ, దేశంలోని ఇతర ప్రాంతాల్లోనూ ఇలాంటి సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. విధి నిర్వహణలో ఈసీ తరచుగా విఫలమవుతున్న నేపథ్యంలో ఈ సమావేశం అవసరమైందని రాజకీయ ఆర్థికవేత్త పరకాల ప్రభాకర్‌ తెలిపారు. ‘ఇప్పుడు మాకు ఓ పరిమితమైన లక్ష్యం ఉంది. ప్రజలు బ్యాలెట్‌ ద్వారా తమ తీర్పును వెలువరించాలి. అది ఏదైనా సరే. అలా జరగకపోతే ప్రజల పౌర హక్కుల పరిరక్షణ కోసం పౌర సమాజం దానిని సవాలు చేయాల్సి వస్తుంది’ అని పరకాల చెప్పారు. ఎన్నికల కమిషన్‌ సభ్యుల నియామక ప్రక్రియ నుండి భారత ప్రధాన న్యాయమూర్తిని తప్పించడం ఈసీ నిస్పాక్షికతపై తీవ్రమైన అనుమానాలు రేకెత్తిస్తోందని అన్నారు. తాము ఈసీని నిందించడం లేదని, అయితే తమ అను మానాలు నిరాధారమైన వని ఆ సంస్థ తేల్చాల్సి ఉంటుందని చెప్పారు. కానీ ఈసీ చర్యలు తమ అనుమానాలను మరింత పెంచుతున్నాయని అన్నారు. ప్రధాని, ఆయన పార్టీ విద్వేష ప్రసంగాలు చేస్తున్నా, ప్రవర్తనా నియమావళిని తరచూ ఉల్లంఘిస్తున్నా దానిని అడ్డుకోవడంలో లేదా కనీసం నిరుత్సాహపరచడంలో ఈసీ విఫలమైందని ఆరోపించారు.
దేశంలో ఇప్పుడు జరుగుతున్నంతగా గతంలో ఎన్నడూ ఎన్నికలు అనుమానంతో, అపోహలతో జరగలేదని రిటైర్డ్‌ ఐఎఎస్‌ అధికారి ఎంజీ దేవసహాయం చెప్పారు. ప్రజాస్వామ్యం కావాలా నియంతృత్వం కావాలా అనేదే ఇప్పుడు ప్రజల ముందు ఉన్న ప్రశ్న అని ఆయన అన్నారు. ఓట్ల లెక్కింపు సమయంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని హక్కుల కార్యకర్త తీస్తా సెతల్వాద్‌ సూచించారు. ఉత్తరప్రదేశ్‌లోని సంబల్‌, అమేథీలో ఓటర్లపై లాఠీఛార్జీ చేశారని ‘యునైటెడ్‌ అగనెస్ట్‌ హేట్‌’ సంస్థకు చెందిన నదీమ్‌ ఖాన్‌ తెలిపారు.

Spread the love