నోటీసు చూసి షాకయ్యా!

– పిలవకపోతే ఎలా ప్రచారం చేస్తా? : మాజీ మంత్రి, బీజేపీ ఎంపీ జయంత్‌ సిన్హా
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
ఎన్నికల ప్రచారంలో ఎందుకు పాల్గొనలేదంటూ పార్టీ ఇచ్చిన షోకాజ్‌ నోటీసుపై బీజేపీ సీనియర్‌ నేత, హజారీబాగ్‌ ఎంపీ జయంత్‌ సిన్హా స్పందించారు. నోటీసును చూసి ఆశ్చర్యపోయానన్నారు. ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో ఎందుకు ఓటు వేయలేదని, ఎన్నికల ప్రచారంలో ఎందుకు పాల్గొనలేదో వివరణ అడుగుతూ బీజేపీ జార్ఖండ్‌ ప్రధాన కార్యదర్శి ఆదిత్య సాహు షోకాజ్‌ నోటీసు జారీ చేశారన్నారు. వ్యక్తిగత కారణాల రీత్యా తాను విదేశాల్లో ఉండటంతో పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు హక్కు ఉపయోగించుకున్నట్టు ఆయన తన సమాధానంలో పేర్కొన్నారు. షోకాజ్‌ నోటీసుపై రెండు పేజీల వివరణతో కూడిన లేఖను జయంత్‌ సిన్హా విడుదల చేశారు. షోకాజ్‌ నోటీసు చూడగానే తాను షాకయ్యానని, ఆ లేఖ మీడియాలో ప్రత్యక్షమవ్వడంతో మరింత ఆశ్చర్యానికి గురయ్యానని సిన్హా పేర్కొన్నారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో పోటీచేయబోనని తాను ఈ ఏడాది మార్చి 2న ప్రకటించిన విషయాన్ని లేఖలో పొందుపర్చారు. బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డాతో మాట్లాడిన తరువాత ఈ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.
పిలవకపోతే ఎలా ప్రచారం చేస్తా?
హజారీబాగ్‌ అభ్యర్థిగా పార్టీ మనీష్‌ జైస్వాల్‌ను ప్రకటించిందని, మార్చి8న ఆయనకు తాను అభినందనలు తెలపడంతో ఆయన అభ్యర్థిత్వానికి మద్దతు తెలిపానన్నారు. తాను ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలని పార్టీ భావించి ఉంటే తనను సంప్రదించి ఉండేవారని, జార్ఖండ్‌కు చెందిన పార్టీ ఎంపీ, ఎమ్మెల్యే, పార్టీ ముఖ్య నాయకులు ఎవరూ తనను సంప్రదించలేదని సిన్హా లేఖలో పేర్కొన్నారు. పార్టీ బహిరంగ సభలు, సంస్థాగత సమావేశాలకు తనను పిలవలేదన్నారు. లోక్‌సభ స్పీకర్‌కు సమాచారం ఇచ్చిన తరువాత వ్యక్తిగత పనుల కారణంగా మే10న విదేశాలకు వెళ్లానని జయంత్‌ సిన్హా స్పష్టం చేశారు. పార్టీ తనను ఎలాంటి కార్యక్రమాలకు పిలవకపోవడంతో తన అవసరం లేదనిపించిందన్నారు. విదేశాలకు వెళ్లే ముందు తాను పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు హక్కు వినియోగించుకున్నట్లు తెలిపారు. తాను ఓటు వేయలేదని ఆరోపించడం సరికాదన్నారు. పార్టీలో తన బాధ్యతలను ఎంతో నిబద్ధతతో, నిజాయితీతో నిర్వర్తించానని, అలాగే తన పనితీరుకు ఎన్నోసార్లు ప్రశంసలు లభించిన విషయాన్ని లేఖలో సిన్హా గుర్తుచేశారు.
నిరాశకు లోనయ్యా
తనకు పార్టీ ఇచ్చిన షోకాజ్‌ నోటీసుపై మీడియాలో ప్రచారం కావడం నిరాశ పర్చిందన్నారు. ఈ లేఖను బహిరంగ పర్చడం తన దృష్టిలో సరికాదన్నారు. ఇటువంటి వైఖరి అంకితభావంతో పనిచేసే పార్టీ కార్యకర్తలను నిరాశ పరచడమే అవుతుందన్నారు. పార్టీ కోసం విధేయతతో పనిచేసే తనను కావాలని టార్గెట్‌ చేసినట్లు కనిపిస్తోందని సిన్హా తన వివరణలో పేర్కొన్నారు.

Spread the love