కేసీఆర్ తోనే తెలంగాణ పల్లెల్లో అసాధారణ అభివృద్ది

– కాళేశ్వరం నీళ్లతో ఊర చెరువులు కళకళ లాడుతున్నాయి
– కేసీఆర్ సంపద సృష్టించి పేదలకు పంచుతున్నాడు
– కేసీఆర్ వి గట్టి చేతలు..కాంగ్రెస్ వి ఉట్టి మాటలు
– ఓట్ల కోసం మాటలు చెప్పే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలి
– రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ  మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి 
నవతెలంగాణ కమ్మర్ పల్లి
కేసిఆర్ తోనే తెలంగాణ పల్లెల్లో అసాధారణ అభివృద్ది సాధ్యమయ్యిందని… కాళేశ్వరం నీళ్లతో ఊర చెరువులు కళకళ లాడుతున్నాయని రాష్ట్ర రోడ్లు భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. శనివారం వేల్పూర్ మండలం అంక్సాపూర్ గ్రామంలో రూ.13 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ది పనులకు శంకుస్ధాపనలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ….అంక్సాపూర్ గ్రామ అభివృద్ది చూస్తుంటే మనసుకు ఎంతో ఆనందం కలుగుతున్నదని సంతోషం వ్యక్తం చేశారు. తాను చిన్నప్పుడు సైకిల్ మీద తిరిగిన మట్టి రోడ్డు ఎమ్మెల్యే అయ్యాక డాంబర్ రోడ్డు అయ్యిందని, ఇప్పుడు డబుల్ రోడ్డు అవుతుందని పేర్కొన్నారు. అంక్సాపూర్ సట్టి తీర్దాలకు ఎడ్ల కచ్చురం మీద వచ్చి మూడు రోజుల పాటు అక్కడే తన మేనత్త ఇంట్లో ఉండేవాడినని అప్పటి జ్ఞాపకాలు నెమరేసుకున్నారు. ఒకప్పటి అంక్సాపూర్ ను ఇప్పటి అంక్సాపూర్ గ్రామాన్ని చూస్తుంటే ఎంతో సంతృప్తి కలుగుతుందని, ఇంతకు మించిన ఆత్మ తృప్తి మరోటి ఉండదని అమితానందం వ్యక్తం చేశారు. ఒక్క ఈ గ్రామంలోనే రూ.39 కోట్లతో అభివృద్ది చేశామని 750 మందికి రూ.11 కోట్లల పెన్షన్లు ఇస్తున్నామని తెలిపారు. సొంత జాగ ఉండి ఇండ్లు లేని అర్హులైన పేదలకు విడతల వారీగా, నిరంతరాయంగా గృహ లక్ష్మి కింద రూ.3లక్షలు ఇస్తామని వెల్లడించారు. కేసిఆర్ తోనే తెలంగాణ పల్లెల్లో అసాధారణ అభివృద్ది సాధ్యమయ్యిందని,కాళేశ్వరం నీళ్లతో ఊర చెరువులు కళకళ లాడుతున్నాయని అన్నారు.అభివృద్ధి, పాడి పంటలు, కుల వృత్తులకు చేయూతతో గ్రామాలు సంబురంగా మారాయన్నారు.కేసిఆర్ సంపద సృష్టించి పేదలకు పంచుతున్నాడన్నారు. రూ.36 వేల కోట్ల రైతు రుణమాఫి ఘనత ఒక్క కేసిఆర్ కే దక్కుతుందని, దేశంలో ఏ ముఖ్యమంత్రి ఇంత సాహసం చేయలేదని అన్నారు. రైతు బంధు లాంటి పథకంతో రైతులకు ఆర్ధిక భరోసా ఇయ్యాలన్న కనీస ఆలోచన ఏ నాయకుడు చేయలేదన్నారు. కానీ ఇప్పుడు మేము కేసిఆర్ కంటే ఎక్కువ చేస్తామని అర్రాసు పాట తీరుగా పథకాలు ప్రకటిస్తున్నారని కాంగ్రెస్ తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసిఆర్ వి గట్టి చేతలు, కాంగ్రెస్ వి ఉట్టి మాటలన్నారు.రామ – రావణ యుద్ధంలో మిగిలిన రాక్షసులు కొంత మంది మనిషి రూపంలో గ్రామాల్లో ఇంకా తిరుగుతున్నారని ఎద్దేవా చేసారు. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల కథ కూడా ఎంపి అర్వింద్ బాండ్ పేపర్ లాంటి ఉత్తి మాటే అని విమర్శించారు. ఓట్ల కోసం మాటలు చెప్పే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని,గోస పడ్డ జీవితాల్లో వెలుగులు నింపిన కేసిఆర్ కు తోడుగా నిలబడాలని మంత్రి వేముల పిలుపునిచ్చారు.
అభివృద్ది పనులకు శంకుస్థాపనలు….
అంక్సాపూర్ గ్రామంలో రూ.13 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ది పనులకు మంత్రి ప్రశాంత్ రెడ్డి శంకుస్ధాపనలు చేశారు.రూ.25 లక్షలతో  సంత మల్లన్న దేవాలయం షెడ్, రూ.2 కోట్ల 20 లక్షలతో  సంతమల్లన్న దేవాలయం గిరి ప్రదక్షిణ రోడ్డు, రూ. 8 కోట్ల 10 లక్షలతో  అంక్సాపూర్ నుండి వేల్పూర్ డబుల్ లైన్ రోడ్డుకు, రూ.40 లక్షలతో అంక్సాపూర్ నుండి వడ్డెర కాలనీ వయా సంత మల్లన్న రోడ్డు, రూ. 20 లక్షలతో హెల్త్ సబ్ సెంటర్ పనులకు, రూ. 15 లక్షలతో  పోచమ్మ దేవాలయం నిర్మాణ పనులకు, రూ. 30 లక్షలతో  హనుమాన్ దేవాలయం నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.అంతకుముందు మంత్రికి గ్రామస్థులు  డప్పు చప్పుళ్లతో, టపాసులు కాలుస్తూ అఖండ స్వాగతం పలికారు. సంత మల్లన్న దేవాలయాన్ని సందర్శించి మల్లన్నకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తమ ఇంటి వేల్పు అయిన సంత మల్లన్నకు మంత్రి ప్రశాంత్ రెడ్డి మొక్కులు చెల్లించారు. ఈ కార్యక్రమంలో డిసిసిబి వైస్ చైర్మన్ రమేష్ రెడ్డి, బిఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కోటపాటి నర్సింహ నాయుడు, స్థానిక ప్రజాప్రతినిధులు, ఆర్డీవో వినోద్ కుమార్, ఏసిపి జగదీష్ చందర్, పలువురు మండల బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Spread the love