ఎస్‌ఏయూ అధ్యాపకుల సస్పెన్షన్‌ రద్దు చేయండి

– విదేశాంగ మంత్రులకు విద్యావేత్తల వినతి
న్యూఢిల్లీ : సౌత్‌ ఆసియన్‌ యూనివర్సిటీ (ఎస్‌ఏయూ)కి చెందిన నలుగురు అధ్యాపకులపై విధించిన సస్పెన్షన్‌ను రద్దు చేయాలని ఐదు వందల మందికి పైగా విద్యావేత్తలు దక్షిణాసియా దేశాల విదేశాంగ మంత్రులకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు వారు మంత్రులకు లేఖలు రాశారు. వీరిలో ఇర్ఫాన్‌ హబీబ్‌, ప్రభాత్‌ పట్నాయక్‌, అకీల్‌ బిల్‌గ్రామీ, జ్ఞాన్‌ ప్రకాశ్‌, అడ్రే ట్రస్కే వంటి ప్రముఖులు ఉన్నారు. ఫెలోషిప్‌ స్టైఫండ్‌ పెంపుదలపై విద్యార్థులకు, అధికారులకు మధ్య నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించాల్సిందిగా కోరినందుకు అధ్యాపకులపై సస్పెన్షన్‌ వేటు వేశారు. సమ్మె చేస్తున్న విద్యార్థులను చెదరగొట్టేందుకు ఢిల్లీ పోలీసులను యూనివర్సిటీ క్యాంపస్‌లోకి అనుమతించడాన్ని కూడా ఉపాధ్యాయులు తప్పుపట్టారు. ప్రవర్తన సరిగా లేని కారణంగా వారిని సస్పెండ్‌ చేశామని అధికారులు చెబుతున్నప్పటికీ దానిపై సస్పెన్షన్‌ ఆదేశాలలో ఎలాంటి వివరణ ఇవ్వలేదు. తమకు ఇస్తున్న నెలవారీ స్టైఫండ్‌ను గత సంవత్సరం తగ్గించడాన్ని విద్యార్థులు వ్యతిరేకించారు. పలు కమిటీలలో తమకు సహేతుకమైన ప్రాతినిధ్యం కల్పించాలని డిమాండ్‌ చేశారు. కాగా డిమాండ్ల సాధన కోసం సమ్మె చేస్తున్న విద్యార్థుల పట్ల అధికారులు ప్రవర్తించిన తీరును ప్రశ్నిస్తూ అధ్యాపకులు ఈ-మెయిల్స్‌లో సమాచారాన్ని పంపారు. దీనిపై ఆగ్రహించిన అధికారులు వారిని సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

Spread the love