– 30 దాకా క్యాడర్‌ను కాపాడుకోవడమే వారికి పెద్ద తలనొప్పి
– గల్లీ లీడర్ల రాజకీయం
– రోజుకో పార్టీ మార్పుతో అభ్యర్థుల్లో ఆందోళన
నవతెలంగాణ-సిటీబ్యూరో
సొంత పార్టీ నాయకులు, కార్యకర్తలే ఎమ్మెల్యే అభ్యర్థులకు చుక్కలు చూపిస్తున్నారు. ప్రత్యర్థి పార్టీ నాయకులతో టచ్‌లో ఉంటూ ఎప్పుడు జంప్ అంటారో చెప్పలేని పరిస్థితి ఉంది. అభ్యర్ధుల ఎదుట పైకి జై కొడుతూనే సమయం చూసి ‘రాజకీయం’ చేస్తున్నారు. గల్లీ లీడర్ల నుంచి జిల్లా స్థాయి వరకు ప్రధాన పార్టీల్లో చేరికలు సాగుతున్నాయి. దీంతో అలాంటి నాయకులను ఎమ్మెల్యే అభ్యర్థులు తమ వెంటే ప్రచారంలో అట్టిపెట్టుకుని తిరుగుతున్నారు. స్థానికంగా ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ నాయకులు, కౌన్సిలర్లు, ఎంపీపీలు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్‌లు, మాజీ ప్రజాప్రతినిధులు, మున్సిపల్ చైర్మెన్లు, కొర్పారేషన్ మేయర్లు ఇలా పార్టీకి బలంగా ఉన్న నాయకత్వాన్ని వదులుకోలేక ఆపసోపాలు పడుతున్నారు.
కుల సంఘాలు, ఆయా ప్రాంతాల్లో పట్టున్న నాయకులు జారిపోతే ఇబ్బంది పడాల్సి వస్తుందని ఎప్పటికప్పుడూ నిఘా పెడుతున్నారు. ఈ నెల 30వ తేదీన జరిగే పోలింగ్ వరకు నాయకులు జారిపోకుండా చూసుకోవడమే అభ్యర్థులకు పెద్ద సవాల్‌గా మారింది. ప్రతి రోజూ ఏ నాయకుడు ఏ పార్టీ వైపు చూస్తున్నాడు.. ఎక్కడ అసంతృప్తి ఉందనేది ఆరా తీస్తున్నారు.
గోడ దూకేస్తున్నారు
ఎమ్మెల్యేలు, అభ్యర్థులు పార్టీలో తాము కోరిన పనులు చేయకపోవడం, ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో ప్రధాన పార్టీల్లో ఉన్న క్యాడర్ అదును చూసి గోడ దూకేస్తున్నారు. ఎన్నికల గాలి, ప్రలోభాలకు గురవుతూ తమకు నచ్చిన పార్టీలోకి వెళ్లిపోతున్నారు. వారిని నిలువరించేందుకు అభ్యర్థులు రాయబారాలు, మంతనాలు సాగిస్తున్నారు. బుజ్జగింపులతో చల్లబడితే సరే.. లేదంటే చివరికి తగిన విధంగా చూసుకుంటామని హామీలు ఇస్తున్నారు. పార్టీ మారే వారి సంఖ్య పెరిగితే రాజకీయంగా బలహీన పడతామేమోనని ఎమ్మెల్యే అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలనే కోణంలోనూ కొందరు నాయకులు బెట్టు చేస్తున్నారని తెలిసింది.
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో అన్ని పార్టీల్లోనూ ద్వితీయ శ్రేణి నాయకులకే డిమాండ్ ఉంది. మరో 14 రోజుల వరకు ఇలాంటి కింది స్థాయి నాయకత్వాన్ని కాపాడుకుంటేనే గట్టెక్కుతామని ఎమ్మెల్యే అభ్యర్థులు భావిస్తున్నారు.