నేటినుంచి గ్రూప్‌-1 దరఖాస్తుల స్వీకరణ

– వాటి సమర్పణకు తుదిగడువు మార్చి 14
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో గ్రూప్‌-1 పోస్టులకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు స్వీకరణ ప్రక్రియ శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. వాటి సమర్పణకు వచ్చేనెల 14వ తేదీ వరకు తుది గడువు ఉన్నది. 563 గ్రూప్‌-1 పోస్టుల భర్తీకి ఈనెల 19న తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) నోటిఫికేషన్‌ను జారీ చేసిన విషయం తెలిసిందే. 503 గ్రూప్‌-1 పోస్టుల భర్తీకి 2022, ఏప్రిల్‌ 26న ఇచ్చిన నోటిఫికేషన్‌ను రద్దు చేసిన సంగతి తెలిసిందే. మే/జూన్‌లో గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్షలు, సెప్టెంబర్‌/అక్టోబర్‌లో మెయిన్స్‌ రాతపరీక్షల ను నిర్వహించనున్నట్టు టీఎస్‌పీఎస్సీ ప్రకటించింది. పాత నోటిఫికేషన్‌లో దరఖాస్తు చేసిన అభ్యర్థులు మళ్లీ దరఖాస్తు చేయాల్సిందేననీ, అయితే ఫీజు మాత్రం మినహాయింపునిస్తున్నట్టు స్పష్టం చేసింది. యూనిఫామ్‌ సర్వీసులైన డీఎస్పీ, అసిస్టెంట్‌ ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ (ఏఈఎస్‌), ఆర్డీవో పోస్టులకు కనిష్ట, గరిష్ట వయోపరిమితి 21 నుంచి 35 ఏండ్లు ఉంటాయనీ, మిగిలిన పోస్టులకు 18 నుంచి 46 ఏండ్ల వరకు ఉంటాయని వివరించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులతోపాటు ప్రభుత్వ ఉద్యోగులకు ఐదేండ్లు, వికలాంగులకు పదేండ్లు, మాజీ సైనికులు, ఎన్‌సీసీ ఇన్‌స్ట్రక్టర్లకు మూడేండ్లపాటు సడలింపు ఉంటుందని స్పష్టం చేసింది.

Spread the love