టీఎస్‌పీఎస్‌సీపై చర్యలు తీసుకోవాలి

Action should be taken against TSPSC– రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో సడక్‌ బంద్‌
– ఖమ్మం, భువనగిరిలో నేతల అరెస్ట్‌
నవతెలంగాణ -విలేకరులు
టీఎస్‌పీఎస్‌సీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా శనివారం రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో సడక్‌ బంద్‌ నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ నిర్వాకం వల్ల గ్రూప్‌ పరీక్షలు రద్దు కావడంతో నిరుద్యోగులు తీవ్రంగా నష్టపోయారని నాయకులు తెలిపారు. వారి ఆశలపై ప్రభుత్వం నీళ్లు చల్లిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆత్మహత్యలకు కారణమవుతోందన్నారు. ఖమ్మం నగరంలోని బైపాస్‌ రోడ్డుపై అఖిల పక్ష పార్టీల నేతలు బైటాయించి వాహన రాకపోకలను అడ్డుకున్నారు. దీంతో పోలీసులు ఆందోళనకారులను అరెస్టు చేసి టూ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. అరెస్టు అయిన వారిలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు ఎర్ర శ్రీకాంత్‌, సీపీఐ రాష్ట్ర కార్యదర్గి సభ్యులు బాగం హేమంతరావు, ప్రజాపంథా నాయకులు ఆవుల వెంకటేశ్వర్లు, కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్‌ ఉన్నారు. తిరుమలాయపాలెంలో ఖమ్మం – వరంగల్‌ హైవేపై సీపీఐ(ఎం), కాంగ్రెస్‌ నాయకులు బైటాయించి నిరసన తెలిపారు.
టీఎస్‌పీఎస్‌సీ ప్రస్తుత బోర్డు చైర్మెన్‌ సహా సభ్యులను తొలగించాలని సీపీఐ(ఎం) సూర్యాపేట జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. జిల్లా కేంద్రంలో హైటెక్‌ బస్టాండ్‌ ఎదురుగా అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై (సడక్‌ బంద్‌) రాస్తారోకో నిర్వహించారు యాదాద్రిభువనగిరి జిల్లా కేంద్రంలో సడక్‌ బంద్‌ నిర్వహించారు. ఈ క్రమంలో ముందునే పలువురు నాయకులను పోలీసులు అరెస్టు చేసి వివిధ పోలీస్‌ స్టేషన్లకు తరలించారు. ఈ అరెస్టులను సీపీఐ, సీపీఐ ఎంఎల్‌, కాంగ్రెస్‌ పార్టీలో తీవ్రంగా ఖండించాయి. సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఏశాల అశోక్‌, పట్టణ కార్యదర్శి పుట్ట రమేష్‌, ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా అధ్యక్షులు వస్తువుల అభిలాష్‌ తదితరులను అరెస్టు చేశారు.

Spread the love