అదానీ వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాలి

Adani case should be thoroughly investigated– దేశంలో పెరుగుతున్న ఆశ్రిత పెట్టుబడిదారీ విధానం
– ప్రభుత్వ పెద్దల మద్దతుతోనే అదానీ స్వైరవిహారం
– కేంద్ర ప్రభుత్వ పాలసీలతో పేదలపై భారం
– ‘అదానీ కుంభకోణం – ప్రధాని మౌనం’ వెబినార్‌లో ప్రొ.అరుణ్‌ కుమార్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
అదానీ అడ్డదారి వ్యాపారాలపై సమగ్ర విచారణ జరిగితేనే అసలు రంగు బైటపడుతుందని జెఎన్‌యు రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ అరుణ్‌ కుమార్‌ అన్నారు. ఇటీవల వెలుగులోకి వచ్చిన అదానీ కుంభకోణాలపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ సరిపోదని ఆయన చెప్పారు. కేంద్రంలోని ప్రభుత్వ పెద్దల మద్దతుతోనే దేశం లోపల, వెలుపల అదానీ కంపెనీ అడ్డగోలుగా వ్యవహరిస్తుందని, ప్రభుత్వరంగ ఆస్తులను కారుచౌకగా కొల్లగొడుతుందని పేర్కొన్నారు. ‘అదానీ కుంభకోణం – ప్రధాని మౌనం’ అంశంపై సుందరయ్య విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన వెబినార్‌లో ప్రొ. అరుణ్‌ కుమార్‌ మాట్లాడారు.
బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత అదానీ కంపెనీ వ్యాపారం బొగ్గు, విద్యుత్‌, గ్యాస్‌, రోడ్లు, విమానాశ్రయాలకు భారీగా విస్తరించిందనీ, ప్రభుత్వ కాంట్రాక్టుల్లో అత్యధికం అదానీకే దక్కుతున్నాయని అరుణ్‌ కుమార్‌ తెలిపారు. హిడెన్‌ బర్గ్‌ నివేదిక బహిర్గతమైన తర్వాత అదానీ షేర్లు భారీగా పడిపోయిన సమయంలో కూడా ఆ కంపెనీ పబ్లిక్‌ ఆఫర్‌ ప్రకటిస్తే ఊహించనివిధంగా స్పందన వచ్చిందన్నారు. దీని వెనక ఏ చీకటి శక్తులున్నాయో నిగ్గు తేల్చడంలో నిఘా సంస్థలు సమర్ధవంతంగా పనిచేయలేదని ఆరోపించారు. చిన్న కంపెనీలపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తీసుకొచ్చి వాటిని అదానీ కంపెనీకి కారుచౌకగా విక్రయించేలా చీకటి వ్యాపారం జరుగుతోందని, దాని వెనక ప్రభుత్వ పెద్దల హస్తం ఉన్నదని బలమైన వాదనలు వినిపిస్తున్నాయని చెప్పారు. నల్లధనం విదేశాలకు తరలించి దాన్ని తిరిగి మనదేశానికి తీసుకొచ్చి విదేశీ పెట్టుబడిగా అదానీ కంపెనీలు చూపుతున్నాయని పేర్కొన్నారు. అదానీ షేర్ల విలువ కృత్రిమ పెరుగుదలలో భారీ స్థాయిలో అక్రమాలు జరిగాయనీ, దానికి బ్యాంకులను కూడా వాడుకుంటున్నారని వివరించారు. రాజకీయ నేతలు, పెట్టుబడిదారుల అపవిత్ర కూటమితో ఆశ్రిత పెట్టుబడి దారీ విధానం దేశంలో పేట్రేగిపోతోందనీ, పెట్టుబడిదారి వర్గాలకు అనుకూలంగా ప్రభుత్వ పాలసీలను రూపొందిస్తున్నారని అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ఏ దేశానికి వెళ్లినా ఆదేశాల నుంచి ఆస్తులు కారుచౌకగా అదానీకి దక్కుతున్నాయనీ, ఆస్ట్రేలియా, ఇజ్రాయేలు, శ్రీలంక, ఇండోనేషియా దేశాల నుంచి అదానీకి దక్కిన కాంట్రాక్టుల్లో అదే నిజమైందని చెప్పారు. అదానీ పోర్టులో వేల కోట్ల విలువైన డ్రగ్స్‌ దొరికితే దానిపై విచారణ సంస్థలు నిగ్గుతేల్చలేదన్నారు. కేంద్ర పెద్దలతో ఉన్న దగ్గర సంబంధాల వల్లే అదానీ అక్రమ వ్యాపారాల్లో స్వైరవిహారం చేస్తున్నారని విమర్శించారు. హిడెన్‌బర్గ్‌ నివేదిక బయటకు రావడంతో అదానీ షేర్లు రూ. 2700 పడిపోతే..ఆసమయంలోనే ఆ కంపెనీ ఎఫ్‌బివొ( పబ్లిక్‌ ఆఫర్‌) ఓపెన్‌ చేస్తే జిందాల్‌, ఎయిర్‌టెల్‌, ఇతర మార్కెట్‌ పెద్దలు ఆ షేర్లను రూ. 3200 కొనుగోలు చేసి అదానీకి రూ.20వేల కోట్లు కూడబెట్టారని తెలిపారు. అదానీ ఎఫ్‌బివొ జయప్రదం అయిందని చెప్పుకునేందుకే ఇండియా కార్పోరేట్‌ కంపెనీలపై ఒత్తిడి తీసుకొచ్చారన్నారు. ఇదంతా జరిగిన తర్వాత కూడా అదానీకి మేలు చేసేలా ఎప్‌బివొ రద్దు చేశారని గుర్తు చేశారు. అదానీ అక్రమ వ్యవహారాలు దేశ ఆర్ధిక వ్యవస్థ మొత్తంపై ప్రభావం చూపుతున్నా నిఘా, విచారణ సంస్థలు ఎందుకు మౌనంగా ఉంటున్నాయో ఆలోచన చేయాలన్నారు. దేశానికి విదేశీ పెట్టుబడులు వచ్చే పరిస్థితి లేదు. కేంద్ర విధానాలు పేదలపై పెను భారం మోపుతున్నాయనీ, పెట్టుడిదారుల ఆస్తులు పెరగడానికే అవి దోహద పడుతున్నాయని వివరించారు. దేశ ప్రజల సంపదనంతా కార్పొరేట్లకు కట్టబెట్టే ప్రయత్నం వేగంగా జరుగుతోందనీ, దీనివల్ల చిన్న మధ్యతరగతి సన్నకారు కంపెనీలు దివాలాతీసి పెద్ద కంపెనీలు బలపడుతున్నాయన్నారు. ఆన్‌లైన్‌ కొనుగోళ్ల వల్ల చిన్న వ్యాపారులు దెబ్బతింటున్నారని చెప్పారు. అసంఘటిత రంగాన్ని ప్రభుత్వాలు పట్టించుకోవడంలేదనీ, కేంద్రం చెప్పే ఆర్ధిక లెక్కలన్నీ కల్పితాలేనని ప్రొ.అరుణ్‌ కుమార్‌ వెల్లడించారు. ఎస్‌వికె మేనేజింగ్‌ కమిటీ కార్యదర్శి ఎస్‌. వినరు కుమార్‌ వెబినార్‌ను సమన్వయం చేశారు.

Spread the love