Sunday, May 10, 2026
E-PAPER
Homeరాష్ట్రీయం'నిమ్స్‌'లో అధునాతన ఎండోస్కోపిక్‌ స్పైన్‌ శస్త్రచికిత్స

‘నిమ్స్‌’లో అధునాతన ఎండోస్కోపిక్‌ స్పైన్‌ శస్త్రచికిత్స

- Advertisement -

తీవ్ర కాలినొప్పి, క్రమంగా కాళ్ల బలహీనతతో బాధపడుతున్న రోగికి ఉపశమనం
వైద్య బృందానికి డైరెక్టర్‌ బీరప్ప అభినందనలు
నవతెలంగాణ-సిటీబ్యూరో

హైదరాబాద్‌ పంజాగుట్ట నిజాం ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (నిమ్స్‌)లో అధునాతన శస్త్ర చికిత్స చేశారు. కరీంనగర్‌ జిల్లా లింగాన్నపేట గ్రామానికి చెందిన పిట్ల నవీన్‌కు మినిమల్లీ ఇన్వేసివ్‌ ఎండోస్కోపిక్‌ స్పైన్‌ శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. తీవ్ర కాలి నొప్పి, క్రమంగా కాళ్ల బలహీనతతో బాధపడుతున్న నవీన్‌కు ఈ చికిత్స ద్వారా ఉపశమనం లభించింది. వైద్య పరీక్షల అనంతరం రోగి వెన్నెముకలో కీలక ప్రాంతంలో ట్యూమర్‌ ఉన్నట్టు వైద్యులు గుర్తించారు. అనంతరం ఆరోగ్యశ్రీ, ముఖ్యమంత్రి సహాయ నిధి సహకారంతో బరుపోర్టల్‌ ఎండోస్కోపిక్‌ టెక్నిక్‌ ద్వారా శస్త్రచికిత్స నిర్వహించారు. కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో సుమారు రూ.5 లక్షల వరకు ఖర్చవుతుంది. ఈ శస్త్రచికిత్సలో బీహెచ్‌ఈఎల్‌-జీఈ సంస్థ, రోటరీ క్లబ్‌ సహకారంతో నిమ్స్‌కు అందించిన అత్యాధునిక బరుపోర్టల్‌ ఎండోస్కోపిక్‌ స్పైనల్‌ సిస్టమ్‌ను వినియోగించారు. శస్త్రచికిత్స విజయవంతమై రోగికి వెంటనే ఉపశమనం లభించింది. కాలి నొప్పి తగ్గడంతోపాటు కాళ్ల బలం కూడా మెరుగుపడింది.
మినిమల్లీ ఇన్వేసివ్‌ ఎండోస్కోపిక్‌ విధానంలో చికిత్సలు : డైరెక్టర్‌ బీరప్ప
ఆధునిక ఎండోస్కోపిక్‌ సిస్టమ్‌ ద్వారా ఆర్థికంగా వెనుకబడిన రోగులకు అత్యాధునిక వెన్నెముక చికిత్సలను అందిస్తున్నామని నిమ్స్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ నగరి బీరప్ప తెలిపారు. సాధారణ డిస్క్‌ ప్రోలాప్స్‌ శస్త్రచికిత్సల నుంచి క్లిష్టమైన సర్వైకల్‌, డార్సల్‌ స్పైన్‌ ఆపరేషన్ల వరకు అనేక చికిత్సలు ఇప్పుడు నిమ్స్‌లో మినిమల్లీ ఇన్వేసివ్‌ ఎండోస్కోపిక్‌ విధానంలో నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేసిన వైద్యులు ఎర్రగుంట తిరుమల్‌, మురళీకృష్ణ, ఉమామహేశ్వర్‌ బృందాన్ని, న్యూరోసర్జరీ విభాగాధిపతి డాక్టర్‌ వంశీకృష్ణ ఎర్రమ్నేని, సీనియర్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ సుచందను డైరెక్టర్‌ అభినందించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -