కేంద్రవిత్తన చట్టంలో మార్పులు తేవాలి : మంత్రి తుమ్మలకు రైతు కమిషన్ నివేదిక
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో పంటల మార్పిడిని ప్రోత్సహించాలని రాష్ట్ర రైతు కమిషన్ కోరింది. శనివారం హైదరాబాద్‌లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో పంటల మార్పిడి ప్రాధాన్యతపై రైతు కమిషన్ రూపొందించిన నివేదికకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు అందజేశారు. కార్యక్రమంలో రైతు కమిషన్ చైర్మెన్ కోదండరెడ్డి సభ్యులు ఉన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం రైతులు ప్రధానంగా వరి, పత్తి పంటలపై ఆధారపడుతున్న నేపథ్యంలో, ఉద్యాన పంటలు, పప్పుధాన్యాలు, చిరుధాన్యాలు, నూనె గింజల పంటల సాగును ప్రోత్సహించే దిశగా ప్రభుత్వం చేపట్టాల్సిన అంశాలను నివేదించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో ఖరీఫ్, రబీ సీజన్లలో కలిపి సుమారు 1.30 కోట్ల ఎకరాల్లో వరి సాగు జరుగుతోందని చెప్పారు. వచ్చే మూడు సంవత్సరాల్లో అందులో కనీసం 13 లక్షల ఎకరాలను ఉద్యాన పంటలు, పప్పుధాన్యాలు, చిరుధాన్యాలు, ఆయిల్‌సీడ్స్ సాగుకు మళ్లించేలా కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని వ్యవసాయ, ఉద్యానశాఖ అధికారులను ఆదేశిం చారు. పంట మార్పిడిలో మార్కెట్లో డిమాండ్ ఉండే పంటలు సూచిస్తే రైతులకు గిట్టుబాటు ధర లభించే అవకాశం వుందన్నారు.
అటువంటి పంటలు, దేశ ప్రాంత అవసరాలు దష్టిలో ఉంచుకుని ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు. అదేవిధంగా ఈ సంవత్సరంలో 45 వేల ఎకరాలలో కొత్తగా ఆయిల్ పామ్ సాగును తీసుకురాగా.. వచ్చే సంవత్సరంలో లక్ష ఎకరాలలో ఆయిల్ పామ్ సాగు చేసేలా ప్రణాళిక తయారుచేయడంతోపాటు దాన్ని సాధించాలని అన్నారు. కేంద్రం తయారుచేసిన విత్తనచట్టంలో కూడా మార్పులు చేయాల్సిన అవసరం ఉందని మంత్రి అభిప్రాయపడ్డారు. ఈ చట్టంలో నకిలీ విత్తనాల వలన రైతులు నష్టపోతే, రైతులకు చెల్లించాల్సిన పరిహారం విషయంలో ఎలాంటి స్పష్టత లేదన్నారు. విత్తన నియంత్రణలో కేంద్రంతో పాటు రాష్ట్రాలకు కూడా సముచిత అధికారాలు కల్పించాలని డిమాండ్ చేశారు. మే నెలాఖరు వరకు రాష్ట్రంలో తగినంత యూరియా బఫర్ నిల్వలు సిద్ధంగా ఉంచుకోవాలని వ్యవసాయశాఖ అధికారులను మంత్రి ఆదేశించారు. రామగుండం ఎరువుల కర్మాగారంలో ఉత్పత్తి అయ్యే యూరియాలో తెలంగాణ రాష్ట్రానికి 90 శాతం కేటాయించి, సరఫరా చేయాలని ఈ సందర్భంగా కేంద్రాన్ని మంత్రి డిమాండ్ చేశారు.ఈ సమావేశంలో సీడ్ కార్పొరేషన్ చైర్మెన్ అన్వేష్ రెడ్డి, వ్యవసాయశాఖ సెక్రటరీ సురేంద్ర మోహన్, వ్యవసాయశాఖ డైరెక్టర్ గోపి, ఉద్యానశాఖ డైరెక్టర్ యాస్మీన్ బాషా, మార్కెటింగ్ డైరెక్టర్ లక్ష్మీబాయి, ఇతర వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు.
పంటల మార్పిడిని ప్రోత్సహించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



