Sunday, May 10, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంమోడీ టూర్‌ ముంగిట బండికి కష్టాలు

మోడీ టూర్‌ ముంగిట బండికి కష్టాలు

- Advertisement -

ఆత్మరక్షణలో బీజేపీ శ్రేణులు..
ఆ పార్టీలోని బండి వ్యతిరేకులకు దొరికిన ఆయుధం
మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్లు

నవతెలంగాణ – కరీంనగర్‌ ప్రాంతీయ ప్రతినిధి
హైదరాబాద్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భారీ బహిరంగ సభకు భారతీయ జనతా పార్టీ శ్రేణులు సమాయత్తమవుతున్న తరుణంలో.. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజరుకు రాజకీయంగా ఊహించని ‘సన్‌స్ట్రోక్‌’ తగిలింది. ఆయన కుమారుడు బండి సాయి భగీరథ్‌పై హైదరాబాద్‌లోని పేట్‌బషీరాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌లో అత్యంత కఠినమైన పోక్సో చట్టం కింద కేసు నమోదు కావడం రాజకీయ వర్గాల్లో పెను సంచలనంగా మారింది. ఒకవైపు మైనర్‌పై లైంగిక దాడి ఆరోపణలు, మరోవైపు హనీట్రాప్‌ చేసి తమను బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నారంటూ సాయి భగీరథ్‌ ఇచ్చిన కౌంటర్‌ ఫిర్యాదుతో ఈ వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. ప్రధాని పర్యటనకు ముందే చోటుచేసుకున్న ఈ పరిణామం కమలనాథులను తీవ్ర ఆత్మరక్షణలో పడేసింది. అయితే ఆ పార్టీలోని గుసగుసలు కూడా మొదలయ్యాయి. పార్టీలోని ఆయన వ్యతిరేకులకు ఒక ఆయుధంగా దొరికింది. ఈ విషయంలో బీజేపీ జాతీయ నాయకత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందన్న చర్చ ఆ పార్టీలో నెలకొంది.

భగ్గుమన్న ప్రతిపక్షాలు
ప్రధాని మోడీ పర్యటనకు ఒకరోజు ముందు ఈ ఘటన వెలుగులోకి రావడం బీజేపీకి మింగుడు పడటం లేదు. ఇప్పటికే ఎమ్మెల్యే గంగుల కార్యాలయంపైనా, మరో ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి కారుపై దాడి విషయంలో వివాదంలో ఉన్న బండి సంజరుకు.. కుమారుడిపై ఏకంగా పోక్సో కేసు నమోదు కావడం రాజకీయంగా పెద్ద దెబ్బ (సన్‌స్ట్రోక్‌) అని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ పరిణామంపై ఆ పార్టీలోని ఆయన వ్యతిరేకులు సీరియస్‌గా తీసుకున్నట్టు తెలిసింది. పార్టీ జాతీయ నాయకత్వానికి ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. అదేవిధంగా బీఆర్‌ఎస్‌, ఇతర ప్రతిపక్ష నేతలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ‘కేంద్ర మంత్రి కొడుకుకైనా, సామాన్యుడికైనా చట్టం ఒకటే. తప్పు చేసిన వారికి కఠిన శిక్ష పడాలి.’ అంటూ మాజీ మంత్రి సబితారెడ్డి డిమాండ్‌ చేశారు. మరో బీఆర్‌ఎస్‌ నేత ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కమార్‌ సైతం స్పందించారు. నిందితుడిని కాపాడే ప్రయత్నం జరుగుతోందని, కేంద్ర మంత్రి కొడుకుపై పోక్సో కేసు నమోదు చేయడానికి ఎందుకు అంత ఆలస్యం చేశారని ప్రశ్నించారు. ప్రస్తుతం రెండు ఫిర్యాదులపై (పోక్సో, బ్లాక్‌మెయిల్‌) పోలీసులు విడివిడిగా లోతైన దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -