దంచి కొడుతున్న వానలు..ఏజెన్సీ అతా కుతులం..

– జల సముద్రంగా మేడారం ప్రాంతం
– పొంగిపొర్లుతున్న జంపన్న వాగు
– తెగిపోయిన బంధాల ఎర్ర చెరువు
– బంధాల, పోచాపూర్ ఆదివాసి రైతుల, పశువులు మృతి
– జిల్లా దిగ్బంధంలో పలు ఆదివాసి గ్రామాలు
– సహాయక చర్యల్లో జడ్పీ చైర్మన్ నాగజ్యోతి, అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు
– ప్రాజెక్ట్ నగర్ వద్ద రహీం ఆటో డ్రైవర్ భార్య, ఇద్దరు పిల్లలు గల్లంతు
– మేడారంలో జంపన్న వాగు ప్రాంతంలో ఇరుక్కుపోయిన 16 మంది చిరు వ్యాపారులు
– సురక్షిత ప్రాంతాలకు తరలించిన రెస్క్యూ టీం
నవతెలంగాణ-తాడ్వాయి 
ములుగు జిల్లాలో విస్తారంగా కురుస్తున్న వర్షాలకు తాడ్వాయి మండలంలోని మేడారం జంపన్న వాగు ఉగ్రరూపం దాల్చింది. దీంతో పోటెత్తిన వరద నీరు గ్రామాల్లో కి చేరుకొని మేడారం, నార్లాపూర్, పడిగాపూర్, ఎలుబాక, కాల్వపల్లి, కన్నెపల్లి, ఊరటం, గోనెపల్లి పలు ఆదివాసి గిరిజన గ్రామాలు జలదిగ్బంధనం చేశాయి. మండలంలోని కాల్వపల్లి గ్రామం పూర్తిగా జలమయమై వర్షపు నీరు ఇళ్లల్లోకి చేరి రహదారుల వెంబటి పారుతూ వాగులను తలపిస్తున్నాయి. నార్లపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని ఎల్పాక, పడిగాపూర్, గ్రామాలు గత ఐదు రోజుల క్రితమే జలదిగ్బంధంలో ఉండిపోయాయి. సరిహద్దు మండల, సరిహద్దు గ్రామమైన ప్రాజెక్ట్ నగర్ గ్రామం లో ఆటో డ్రైవర్ రహీం భార్య ఇద్దరు పిల్లలు గల్లంతయ్యారు. రహీం కుటుంబం, గ్రామస్తులు శోకసముద్రంలో మునిగిపోయారు.
పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకోవడంతో పునరావాస కేంద్రాలకు తరలి వెళ్తున్నారు. బంధాల ఏజెన్సీలో ఎర్ర చెరువు (కొత్త చెరువు) ప్రవాహానికి కొట్టుకుపోయింది. వందల ఎకరాల పంట పొలాలు లక్షల రూపాయల విలువచేసే పశువులు మృతి చెందాయి. నాని లక్ష్మయ్య, నాలి జయబాబు, రాంబాబు, సూరయ్య, చిన్న లక్ష్మయ్య, పెద్ద లక్ష్మయ్య, ఆగబోయిన సుధాకర్, నాలి రామారావు, పోచాపూర్ గ్రామానికి చెందిన అల్లెం పెద్ద బాలయ్య, జిగట రమేష్, వాసం రవి, రామయ్య అనే ఆదివాసి గిరిజన రైతు లకు చెందిన పశువులు మృత్యువాత పడ్డాయి. కొన్ని ఆచూకీ లభించలేదు. లింగాల బంధాల గ్రామపంచాయతీ ఏజెన్సీలో లక్షల విలువ చేసే జొన్న పంట నాశనం అయిపోయింది. లింగాల లో పిడుగు పడి నూనెం రామయ్య అనే ఆదివాసి రైతు కు చెందిన పశువులు మృత్యువాత పడ్డాయి. జిల్లాలో పర్యటిస్తున్న జడ్పీ చైర్మన్ నాగజ్యోతి ముంపు ప్రాంతాలను పరిశీలిస్తూ పోలీసు, రెవెన్యూ, వాతావరణ శాఖ అధికారులతో సమన్వయం చేస్తూ సహాయక చర్యలను ముమ్మరం చేస్తున్నారు. గతంలో 1984, 2004 వచ్చిన వరదల కంటే ఈసారి అధికంగా వచ్చిందని విశ్లేషకులు అంటున్నారు. మేడారంలో హరిత హోటల్ వాణిజ్య వ్యాపారాలు పూర్తిగా మునిగిపోయాయి. మేడారం గద్దెల వరకు వరద నీరు చేరుకుంది. వ్యాపారుల పరిస్థితి అరణ్య గోచరంగా, పూర్తిగా అధ్వానంగా మారింది. ఏజెన్సీ మొత్తం అతలాకుతలం అయింది. లింగాల స్తూపం నుండి బోటిలింగాల మీదుగా గుండాలకు వేసిన డబుల్ రోడ్డు పూర్తిగా కొట్టుకుపోయింది. కాటాపూర్ లో రామాలయం, పెరిక వాడ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, క్రాస్ రోడ్డు వద్ద జహీర్, ఆయన పరిసర ఇండ్లు, కాటాపూర్ ఎస్సీ కాలనీ, మండల కేంద్రమైన తాడ్వాయి, భూపతిపూర్, సింగారం, దామరవాయి గ్రామాలు కూడా పూర్తిగా జలదిగ్బంధంలో ఉండిపోయాయి. కూడా పూర్తిగా జలదిగ్బంధంలో ఉండిపోయింది. ఈ ప్రవాహంలో చాలామంది ఇండ్లు కూలిపోయాయి, మేకలు, గేదెలు గొర్లు కొట్టుకొని పోయాయి. చాలావరకు ఆస్తి నష్టం వాటిలినట్లు స్థానికులు తెలిపారు.
మేడారం జలదిగ్బంధంలో చిక్కుకున్న 16మందిని  కాపాడిన ఎన్ డి ఆర్ ఎస్ (రెస్క్యూ టీం) బృందం
విపరీతంగా కురిసిన వానాలకు మేడారం జంపన్న వాగు పొంగిపొరడంతో జంపన్నవాగు ప్రాంతంలో ఉన్న చిరు వ్యాపారులు వ్యవసాయ పనుల నిమిత్తం వెళ్లిన స్థానికులు జలదిగ్బంధంలో చిక్కుకుపోయారు. ములుగు జడ్పీ చైర్మన్ నాగజ్యోతి, కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ గౌస్ ఆలం ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు స్థానిక తాసిల్దార్ ముల్కనూర్ శ్రీనివాస్, ప్రత్యేక అధికారి అల్లెం అప్పయ్య, ఎంపీడీవో సత్యాంజనేయ ప్రసాద్ స్థానిక అధికారులు మేడారం సర్పంచ్ చిడం బాబురావు, నార్లాపూర్ సర్పంచ్ చిన్నక్క, ఊరటం సర్పంచ్ గొంది శ్రీధర్, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు దండుగుల మల్లయ్య పిఎసిఎస్ చైర్మన్ పోలీస్ సంపత్ గౌడ్, గౌరవ అధ్యక్షులు అనంతరెడ్డి, టిడిపి మండల అధ్యక్షుడు జంగా హనుమంత రెడ్డి, బీజేవైఎం నాయకులు శ్రీకాంత్, వివిధ పార్టీల నాయకులు, యూత్ నాయకులు, పంచాయతీ కార్యదర్శులు, అధికారుల చొరవతో ఎన్ డి ఆర్ ఎస్ (రెస్క్యూ టీం) బృందాలు చేరుకొని 16 మందిని కాపాడారు. వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సమయానికి వచ్చి ప్రాణాలు కాపాడిన రెస్ట్ టీం బృందాలకు స్థానిక ప్రజాప్రతితులు సర్పంచులు అధికారులకు కృతజ్ఞతలు తెలియజేశారు.

Spread the love