ఎయిర్‌ ఇండియా విమానం రష్యాకు మళ్లింపు..!

నవతెలంగాణ – ఢిల్లీ: నుంచి శాన్‌ఫ్రాన్సిస్కో బయలుదేరిన ఎయిర్‌ ఇండియా విమానాన్ని రష్యాకు మళ్లించారు. విమానం ఇంజిన్‌లో సాంకేతిక లోపమే ఇందుకు కారణమని చెబుతున్నారు. విమానంలో 216 మంది ప్రయాణికులు, 16 మంది సిబ్బంది ఉన్నారు. ఇంజిన్ ఫెయిల్యూర్ కారణంగా ఢిల్లీ-శాన్ ఫ్రాన్సిస్కో విమానాన్ని రష్యాలోని మగదాన్‌కు మళ్లించినట్లు ఎయిర్ ఇండియా అధికారులు పేర్కొన్నారు. విమానం అక్కడ సురక్షితంగా ల్యాండ్ అయ్యిందని తెలిపింది. ఢిల్లీ నుంచి అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోకు ఎయిర్‌ ఇండియాకు చెందిన AI173 విమానం బయలుదేరింది. కొద్దిసేపటి తర్వాత ఓ ఇంజిన్‌లో సాంకేతిక లోపాన్ని గుర్తించిన పైలెట్‌ రష్యాలోని సమీపంలోని మగదాన్ విమానాశ్రయాన్ని సంప్రదించి అత్యవసర ల్యాండింగ్‌కు అనుమతి కోరారు. ఇందుకు అనుమతి ఇవ్వడంతో సురక్షితంగా ల్యాండ్‌ అయ్యింది. ప్రయాణికులకు అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తున్నామని, వీలైనంత త్వరగా గమ్యస్థానాలకు చేరుకోవడానికి అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామని ఎయిర్‌ ఇండియా అధికారులు పేర్కొన్నారు. విమానాన్ని బృందం పరిశీలిస్తున్నట్లు తెలిపింది.

Spread the love