– ఏఐటీయూసీ రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి ఎం నరసింహ
– సత్తుపల్లిలో ఏఐటీయూసీ 17వ జిల్లా మహాసభలు ప్రారంభం
నవతెలంగాణ-సత్తుపల్లి
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మిక హక్కులను కాలరాస్తూ, 29 చట్టాలను నాలుగు లేబర్ కోడ్‌లుగా మార్చి కార్పొరేట్ సంస్థలకు కొమ్ముకాస్తోందని ఏఐటీయూసీ రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి ఎం. నరసింహ విమర్శించారు. ఖమ్మం జిల్లా 17వ మహాసభల సందర్భంగా సత్తుపల్లిలోని లక్ష్మీ ప్రసన్న ఫంక్షన్ హాలులో ఆ సంఘ జిల్లా అధ్యక్షులు గాదె లక్ష్మీనారాయణ అధ్యక్షతన జరిగిన మహాసభలో నరసింహ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన మహాసభలో నరసింహ మాట్లాడుతూ… అదానీ, అంబానీ వంటి కార్పొరేట్ శక్తులకు కేంద్ర ప్రభుత్వం దాసోహమంటోందని ఆరోపించారు. కార్పొరేట్ అనుకూల చట్టాల వల్ల శ్రామికుల శ్రమ మరింత దోపిడీకి గురవుతుందన్నారు. ఇప్పటికే రోజుకు 10 నుంచి 16 గంటలు పనిచేయించుకుంటున్నాని ఆందోళన వ్యక్తం చేశారు. చట్టాలు ఏ ప్రభుత్వాల దయాదాక్షిణ్యాలపై రాలేదన్నారు. దశాబ్దాల పోరాటాల ద్వారా సాధించుకున్న హక్కులని ఆయన స్పష్టం చేశారు.
కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ విధానాల వల్ల సంఘటిత రంగంలో కూడా వేతనాలు అసంఘటిత రంగాన్ని తలపిస్తున్నాయని, లేబర్ కోడ్‌ల వల్ల ఉద్యోగ భద్రత, వేతనాలు, సామాజిక భద్రతపై తీవ్ర ప్రభావం పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. నెలవారీ కనీస వేతనం రూ. 26 వేలు ఇవ్వాలని పోరాడుతుంటే, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వేతనాలు తగ్గించడం విడ్డూరంగా ఉందన్నారు. ఒకవైపు బీజేపీని విమర్శిస్తూనే, మరోవైపు 8 గంటల పని విధానాన్ని తొలగించి 10 గంటల విధానం అమలుపరచటం బాధాకరమన్నారు. నేడు (సోమవారం) జరిగే ముగింపు మహాసభకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, జాతీయ కౌన్సిల్ సభ్యులు బాగం హేమంతరావు, పార్టీ జిల్లా కార్యదర్శి దండి సురేష్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి షేక్ షాబీర్ పాషా, జిల్లా సహాయ కార్యదర్శి జమ్ముల జితేందర్ రెడ్డి హాజరవుతారని నరసింహ తెలిపారు. నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి సింగు నరసింహారావు, బీజీ క్లెమెంట్, వర్కింగ్ ప్రెసిడెంట్ శివరామకృష్ణ, జిల్లా కార్యదర్శులు టి. రామాంజనేయులు, నిమ్మటూరి రామకృష్ణ, ఉపాధ్యక్షురాలు సీతామహాలక్ష్మి, నాయకులు వేము రాంబాబు, మహాదేవ లక్ష్మి, దండు ఆదినారాయణ, సముద్రాల సుధాకర్, తడికమళ్ల యోబు, రంజాన్ బీ, ఊడల కృష్ణమూర్తి, వజీర్ మియా, శ్రీనివాసరావు, తెలగారపు రామారావు, కంచి శ్రీను, వల్లెపు శ్రీను, పోలేటి వెంకటేశ్వరరావు, మిట్టపల్లి సత్యావతి, పిల్లి బుచ్చాలు తదితరులు పాల్గొన్నారు. మహాసభ ప్రారంభానికి ముందు అంబేద్కర్ సెంటర్ నుంచి మహాసభల ప్రాంగణం వరకు భారీ కార్మిక ప్రదర్శనను నిర్వహించారు.



